తెలుగు దీర్ఘకవితా ప్రక్రియలో నదులను వస్తువుగా చేసుకున్న రచనలు తక్కువేమీ కాదు. కానీ ఈతకోట సుబ్బారావు రాసిన "పెన్నానది" ఆ సంప్రదాయానికి భిన్నమైన మలుపు తీసుకుంది. ఇది కేవలం ఒక నదీ వర్ణన కాదు; నెల్లూరు సీమ చరిత్ర, సంస్కృతి, భక్తి, సాహిత్య వారసత్వం, ప్రజాజీవన స్పందనలను ఒకే ప్రవాహంలో మేళవించిన కావ్యరూపం. 16 భాగాలుగా విస్తరించిన ఈ కవితలో పెన్న కేవలం నీటి ప్రవాహంగా కాక, రచయిత మాటల్లోనే చెప్పాలంటే "జీవన మాతృక"గా ఆవిష్కృతమవుతుంది. కర్ణాటకలోని నంది కొండల్లో పుట్టిన పెన్న, అనంతపురం, కడప మీదుగా నెల్లూరు జిల్లాలో ప్రవేశించి, ఉదయగిరి కోట, తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, సోమశిల జలాశయం, సంగమేశ్వరం, సింహపురి (నెల్లూరు) నగరం మీదుగా బంగాళాఖాతంలో సంగమించే వరకూ — నదీ ప్రవాహ మార్గాన్నే కావ్య నిర్మాణ చట్రంగా స్వీకరించడం ఒక చక్కని కవితా వ్యూహం. దీనివల్ల పాఠకులు నదితో పాటే ప్రయాణిస్తూ, ఒక్కో మలుపులో చరిత్రనూ, పురాణాన్నీ, భౌగోళిక విశేషాలనూ పలకరిస్తూ సాగుతారు.
ఈ కావ్యంలో చరిత్రను కేవలం సమాచారంగా చెప్పకుండా భావరసంతో మేళవించారు. పౌరాణిక అంశాలు, చారిత్రక అంశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని కనిపిస్తాయి. ఉదయగిరి దుర్గం వర్ణనలో "హిందూ ముస్లిం రాజులు / నవాబుల సర్వమత సహనాభావం" అనే పంక్తులు ఆ ప్రాంతపు బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని స్పష్టం చేస్తాయి. మహాభారతాన్ని 15 పర్వాలు, 14,792 పద్యాలలో తెనిగించిన కవిబ్రహ్మను స్మరిస్తూ, "పెన్నా ప్రవాహం కేవలం నీరు కాదు / మన జాతి జ్ఞాపకాల పరంపర" అని కవి చెప్పడంలో నదికీ, సాహిత్యానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరించారు. తిక్కనతో పాటు ఎర్రన, శ్రీనాథుడు, మొల్ల, జక్కన, పిల్లలమర్రి వీరభద్రుడు, మారన వంటి కవుల ప్రస్తావన ... పెన్నానది తీరాన్ని "కవుల కాణాచి"గా చిత్రించే విస్తృత దృష్టిని తెలియజేస్తుంది. ఆధునిక సాహిత్యకారుల ప్రస్తావన కూడా ఇందులో చోటుచేసుకోవడం, ఈ కావ్యం కేవలం పురాతన వైభవాన్ని కీర్తించే ప్రయత్నం మాత్రమే కాదని, నిరంతర సాహిత్య ప్రవాహాన్ని గుర్తించే ప్రయత్నమని సూచిస్తుంది. 1921లో పెన్న తీరాన గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమాన్ని "దక్షిణ భారత స్వాతంత్ర్య ఉద్యమ కేంద్రం"గా అభివర్ణించడం ద్వారా, నదికి రాజకీయ-చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని కవి నొక్కి చెబుతాడు.
"కన్నీళ్లు తుడిచే ముత్తైదువ", "బతుకులు తీర్చిదిద్దే అయ్యోరమ్మ" వంటి వ్యక్తీకరణలు నదిని ప్రజాజీవితంలో మమేకమైన మాతృమూర్తిగా చిత్రిస్తాయి. "గిరి-సరిత్ సంవాదం" అనే భాగంలో కొండలనూ, నదినీ స్నేహితులుగా చిత్రిస్తూ చేసిన ప్రకృతి మానవీకరణ కావ్యానికి భావుకతను జోడిస్తుంది. అనుప్రాసలు, పదసంపుటాలు సహజసిద్ధంగా ప్రవహిస్తూ, పఠనానికి ఒక సంగీతాత్మకతను చేకూరుస్తాయి. కావ్యం చివరి భాగాల్లో సోమశిల ప్రాజెక్టు, కందలేరు జలాశయం వంటి ఆధునిక నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తావన ద్వారా, పెన్న నేటి వ్యవసాయ, తాగునీటి అవసరాలను తీర్చే జీవనాడిగా కవి గుర్తు చేస్తాడు. "పది లక్షల ఎకరాలకు దాహాన్ని తీర్చి" వంటి పంక్తులు కావ్యానికి సమకాలీన ప్రాసంగికతను చేకూరుస్తాయి.
ఇంతటి విస్తృత వస్తువును స్వీకరించడం వల్ల కొన్నిచోట్ల కావ్యం జాబితా తరహా వర్ణనగా అనిపించే అవకాశం ఉంది. ఆలయాలు, రాజవంశాలు, కవుల పేర్లు వరుసగా ప్రస్తావించడం కొన్నిసార్లు భావోద్వేగాన్ని పలుచన చేసే ప్రమాదం లేకపోలేదు. అలాగే, నదీ పరీవాహక ప్రాంతంలో నేడు ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లు కావ్యంలో పెద్దగా చోటు చేసుకోకపోవడం గమనార్హం. నదిని ఆత్మగా చిత్రించే భావుక దృష్టికీ, నేటి పర్యావరణ వాస్తవికతకూ మధ్య మరింత సమతూకం ఉండి ఉంటే బాగుణ్ణనిపించింది. మొత్తంగా చూస్తే, "పెన్నానది" కావ్యం నెల్లూరు సీమ గురించిన ఒక సమగ్ర సాంస్కృతిక దస్తావేజుగా నిలుస్తుంది. డా. మండలి బుద్ధప్రసాద్ తన ముందుమాటలో పేర్కొన్నట్టుగా, ఇది "ఒక ప్రాంతపు ఆత్మగాథ." నదిని కేంద్రంగా చేసుకుని చరిత్ర, భక్తి, సాహిత్యం, ప్రజాజీవనాన్ని ఒకే ప్రవాహంలో బంధించే ఈ ప్రయత్నం, తెలుగు దీర్ఘకవితా సంప్రదాయానికి ఒక ప్రాంతీయ చరిత్ర రచనా నమూనాగా విలువైనది.
- సుధా మురళి
83096 22246







కామెంట్‌లు (0)