“రాజకీయ భావజాలాలకు అతీతమైన కవిత్వం ఉండదు. అటువంటి ఒక కవిత్వం బ్రహ్మపదార్థం ఉంటది అని భావిస్తే అది భ్రమ అవుతుంది. ఇది కళాసాహిత్య రంగాలలో కాలం నిరూపించిన వాస్తవం.”
“ఆమ్లాన” అన్నది శైలజామిత్ర ఆధునిక తెలుగు కవుల మీద, కావ్యాల మీద రాసిన ముప్ఫై విమర్శ వ్యాసాల సంపుటి. తెలుగు సాహిత్యంలో మహిళా విమర్శకుల సంఖ్య తక్కువ. రాయలసీమ మహిళా విమర్శకులు డా. పి. సంజీవమ్మ, ఆచార్య పి. కుసుమకుమారి, ఆచార్య మాలె విజయలక్ష్మి, డా॥ ప్రేమావతి, ఆచార్య ఎం.కె. శ్రావణి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య శివుని రాజేశ్వరి, ఆచార్య కిన్నెర శ్రీదేవి, వి.శాంతమ్మ, ఆచార్య ఆర్. రాజేశ్వరమ్మ వంటి వారి సరసన శైలజామిత్ర చేరడం సంతోషకరం. ఆమెకు మూడు దశాబ్దాల సాహిత్య జీవితముంది. కవిత్వం, కథలు, నవలలు రాసిన ఆమె ఇప్పుడు విమర్శ కూడా రాసారు. “ఆమ్లాన” చదివితే ఒక కవి మరో కవిని చదివి విమర్శించినట్లుగా అనిపిస్తుంది. కవితాత్మకశైలి, కవుల పట్ల అపారమైన మక్కువ, వారి లోపాలను వెతకలేనంత ఇష్టం ఈ పుస్తకంలో కనిపిస్తాయి. అవసరానికి మించిన పారవశ్యమూ అక్కడక్కడా కనిపిస్తుంది. అయినప్పటికీ ఒక్కసారిగా 33 మంది కవులను, తెలుగునాట అన్ని ప్రాంతాలకు చెందిన మూడు తరాల కవులను ఆమె పరిచయం చేశారు. బయటవారికి అంతగా తెలియని కవులను కూడా వెలుగులోకి తెచ్చారు.
‘ఏ గతి రచియించి రేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అని చేమకూర వేంకటకవి బాధపడ్డాడు. నన్ను అర్థం చేసుకునే సహృదయుడు ఎప్పుడో వస్తాడు అని భవభూతి నిర్వేదం ప్రకటించారు. ఆధునిక కాలంలో ఆవేదన అవసరం లేకుండా సమకాలిక రచయితల మీద విమర్శకులు హాయిగా, ఆనందంగా విమర్శ రాస్తున్నారు. శైలజామిత్ర ఇందుకు తాజా ఉదాహరణ. కవిత్వ విమర్శకులకు సాహిత్యం మీద నిర్దిష్టమైన అభిప్రాయంతో పాటు ఆ భాషా సాహిత్య చరిత్ర కూడా తెలిసివుండాలి. శైలజామిత్ర గారికి ఈ విలువలు తెలుసనడానికి ఈ గ్రంథంలో ఆధారాలున్నాయి. “కొన్ని కవిత్వాలు మనకే తెలియకుండా మనతో మాట్లాడతాయి” అనే ఆమె మాటలు కవిత్వం పట్ల ఆమె దృక్పథాన్ని తెలియజేస్తాయి. “వెలుగులు వెదజల్లేలా కవిత్వం రాయటం ఒక కళ. కానీ ‘చీకట్లోని వెలుగును నడిపించడం జనసందేశం’’ అనే మాటలతో ఆధునిక కవిత్వంలోని సామాజిక బాధ్యతను గుర్తించారు.
