అతని రాజసపు నడకను ఆక్షేపించకండి
నిరుడు నది దీవించిన
మేలిమి విత్తనాల సంచులు
అతని జేబుల నిండా ఉన్నాయి మరి!
ఆఖరి గింజను కూడా
అమ్మకపు సరుకుగానే చూసిన
పాతిక ఎకరాల భూస్వామి కాకపోవచ్చు
జన్మపరంపర ప్రసాదించిన
పవిత్ర విత్తనాల పరిరక్షకుడతడు!
అతని పూజగదిలో
విత్తనాల గుత్తులే పితృదేవతలు
పాడి పేడతో అలికిన,
పసుపు-కుంకుమల మట్టి గద్దె మీద
పూర్వీకుల ఉత్తరీయపు నూలుపోగు దీపం
నిత్యం వెలుగుతూనే ఉంటుంది
పండించిన నువ్వుల నూనెలో!
అతడి నల్లరేగడి రంగు పెదాలు చూశారా?
ఆకుపచ్చని మొలక నవ్వులకు
ఆహ్వానం పలుకుతున్నట్టు ఉన్నాయ్!
అతని రెండు కళ్లూ గమనించారా?
రాత్రి చిరువానకు తడిసిన
ఆకుమళ్ల జీవకాంతితో
మెరిసిపోతున్నట్టున్నాయ్!
మడిగట్టు మీద కూర్చున్న తీరు,
విడిపోయిన విత్తనం పొరలకు
కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఉంది గదా!
సన్నని వెండి తీగల వేళ్లతో
నిలదొక్కుకున్న మొక్కల తలలను
మురిపెపు చూపులతోనే
నిమురుతున్నట్టుంది గదా!
చూపుల నుంచి తప్పించుకున్న
కలుపు మొక్కలు కనబడగానే,
నారు నలిగిపోకుండా జాగ్రత్తగా ఏరిపారేస్తున్న
అతని అప్రమత్తతలో
తల్లి మనసు తొణికిసలాడడం లేదూ!
జీవవిత్తనం పురుడు పోసుకున్న తర్వాత-
వారసత్వ విత్తనాన్ని
తిరిగి పూజగదిలో ప్రతిష్ఠించే వరకూ
అతనికి విశ్రాంతి ఉండదు!
అతడు-
విత్తనానికి విశ్వసనీయమైన సేవకుడు!
భక్తి, కృతజ్ఞతలు
అతని కళ్లల్లో అంతర్వాహినులు!
అతడు
బలమైన వారసత్వ విత్తనానికి
సదా విధేయుడు!
- నల్లి ధర్మారావు
76609 67313









కామెంట్‌లు (0)