సమకాలీన భారతీయ సాహిత్య రంగంలో ఉర్దూ దళిత కవిత్వానికి దృశ్యాత్మక శైలిని అందించిన లబ్ధప్రతిష్ఠుడైన కవి జయంత్ పర్మార్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన పర్మార్ కవితా శ్వాసను, సామాజిక వేదనను అంతే ప్రతిభావంతంగా తెలుగు పాఠకులకు పరిచయం చేశారు యువ కవి, అనువాదకుడు బాల సుధాకర మౌళి. ‘జయంత్ పర్మార్ కవిత్వం’ పేరిట పుస్తకంగా వెలువరించారు. గుజరాత్ సామాజిక అల్లర్ల నేపథ్యం, దళిత అస్తిత్వ ఘర్షణ, ఒక చిత్రకారుడి అంతర్దృష్టి కలబోసిన ఈ అనువాద కవితా సంపుటి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
ఈ సంపుటిలోని కవితలను పరిశీలిస్తే, కవి పర్మార్ సామాజిక వ్యవస్థపై ఎక్కుపెట్టిన విమర్శనాత్మక బాణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా 'మను..' కవితలో శతాబ్దాల నాటి సామాజిక అసమానతలపై, అణచివేతపై కవి తీవ్రమైన అసంతృప్తిని, ధిక్కారాన్ని వ్యక్తపరిచారు. "నా పూర్వీకుల నెత్తురును నువ్వెంత తాగావో నీ సిరలను చీల్చి నేను చూస్తాను" అంటూ సాగే పంక్తులు సామాజిక న్యాయం కోసం తపించే కవి గుండె ఘోషను ఆవిష్కరిస్తాయి. 'దళితకవి చివరి వీలునామా' కవితలో దళిత అస్తిత్వాన్ని, గాయపడిన నీడలను చర్చిస్తూనే, కలం ఈటెగా మారి సిరాబావిలో ఎలా నినదించాలో కవి అద్భుతంగా చిత్రించారు. జయంత్ పర్మార్ కవిత్వంలో చిత్రకళాత్మక ప్రతీకలు ఎంత గాఢంగా పాతుకుపోయాయో 'ఎం.ఎఫ్.హుస్సేన్', 'హుస్సేన్ గుర్రాలు' కవితలను పరిశీలిస్తే అర్థమవుతుంది. మరోవైపు 'మా అమ్మ', 'మా అమ్మ నోట్ పుస్తకం' కవితలు మాతృమూర్తి పడే శ్రమను, ఆమె సృజనాత్మకతను అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించాయి. సూర్యుడు రాకముందే పొయ్యి వెలిగించి, పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటే చందమామలా దగ్గే అమ్మ నిస్సహాయతను, "పొయ్యిలో కట్టెల బదులు మా అమ్మ కాలుతుండటం చూశాను" అన్న పంక్తులు చదువరుల హృదయాలను పిండేస్తాయి.
కవితా సంపుటిలో విస్తరించిన నిరసన స్వరం, అణచివేత తాలూకు వేదన 'నరకం వాసన' కవితలో శతాబ్దాలుగా సాగుతున్న వృత్తిపరమైన దైన్యాన్ని కళ్లకు కడుతుంది. చనిపోయిన జంతువుల చర్మాలను ఉప్పునీటిలో నానబెట్టి, అలసిన పాదాలతో వాటిని శుభ్రం చేసే తల్లి, అందుకు ప్రతిఫలంగా దొరికే మాంసం ముక్కలను పిల్లల కోసం తెచ్చే స్థితిని కవి ఇందులో చిత్రించారు. "ఇప్పుడు కూడా నేను ఆఫీసుకు బయలుదేరే ముందు నా బూట్లను పాలిష్ చేసుకునేటప్పుడు" అంటూ ఆ నరకం వాసన వర్తమానంలోనూ ఎలా వెంటాడుతుందో చెప్పడం ఒక చారిత్రక సత్యం. అలాగే 'జులై 11, 1997' కవిత ఘర్షణల తాలూకు భయానక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. విరిగిన మంచం, సగం కాలిన స్కూల్ బ్యాగ్, రక్తంతో తడిసిన కవిత వంటి ప్రతీకల ద్వారా అల్లర్ల తీవ్రతను చూపించి, "సగం కాలిన భుజంసంచి నాతో చెప్పింది: తనొక కవి, ఒక రెబెల్, అతని గుండెకుంపటిలో నిప్పు మండుతుంది" అంటూ కవిత్వానికి ఉండే తిరుగుబాటు తత్వాన్ని చాటిచెప్పారు.
