ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భవిష్యత్తు బొద్దింకలదే!

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మనిషి పుట్టుకైతేనే కదా తెలుస్తుంది మానవత్వమంటే...

అమ్మకి పుట్టిన వాడి చెవులకే కదా వినిపిస్తుంది గర్భశోకపు రోదన!

​నెత్తుటి కెరటాల మీద నవ్వుల పడవలో

లాహిరి గీతాలాపన ఎంతకాలమో సాగదు

పడమటి కొండల్లో తాటిపళ్లలా రాలిపోనున్న జిత్తులమారి నక్కలు,

మండే సూర్యుళ్ల మీద ముళ్లగదలు మూకుమ్మడి దాడి చేయిస్తుంటే,

ఉన్మాదం మతరంగస్థలమ్మీద నగ్ననర్తనమాడుతోంది!

నకిలీలు తప్పుడు తకిలీలతో నెత్తుటి దారాలు తీస్తున్నారు

పిడికిళ్ల కెరటాలతో ఎగిసిపడి హోరెత్తే యువసాగర తీరాన

అధికారం తల దించుకోవాల్సింది పోయి,

నిస్సిగ్గుగా సముద్రమే ఒక అబద్ధమని ప్రచారం చేస్తోంది!

నినాదాలకు సమాధానాలుండవు

ప్రశ్నించడం ద్రోహమైపోయింది

ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టింది

​లేలేత చర్మాలను చీల్చే మేకులు దిగేసిన లాఠీలు,

పట్టిన చేతులిరిగిపోయే రోజొకటి రాకపోదు!

గాయాలు గళాల్ని సవరించుకుంటాయి

అవమానాలు గేయాలై మొలుచుకొస్తాయి

​పడమటి నారింజ ఛాయ ముసుగేసుకున్న పొద్దు

రేపు ఉదయం ఆలపించేది అరుణరాగమే!

నది నడకను వెనక్కి మళ్లించాలనుకుంటే,

అది వరదై ముంచెత్తక తప్పదు

గుహలో జూలు దులుపుతున్న ముసలి సింహాలను

పాడు నూతిలోకి నెట్టడానికి కుందేలుకు బదులు ఇప్పుడు బొద్దింకొచ్చింది

బొద్దింకలదే భవిష్యత్తు!

అధర్మమే ప్రధానమని అహంకరించి

గర్జించే నోళ్లు మూతపడక తప్పదు.

​ఇప్పుడు రాక్షసహస్తాలు నెత్తుటి కళ్లాపు జల్లిన నేల మీద

రేపు పూలవాన కురవక మానదు!


- లాంగుల్య

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్