తెలుగు నాట కవిత్వం అనేక రూపాల్లో వెలువడింది. వచన కవిత్వమనే దుడ్డు కర్రలతో పద్యాల నడ్డి విరగ్గొడతాను అన్నాడు పఠాభి. ఆ తర్వాత లఘుకవిత లంఘించింది. డా. అద్దేపల్లి, రామమోహనరావు, డా. రావి రంగారావు లాంటి వారు పొట్టి కవితల్ని వినిపించారు. పొట్టి కవిత మరింత సూక్ష్మ రూపం సంతరించుకుని ‘నానీ’గా డా. ఎన్. గోపి ఆలోచనల్లోంచి ప్రవహించింది. కూనలమ్మ పదాలను ఆరుద్ర ప్రాచుర్యంలోకి తెస్తే, ఆయన్ని అనుసరించి గూగులమ్మ, కోయిలమ్మ, ఓ కూనలమ్మ వంటి పేర్లతో అనేక మంది కవులు రాశారు. శ్రీశ్రీ ‘లిమరిక్కులు’ పేరుతో కవితా ప్రయోగం చేశారు. ఇప్పుడు ‘అబాబీలు’ కవితా ప్రక్రియ ముందుకు వస్తోంది. ఈ ప్రక్రియకు ఆవిష్కర్త, రూపకర్త షేక్ కరీముల్లా.
ఇస్లామియా సాంస్కృతిక నేపథ్యంతో తన అక్షరాలు ఒలికినప్పటికీ, మత ప్రచారం తన సాహిత్య లక్ష్యం కాదని కరీముల్లా చెబుతాడు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదులు తమ విశ్వాసాలపై సాగించే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం, ఇస్లాంను ఛాందసవాద శక్తులు వక్రీకరించకుండా అడ్డుకోవడం, భారత రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రగతిశీల, ప్రజాస్వామిక విలువలను సమర్థించడం తన సాహిత్య లక్ష్యమని పేర్కొంటాడు. ‘బదర్’ అనే పేరుతో ‘అబాబీలు’ మనముందుంచాడు. ఇస్లామియా చరిత్రలో జరిగిన మొట్టమొదటి యుద్ధ మైదానం పేరు ‘బదర్’. అబాబిల్ పక్షులను ప్రతీకగా తీసుకుని, చిన్నవైనా బలమైన శక్తులతో తలపడే అక్షరాలుగా ‘అబాబీలు’ను కరీముల్లా రూపొందించాడు. సమస్త పీడిత ప్రజల పక్షాన నిలబడి పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద శక్తులను ప్రశ్నించడం వీటి లక్ష్యం. ప్రేమ, ఆకలి, మతతత్వం, రాజ్యాంగం, పౌరసత్వం, సామాజిక వివక్ష వంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి.
ఈ ప్రక్రియలో కవి తనలో తాను సంభాషిస్తూ, ‘కరీము’ అనే మకుటంతో అబాబీలను నిర్మిస్తాడు. పై మూడు పాదాలకు ప్రశ్నను లేదా భావాన్ని నిర్మించి, చివరి పాదంతో ముక్తాయింపు ఇస్తాడు. ముస్లిం సమాజంలోని ఆకలి, పేదరికాన్ని పైపై అలంకారాలకు భిన్నంగా చూపిస్తూ-
“కుర్తాపై అత్తరు వాసన
కుక్షిలో కాలిన కమురు వాసన
ఆకలిని మించిన దోస్తు లేదు
కరీము..!
రాత్రెందుకో పగలబడి నవ్వుతోంది” అంటాడు. అత్తరు వాసన వెనుక దాగిన ఆకలిని చూపించే ఈ కవిత సామాజిక దైన్యాన్ని వ్యక్తం చేస్తుంది.
ముస్లింలపై దాడులు, బస్తీల విధ్వంసం వంటి పరిణామాలనూ కవి ప్రశ్నిస్తాడు.
