సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఈ దేశాన్నే ఒక పొలంగా...

2 గంటల క్రితం

Farmers Resisting the Land Grab.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

“మీరింకా బతికే వున్నారా? “

​చల్లని గదిలో అధికార దర్పంతో కూర్చుని

​చాలా విలాసంగా ఎకసెక్కంగా అడిగావు నవ్వుతూ -

​

రైతులం, మా ఖర్మ కాకపోతే మేము బతికే వున్నామని

మాకు మేమే నడిచొచ్చి చెప్పుకోవాల్సి వస్తదా ఇట్లా?

​చనువుతో అన్నానంటున్నావు గానీ

“చావలేదా ఇంకా ” అని చనువుగానూ అడగొచ్చని

మా మట్టి బుర్రకు అస్సలు తట్టలే-

​

అయినా నిన్నొక్కడినే అని ఏముందిలే

ఇవాళ ఎత్తయిన సింహాసనాల మీద కూర్చున్న

పెద్ద పెద్దోళ్లే ఎదురుచూస్తున్నారు

​ఎప్పుడు మా అంతట మేమే పొలాల్ని ఖాళీ చేస్తామా అని

​కాకపోతే ఖాళీ చేసేలా చేద్దామా అని

​ఇంకా కాకపోతే ఏదో తరీఖాలో ఖాళీ చేయిద్దామా అని

భూమితో బతుకు లేదని మా చేతనే అనిపిద్దామని-

​

అప్పుడు అప్పనంగా పొలాలను కట్టగట్టి

ఏ ఒక్కరికో ఇద్దరికో అప్పగిద్దామని గుండు గుత్తగా,

రేవులనూ విమానాల తావులనూ బాజాప్తాగా

దఖలు చేస్తున్నట్లుగానే-

​

కానీ మేం బతికే ఉన్నాం,

​వుంటాం కూడా ఈ మట్టి చేతులతో.

​మేం చచ్చిపోతే అన్నం కూడా చచ్చి పోయినట్లే.

​బతికి తీరుతాం, బతకడానికి అవసరమైతే

​పొలాలను జులూస్ గా తీసుకొచ్చి

రాజధానుల రోడ్ల మీద పెడతాం.

​కాదూ కూడదంటే ఈ దేశాన్నే ఒక పొలంగా చేస్తాం!

​- దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్