దేనికని కంటున్నాం పిల్లల్ని?
ఎక్కడికి తోస్తున్నారు మన రేపట్ని?
భయపడాలా చూసి మృగాల్ని?
లేక నమ్మాలా ఈ మనుషుల్ని?
మృగాలు ఎప్పుడో మారిపోయాయి చేతకాని పురుగులుగా,
మనుషులే ఇక్కడ బతుకుతున్నారు క్రూరమైన రాక్షసులుగా!
ఇప్పుడు మనిషి కింద మనిషే నలిగిపోతున్నాడు
ధనం, అధికారం ఉన్నోడి కాళ్ల కింద పురుగై చస్తున్నాడు
దేనికోసం ఈ వేట?
ఎవరి కోసం ఈ కోట?
ఏం సాధిస్తారు ఈ డబ్బుతో?
ఒక ప్రాణాన్ని ఏడిపించే హక్కు మీకెక్కడిది?
కోట్లు సంపాదించినా, ఆకాశమంత ఎదిగినా,
తినేది మూడు పూటలే కదా.. ఎంత దాచుకున్నా!
దేశాన్ని మార్చే సత్తా ఉన్న యువత
రోడ్ల మీద పడి ఏడుస్తోంది ఈ పూట
కూడు లేదు, నీరు లేదు, కంటి నిండా నిద్ర లేదు
నెత్తురు కక్కుతూ పరుగెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు!
అంతా చూస్తూ ఏమీ తెలియనట్టు కూర్చున్న పెద్దలారా,
ప్రజల సొమ్ముతో తమ ఇళ్లను నింపుకున్న వ్యక్తులారా…
తింటున్న ఆ తిండి ఎలా అరుగుతోంది?
కంటి నిండా నిద్ర ఎలా పడుతోంది?
ఆ గొంతుల్లో దాహం ఎలా తీరుతోంది?
దేశద్రోహులా మన దేశ యువత?
లాఠీ దెబ్బలు తినడమేనా వారి విధిరాత?
ఇప్పుడు ఏ ఉద్యోగం చేయాలి?
ఎవరిని చూసి స్ఫూర్తి పొందాలి?
యువత కోసం నోరు విప్పని మీడియాను చూసి జర్నలిస్ట్ అవ్వాలా?
పిల్లలపై లాఠీలకు మేకులు గుచ్చి కొట్టే వాళ్లను చూసి పోలీస్ అవ్వాలా?
చదువు, పరీక్ష లేని రాజకీయ వ్యవస్థను చూసి అందులో పాల్గొనాలా?
ఏమీ లేకుండానే అధికార కుర్చీ దొరికితే…
దేశాన్ని నడిపే బాధ్యత ఎలా తెలుస్తుంది?
ప్రశ్నలు…
ఇవి కవితలో రాసిన పంక్తులు కావు.
ఒక తరం గుండెల్లో
రగులుతున్న మంటలు
వాటికి సమాధానం చెప్పాల్సింది
రేపటి చరిత్ర!
- కూరెళ్ల శ్రీ శ్రేయ
93814 86626







కామెంట్‌లు (0)