వేలెత్తిన చాలా చేతులకి
రొమ్ములెత్తిన ఎన్నో కాళ్లకి
పలుగుతాళ్లు కట్టేసి ఉన్నాయి
ప్రశ్నించే గొంతులకి
ఉరితాళ్లు బిగించి ఉన్నాయి.
ప్రతీ తాడూ రాజ్యం పేనిందే!
ఎర్రగా కాల్చిన ఊచలతో నాలుకలను కాల్చేయడం,
పిడికిలెత్తిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం
ప్రభువులకి ఆటవిడుపు.
గూడు వొదిలిన పిట్టలకి
కడుపునింపే తోటలనో,
చేపలు నిండిన చెరువులనో
చూపించడం మానేసి
రెక్కలు తెగనరకడం,
తెగబలిసిన పాదాలతో
గుడ్లను నలిపేయడం రాజనీతి!
ఉచితంగా దొరికిన అధికారం
అహంకారమై ఏలుతుంది
ప్రతీ కంటికి ఒకే రంగు గంతలు కట్టి,
చెవుల్లో విధ్వంస గీతాలను కరిగించి పోస్తుంది!
విడగొట్టు, చెడగొట్టు నినాదాలతో
మిణుకు మిణుకుమంటున్న దేశం దీపాన్ని ఆర్పేసే
కసాయిచీకటి గుండెల్లో ఆరని కాష్టాలు వెలిగించే
సరికొత్త సూర్యుడిలా ఎరుపెక్కే రోజు ఎప్పుడో!?
- మిరప మహేష్
99480 39026







కామెంట్‌లు (0)