సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న ఓ జీవకణం

3 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 05:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దు:ఖం తన్నుకొస్తుండడం

ఇప్పుడు చేయరాని నేరం!

కడుపు శోకం, దు:ఖ సంద్రం,

ప్రసవ వేదన, బతుకు రోదన...

ప్రకటిత నేరాలిప్పుడు...


విసురు గాలులకు చేతులు అడ్డు పెట్టుకోవడం

ముఖంపై మోపే నేరం

తెగిన గట్టు, తీరం తెగిన గాయం

ఊరవతల ఏరు, చిమ్ముకొస్తున్న నెత్తురు...

ఇంకిపోతేనే సరేసరి, లేదంటే సంకెళ్లే మరి!


చెట్టుకు స్వేచ్ఛ, పిట్టకు పాట, మనిషికి మాట.

నమ్మబలికిన ఉచ్చులో తెరచాటు ఆంక్షలు.

సూరీడిని కన్నెత్తి చూడడం,

రెక్కలను చాపి ఎగరడం,

నిద్రను మేల్కొల్పడం...

విరుద్ధ భావాల ప్రతిబంధకాలు,

చర్యకు ప్రతిచర్య... రాజ్యాంగ దండనే!


స్వేచ్ఛ ఏ రూపంలో ఉన్నా

ప్రశ్నగా మొలుస్తుంది

ప్రశ్న ఓ జీవకణం!

దాన్ని అణచే ప్రతి ప్రయత్నం

దాని విస్తరణకే విత్తనమవుతుంది!

- వినోద్‌ కుత్తుం

96343 14502

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్