“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ” అని రాయల నోట వెలువడిన ఈ వాక్కు కేవలం ఒక పద్యపాదం కాదు, శతాబ్దాల మన స్వయం ప్రకటన, మన జాతి అస్తిత్వ మకుటం! దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడు తరతరాల సంస్కృతికి పట్టంగట్టి నిలిచిన నేల ఇది. కానీ, ఇవాళ సొంత ఇంట అమ్మభాష ఆదరణ కోల్పోయి అనాథగా నిలబడిన దృశ్యం కంటనీరు తెప్పిస్తోంది. ఉపాధి కాంక్షల ఊరేగింపులో మాతృభాషను కడపటికి నెట్టేశాం. పరభాషా మోజులో అమ్మను కడపట నిలబెట్టి కన్నపేగును కాదనుకుంటున్నాం. తెలుగు అధికార భాషాసంఘం నిశ్శబ్దం, తెలుగు అకాడమీ దిక్కులేనితనం, తెలుగు సారస్వత పరిషత్తుల నిర్వీర్యం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కన్నతల్లికి పుట్టింట్లోనే మనుగడ ప్రశ్నార్థకమై, పాలకుల పట్టింపులేక అమ్మకడుపు కోతను అనుభవిస్తోంది. ఇలాంటి దట్టమైన అజ్ఞాన అంధకారంలో, మన అస్తిత్వానికి వెలుగుదివ్వెగా, అక్షర పిడుగులా నిలిచిన యుగపురుషుడు గిడుగు రామమూర్తి పంతులు.
పండితుల గ్రాంథిక పంజరం నుంచి తెలుగు భాషను విడిపించి, “భాష ప్రజలది... ప్రజల భాషే వ్యావహారిక భాష” అని చాటిచెప్పిన భాషా విప్లవ శిఖరం గిడుగు. గ్రాంథికపు బంధనాలను తెంచి, ‘మాట్లాడే భాషే రాయడానికి యోగ్యమైనది’ అని తన యావజ్జీవితాన్ని ధారపోసి, నిరంతర శ్రమతో భాషకు ప్రజాస్వామ్య రూపాన్ని ఇచ్చారు. ఆగస్టు 29న ఆయన జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకోవడం అంటే కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడం కాదు; ఆయన రగిలించిన అక్షర ఉద్యమస్ఫూర్తిని గుండెల్లో పునఃప్రతిష్ఠించుకోవడమే! తెలుగు కేవలం ఒక సమాచార మార్పిడి సాధనం కాదు... అది సంగీతానికీ, సాహిత్యానికి నడుమ వికసించిన అజంత సుందరి! ప్రతి పదమూ అచ్చుతో ముగిసే అజంత భాష కావడమే తెలుగుకు సహజసిద్ధమైన గేయతను, నాద సౌందర్యాన్ని ప్రసాదించింది. అందుకే పాశ్చాత్యులు సైతం దీనిని “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని కొనియాడారు.
ఇవాళ కాన్వెంట్ సంస్కృతి వెల్లువలో తెలుగు అక్షరం తోసేయబడింది. అమృతం లాంటి తెలుగు మాటలు బడిపిల్లల నోట కరువయ్యాయి. అమ్మపాలు తాగి పెరిగిన పిల్లలే అమ్మభాషలో మాట్లాడటానికి నామోషీ పడుతుంటే, తల్లి గుండె ఎంతగా ఘోషిస్తుందో ఊహించండి! ఉపాధి అవకాశాలు ఆంగ్లంతోనే ముడిపడి ఉన్నాయనే భ్రమతో, మాతృభాషను ద్వితీయ శ్రేణికి నెట్టివేశాం. ప్రభుత్వ పాలనలో, న్యాయ వ్యవస్థలో, చివరికి సాంకేతిక ప్రపంచంలో కూడా తెలుగు ప్రాధాన్యం క్షీణించిపోతోంది. గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి, పుస్తక పఠనం మరుగున పడుతోంది. పాలకుల్లో చలనం లేక, విద్యావంతుల్లో భావజారత్వం పెరిగి, భాష తన ఇంట్లోనే పరాయిదైపోతోంది.
అయితే, తెలుగంటే కేవలం మాట్లాడే అక్షరాల కూర్పు కాదు; అది శతాబ్దాల రస ప్రవాహం, తరతరాల సాంస్కృతిక వైభవం! నన్నయ శబ్దశాసనంలో తొంగిచూసే రసార్ద్రత, తిక్కన హరిహరనాథ తత్త్వంలో పలికే జాతీయత, ఎర్రన వర్ణనా వైభవంలో చిందే సౌందర్యం మనది. పోతన భాగవతంలో “సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్” అంటూ రమణీయంగా పొంగిన భక్తి పారవశ్యం, వేమన ఆటవెలదిలో దాగివున్న విశ్వజనీన లోకజ్ఞానం మన అమూల్యమైన సంపద. “తేనెకంటే తీపి తెలుగు” అని రాయల యుగంలో వికసించిన ప్రబంధ మాధుర్యం, పెద్దన మనుచరిత్ర వైభవం, ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం మన అక్షర భాండాగారాలు. ఆధునిక యుగంలో శ్రీశ్రీ కవితా విప్లవ భేరి “మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది”, దేవులపల్లి భావకవిత్వపు అమృత రసధుని, గుర్రం జాషువా గారి గబ్బిలపు ఆవేదన గుండెల్ని పిండేసే కవిత్వమై పండింది ఈ నేలమీదే!
తెలుగు భాషకు పూర్వవైభవం రావాలంటే వేదికలపై చప్పట్లు కొట్టే ఉపన్యాసాలు చాలవు; పునాది స్థాయి నుంచి గట్టి కార్యాచరణ కావాలి. ముందుగా ప్రతీ ఇల్లు ఒక భాషా దేవాలయంగా మారాలి. కన్నపిల్లలతో అచ్చతెలుగులోనే మాట్లాడుతూ, మన సంస్కృతీ సంప్రదాయాల లోతుపాతులను వారికి రుచి చూపించాలి. ప్రాథమిక విద్యనంతా మాతృభాషలోనే తప్పనిసరి చేయాలి. బడిలో తెలుగు కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, ప్రజ్ఞకు మార్గంగా మారాలి. సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాలం, కృత్రిమ మేధ సాంకేతికతల్లో తెలుగును విస్తృతంగా అనుసంధానించాలి. విజ్ఞాన సర్వస్వం అంతా తెలుగులో లభ్యమయ్యేలా నూతన సాంకేతిక రచనలు రావాలి. ప్రభుత్వ జీవోలు, న్యాయస్థానాల తీర్పులు, అధికారిక కార్యకలాపాలు నూరుశాతం తెలుగులోనే సాగాలి. నిద్రావస్థలో ఉన్న తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం, సారస్వత పరిషత్తులకు పూర్వ వైభవం తెచ్చి, పరిశోధనలకు, పుస్తక ప్రచురణలకు భారీగా నిధులు కేటాయించాలి. గిడుగు రామమూర్తి పంతులు రగిలించిన వ్యావహారిక భాషా ఉద్యమ దివ్యజ్యోతిని మనం నలుదిశలా వ్యాపింపజేయాలి.
(ఆగస్టు 29న గిడుగు రామమూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం)
- మెట్టా నాగేశ్వరరావు, 99510 85760







కామెంట్‌లు (0)