సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెల్ఫ్ ఔట్

12 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కత్తులు విసిరే కాదు

పువ్వులు విసిరీ అయిష్టాన్ని చెప్పొచ్చు

శరీరాలు ఆడవైనా మగవైనా

గుండెలు గుండెలే కదా

ముక్కలు ముక్కలైపోవూ

మనసుతో ఆట మరీ ప్రమాదం

బంధాన్ని పంజరం అని

నీతోనే చెప్పిస్తుంది

ఇష్టం లేని రేపటిని

కొండ అంచు నుండి తోసేసే ముందు

ఒక్క తర్క ద్వారాన్నైనా దాటావా?

లోపలి పశువుతో జాగ్రత్త

హోమంలో కట్టెలకు బదులు

నిన్ను నువ్వే అర్పించుకుంటున్నావేమో!

ఒక్క జీవితానికి వేల పర్యాయపదాలు

పదాల ఎంపికలో తప్పటడుగు దేనికి?

ఒక్క గమ్యానికి వందల కొద్దీ దారులు

తప్పుడు దారుల్లో

నడకల్ని బలిపెట్టడం ఎందుకు?

నరాలను పేల్చే సుఖాల వేట

జీవితానికి వేడుక అవుతుందా?

ఇంటి ఊపిరిని ముక్కలుగా నరికే ముందు

దేహాలకు పుట్టే ప్రేమలకు

ఆఖరి తారీఖు ఉంటుందని ఆలోచించుకోవద్దూ!

ఆకర్షణ ఎండమావుల వెంట

ఏ స్వప్నాల వెలుగుందని?

దీపం పురుగు ఆరాటం!

ఈ 'ఎత్తు' నిన్ను

వ్యక్తిత్వంలేని లోతుల్లోకి నెట్టింది

ఆకాశానివి నువ్వు

చందమామను చంపి మరకల పాలయ్యావు

రెడీమేడ్ బంధాల మోజులో

కనుపాపల గొంతు నులిమే ముందు

నీ కన్నపేగును తడిమి చూసుకున్నావా?

- సాంబమూర్తి లండ

96427 32008

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్