విజయవాడ : ఆదివాసీ మహిళ పాంగి లావణ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణం రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల ఆదివాసీ మహిళ పొంగి లావణ్య రవాణా సౌకర్యం లేక ప్రసవ వేదనతో మరణించడంపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందన్నారు. ఆమె మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాంగి లావణ్య గురువారం రాత్రి ప్రసవం తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని, ఈ పరిస్థితిలో గ్రామస్తులు ఆమెను దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని (పిహెచ్సి)కి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు... కానీ తుఫానుకు ముందే మైదాన ప్రాంతంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆస్పత్రికి తరలించలేకపోయారని తెలిపారు. వంతెన మరమ్మతులకు ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, రోడ్ల పరిస్థితి కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వైద్య సహాయం అందక పాంగి లావణ్య మరణించారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మృతి చెందిన పాంగి లావణ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణం రూ.25 లక్షలు నష్టపరిహారం అందించాలన్నారు. పుట్టిన శిశువుకు పాలు, పోషకాహారం, వైద్యసహాయం తదితర అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలన్నారు. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా గిరిజన ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, ఆరోగ్య సేవలు బలోపేతం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఐ (యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఆదివాసీ మహిళ పాంగి లావణ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణం రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందించాలి : సిపిఐ (యం)
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)