సాహిత్య విమర్శలో ప్రతి విమర్శకుడికీ ఒక పద్ధతి వుంటుంది. రచయితల సాహిత్య సౌధాన్ని పాఠకులకు అందించడం, రచయితల నాడిని గుర్తించడం, వారి గుండె చప్పుడును వినడం విమర్శకుడి ప్రధాన పని. శైలజామిత్ర ఈ పని సమర్థంగా చేసారు. ఈ గ్రంథంలో ఆమె విమర్శకు ఒక ప్రణాళిక కనిపిస్తుంది. మొదట కవుల జీవిత విశేషాలను, వారి స్థలకాల నేపథ్యాన్ని పరిచయం చేస్తారు. ఆ తర్వాత కవుల నాడిని పట్టుకుని వారి కవిత్వ లక్ష్యాన్ని, సారాన్ని నిర్వచిస్తారు. భావాన్ని మానవత్వంతో మేళవించి పాఠకునిలో కొత్త చైతన్యాన్ని కలిగించడం వోలేటి పార్వతీశం గారి కవిత్వ లక్ష్యం అని గుర్తించారు. జూకంటి జగన్నాథం గారిది ప్రజాతంత్ర విప్లవ దృక్పథం అని, యదుకుల భూషణ్ గారి కవిత్వం జీవనానికి ఆత్మీయమైన ప్రతిబింబమని, రవి వీరెల్లి కవిత్వంలోని ప్రధాన లక్షణం జ్ఞాపకాల సౌందర్యమని పేర్కొన్నారు. అఫ్సర్ కవిత్వం ఒక నిరంతర యాత్ర అని, స్వాతి శ్రీపాద కవిత్వం అంతర్ముఖ భావోద్వేగమని నిర్వచించారు. ఒక్క మాటలో కవిత్వ స్వభావాన్ని చెప్పడం వీలుకాని సందర్భాల్లో ఒక్కో కవి కవిత్వంలోని మూడు ప్రధాన లక్షణాలను గుర్తించి, చెప్పారు. బివివి ప్రసాద్ కవిత్వంలో ఆధ్యాత్మికత, తాత్త్వికత, వాస్తవికతలను; పెరుగు రామకృష్ణ కవిత్వంలో భావపరిపక్వత, వచన కవిత్వ వినూత్నత, ప్రపంచ కవిత్వ అవగాహనను; ఆకెళ్ళ రవి ప్రకాశ్ గారి కవిత్వంలో వ్యక్తిగత అనుభూతి, సామాజిక స్పృహ, తాత్త్విక దర్శనాన్ని గుర్తించారు. శేషభట్టార్ రఘు కవిత్వంలో ప్రకృతి, ప్రేమ, తాత్త్వికత మేళవింపును; రేణుక అయోలా కవిత్వంలో మనసు, మనిషి, సమాజం సహజంగా మిళితమై వుండటాన్ని; ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం, సామాజిక అన్యాయం, వ్యక్తిగత అనుభవాన్ని గుర్తించారు. ఇవన్నీ అలవోకగా చేసిన వ్యాఖ్యలు కావు; కవిత్వాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన మదింపులు.
కవిత్వం పాఠకులపై చూపే ప్రభావాన్నీ ఆమె గుర్తించారు. ప్రసాదమూర్తి కవిత్వం పాఠకులలో అంతర్గత చర్చను రేపుతుందని, వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వం పాఠకుడిని అంతరంగ యాత్రలో తీసుకుపోతుందని పేర్కొన్నారు. ఒక పాఠకురాలిగా కవిత్వంలో మునిగి, మునకలు వేసి గట్టుపైకి వచ్చి చెప్పిన అనుభవాలుగా ఇవి కనిపిస్తాయి. కొన్ని చోట్ల కవి జీవితం కవిత్వంపై చూపిన ప్రభావాన్ని గమనించారు. రవూఫ్ నదీ ప్రవాహం కవితలో ‘ప్రవాహం’, ‘కాలం’, ‘మనిషి’ అనే మూడు పదాలకు అర్థాలను వెలికితీశారు. కవుల కవిత్వంలో పరిణామాన్ని గుర్తించడం కూడా ఆమె విమర్శలోని మరో ముఖ్యాంశం. శైలజామిత్ర కవయిత్రి కావడం వల్ల విమర్శలో సృజనాత్మకత కనిపిస్తుంది. పెరుగు రామకృష్ణ కవిత్వం గురించి చెబుతూ “మానవతా వలయాల్లోంచి రావడం వల్లే వీరి పదాలు నీరెండ వేసిన వృక్షంలా వుంటాయి” అని వర్ణించారు. కవుల పూర్తి పేర్లు, కలం పేర్లతో వున్నవారి అసలు పేర్లు వంటి సంపూర్ణ వివరాలను ఇవ్వాలన్న తపన కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
విమర్శ శైలి నిరాడంబరంగా వుండాలన్న అభిప్రాయం నాకు ఎప్పటి నుంచో వుంది. ఒక సదస్సులో ఆ అభిప్రాయంతో పత్రం సమర్పించి ఒక పండితుని ఆగ్రహానికి గురయ్యాను. అయితే నిరాడంబర శైలే పాఠకులను చేరుతున్నది. శైలజామిత్ర విమర్శ శైలి కూడా సుకుమారమైనదే. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మతో మొదలైన మహిళా విమర్శకుల విమర్శ నాయని కృష్ణకుమారి, పి.యశోదారెడ్డి, కాత్యాయనీ విద్మహే, ఓల్గా వంటి వారి ద్వారా చైతన్యయుతంగా సాగింది, సాగుతున్నది. ఆ తానులో పోగుగా చేరిన శైలజామిత్ర గారికి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి








కామెంట్‌లు (0)