“దుఃఖవర్షంలో తడిసి
ముద్దవుతున్నాను
కబోది బస్తీకి కనికరం లేదు
కరీము...!
ఈ నేల నేలంతా నా సమాధిలా ఉంది.”
ముస్లింలు, దళితుల దేశభక్తిని పదేపదే ప్రశ్నించే ధోరణిని కూడా కవి ఎత్తిచూపుతాడు.
“రిక్టర్ స్కేల్‌పై దేశభక్తి
పడుతూ లేస్తూ పాట్లు పడుతుంది
గుండెను చీల్చి చూపమంటాడు
కరీము..!
కాషాయ మొసలి నోట కర్చిందని చెప్పు.”
మతతత్వ శక్తులపై అక్షరాలను ఆయుధాలుగా సంధిస్తూ-
“వాడి బాణం
మహాటవిని దహిస్తుంది
మొహల్లాలన్నీ ఖాండవ వనాలే
కరీము..!
నాగాస్త్రంలా గురి తప్పకు.” అని అంటాడు.
సినిమా హీరోలు, క్రికెట్ పట్ల యువతలో పెరుగుతున్న అతిమోజును కూడా కవి ప్రశ్నిస్తాడు.
“అజహరుద్దీన్ అవుట్ అయితే
దేశద్రోహమట
అజయ్ జడేజా బౌల్డ్ అయితేనో
కరీము..!
మతం జెర్రిగొడ్డులా మైదానంలోకి పాకింది చూడు.”
మతం కంటే మానవత్వం, ప్రేమ, కారుణ్యం ముఖ్యమనే భావనను ఈ కవితలు వ్యక్తం చేస్తాయి.
“పౌరసత్వం నిరూపించుకోవటం
దేశభక్తికి ఆనవాళ్లను
మీడియా ఆయాసపడుతుంది
కరీము..!
అసత్యానికి ఎన్ని ఛానల్సో” అంటూ పౌరసత్వం, దేశభక్తి పేరుతో జరిగే మీడియా ప్రచారాన్ని కవి ప్రశ్నిస్తాడు. హిందూత్వ పేరుతో ముస్లింలపై జరిగే హింసను ప్రస్తావిస్తూ గుజరాత్ మారణహోమం, బిల్కిస్ బానో ఉదంతాలను గుర్తుచేస్తాడు. మతతత్వ రాజకీయాల మధ్య భయంతో జీవిస్తున్న మైనారిటీల పరిస్థితిని తన అబాబీల్లో ప్రతిబింబిస్తాడు.
కరీముల్లా వినుకొండలో పుట్టాడు. ఉద్యమాల నేపథ్యం, కర్బలా వారసత్వం, సామాజిక అన్యాయాలపై ప్రతిఘటన వంటి అంశాలు అతని కవిత్వంలో కనిపిస్తాయి.
“దౌర్భాగ్యులు పీఠాలపై
నిర్భాగ్యులు ఉరి కంబాలపై
మూకస్వామ్యం పరిఢవిల్లింది
కరీము...
రాజ్యాంగం వేలు పట్టుకో” అంటూ చివరికి రాజ్యాంగమే ఆధారమని చెబుతాడు. మతం పేరిట, ఆవు పేరిట, వస్త్రధారణ పేరిట ద్వేషాన్ని రెచ్చగొట్టే మతతత్వాన్ని ప్రశ్నిస్తూ, మానవత్వం వైపు నిలవాలని ‘అబాబీలు’ సూచిస్తున్నాయి. సమాజంలోని వివక్ష, ఆకలి, మతతత్వం, పౌరసత్వం వంటి అంశాలను సంక్షిప్తమైన కవితా రూపంలో వ్యక్తం చేయడం ఈ ప్రక్రియ ప్రత్యేకత.
- నేలపూరి రత్నాజీ
89199 98753








కామెంట్‌లు (0)