జయంత్ పర్మార్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన 'పెన్సిల్' కవితా శ్రేణి ఈ సంపుటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 'పెన్సిల్ (1)' కవితలో నీలం రంగు జీన్స్ అమ్మాయి బల్లమీద కూర్చుని పెన్సిల్ చెక్కుతుంటే, దాని నుంచి నల్లని పువ్వు విప్పారడం, తాజా కాగితంపై నల్లని సీతాకోకచిలుకల వంటి అక్షరాలు రూపుదిద్దుకోవడం వంటి చిత్రణలు కవి ఊహాశక్తికి అద్దం పడతాయి. 'పెన్సిల్ (3)'లో ఒక ప్రియమైన చిన్న కూతురు పెన్సిల్‌ను షార్ప్‌నర్‌తో వెలిగిస్తూ, కాగితపు తెల్లని ఆకాశాన్ని కాంతితో నింపే దృశ్యం పాఠకుడి కళ్లముందు కదలాడుతుంది. నల్లని పక్షి, నల్లని చెట్టుపై ఒంటికన్ను సూర్యుడు వంటి ప్రతీకలు కవిత్వంలో సరికొత్త ప్రయోగాత్మక శైలిని పరిచయం చేస్తాయి. సామాజిక వివక్ష రూపాన్ని అత్యంత శక్తివంతంగా, తార్కికంగా ప్రశ్నించిన కవిత 'చెప్పులు'. కవి తన చెప్పులను ప్రయాణానికి, స్వేచ్ఛకు ప్రతీకగా మలిచారు. ఆ చెప్పులు కవిని పల్లెలు, పట్టణాలు దాటి దేశ పార్లమెంటుకు, ఐక్యరాజ్య సమితి, అలాగే చర్చిలు, మసీదులు, గురుద్వారాలకు సైతం నిరాటంకంగా తీసుకెళ్తాయి. ‘కానీ, ఈ చెప్పులు నన్ను హిందూ దేవాలయానికి తీసుకొని వెళ్లినప్పుడు అక్కడ నుండి నేను బయటకు విసిరివేయబడ్డాను అచ్చం నా చెప్పుల్లాగే’- అన్న పంక్తులు అలిఖిత వివక్షా గోడలను బద్ధలు కొడతాయి. మనిషికీ, చెప్పులకూ మధ్య సామాజిక గౌరవంలో తేడా లేకుండా పోయిందనే ఈ నిరసనను తెలుగు పాఠకులకు అందించడంలో సుధాకర మౌళి శతశాతం కృతకృత్యులయ్యారు. జయంత్ పర్మార్ కేవలం కవి మాత్రమే కాదు, అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆ చిత్రకారుడి దృష్టి కోణం ఆయన కవిత్వంలోని ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబిస్తుంది.
ఈ పుస్తకానికి సమకూర్చిన 'విలక్షణమైన దళిత కవి' అనే ముందుమాట పుస్తక ఆత్మను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. అనువాద ప్రక్రియలో బాల సుధాకర మౌళి చూపిన పట్టు, ఉర్దూ, ఆంగ్ల మూలాల నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు వస్తువు తీవ్రత దెబ్బతినకుండా కాపాడటంలో ఆయన సఫలీకృతులయ్యారు. వెనుక పేజీలో చందనపల్లి గోపాలరావు విశ్లేషించినట్లు, ప్రతి కవితలోనూ ఊహాసౌందర్య వికాసాలు, భావ గాంభీర్య చిత్రాలు స్పష్టంగా గోచరిస్తాయి. సామాజిక స్పృహను, కళాత్మక విలువలను సమంగా గౌరవించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఉత్తమ కవితా సంపుటిగా దీనిని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ప్రతులకు: 9676493680
– మర్రాపు వసుంధరా దేవి, 94414 67660








కామెంట్‌లు (0)