మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంతా కూలిపోతున్నా... జీవితం కొనసాగుతూనే ఉంటుంది!

1 గంట క్రితం

అంతా కూలిపోతున్నా.. జీవితం కొనసాగుతూనే ఉంటుంది! సైన్స్‌ ఫిక్షన్‌కు బుకర్‌ పురస్కారం.. 81 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన ఎం. జాన్‌ హారిసన్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 07:49 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

* సైన్స్‌ ఫిక్షన్‌కు బుకర్‌ పురస్కారం.. 81 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన ఎం. జాన్‌ హారిసన్‌

​

భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతోంది? మనిషి నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఒక్కసారిగా కుప్పకూలితే ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు పనిచేయకపోతే, చట్టాలు కనుమరుగైతే, సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు విచ్ఛిన్నమైతే జీవితం ఎలా సాగుతుంది? ఇలాంటి ప్రశ్నలను సాహిత్యంలోకి తీసుకొచ్చిన బ్రిటిష్‌ రచయిత ఎం. జాన్‌ హారిసన్‌ రచించిన 'ది ఎండ్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌' నవలకు 2026 బుకర్‌ పురస్కారం లభించింది. నవంబర్‌ 9న లండన్‌లో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 81 ఏళ్ల వయసులో బుకర్‌ అందుకున్న అత్యధిక వయస్కుడైన రచయితగా హారిసన్‌ చరిత్ర సృష్టించారు. మరో విశేషమేమిటంటే, సైన్స్‌ ఫిక్షన్‌ రచనా ప్రపంచం నుంచి ఎదిగి బుకర్‌ పురస్కారం పొందిన తొలి రచయితగా ఆయన గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాలుగా రచనలు చేస్తున్న హారిసన్‌కు లభించిన ఈ గౌరవం సైన్స్‌ ఫిక్షన్‌ సాహిత్యానికి కూడా ప్రతిష్ఠను తెచ్చింది. 163 నవలలు పోటీపడిన ఈ ఏడాది బుకర్‌ పోటీలో ఆరు రచనలు తుది జాబితాకు చేరగా, మేరీ బియర్డ్‌ నేతృత్వంలోని న్యాయనిర్ణేతల బృందం హారిసన్‌ నవలను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. 198 పేజీల ఈ నవలలో రచయిత ఊహించిన ప్రపంచం మన వర్తమానంలోని అనేక సంక్షోభాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.

​

విపత్తు తరువాత...

'ది ఎండ్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌' కథ సమీప భవిష్యత్తులోని ఇంగ్లండ్‌లో, ముఖ్యంగా కెంట్‌ సముద్రతీర ప్రాంతంలో సాగుతుంది. ఏదో అంతుచిక్కని విపత్తు సంభవించి చాలాకాలం గడిచిపోయింది. కానీ అసలు ఏం జరిగిందో, ఆ విపత్తుకు కారణమేమిటో ఎవరికీ పూర్తిగా తెలియదు. ప్రభుత్వ వ్యవస్థలు దాదాపు పనిచేయడం మానేశాయి. చట్టం, శాంతిభద్రతల బాధ్యత అప్రమత్తత లేని వ్యక్తులు, ఆయుధాలు చేతబట్టిన ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయింది. సముద్రాల్లో కొత్త జీవులు కనిపిస్తున్నాయి. యూరప్‌ ఉనికి కూడా ఒక అంతుచిక్కని విషయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఫిలిప్‌ టెన్నెంట్‌ అనే వ్యక్తి సముద్రతీరానికి కొట్టుకొచ్చే వస్తువులను సేకరిస్తూ జీవిస్తుంటాడు. అతనితో పాటు ఉండే 70 ఏళ్ల అత్త మార్నీ ఒకప్పటి కళాకారిణి. ఆమె ఓ బాలుడిని చంపిన తరువాత తన నివాసాన్ని విడిచి బయలుదేరుతుంది. ఇద్దరి ప్రయాణం కేవలం మనుగడ కోసం చేసే ప్రయత్నం మాత్రమే కాదు. మారిపోయిన ప్రపంచంలో మనిషి తన ఉనికిని, తనకు తెలిసిన వాస్తవాలను తిరిగి అర్థం చేసుకునే ప్రయాణం కూడా. సముద్రంలో ఫిలిప్‌కు దొరికిన ఒక వింత వస్తువు క్రమంగా రూపం మార్చుకుంటూ, పెరుగుతూ, మనుషుల ప్రవర్తనను అనుకరించడం ప్రారంభిస్తుంది. దానిని విక్రయించాలనే ప్రయత్నంలో ఫిలిప్‌ మరింత సంక్లిష్టమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. ఐగెట్టి (iGhetti)గా పిలిచే రూపం మార్చుకోగలిగే వింత జీవుల ఉనికి ఈ విపత్తు వెనుక ఉన్న ప్రధాన రహస్యాల్లో ఒకటి. అయితే రచయిత వాటి గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కథను ముందుకు నడిపిస్తారు. ఆ అస్పష్టతే నవలలో భయాన్ని, ఉత్కంఠను పెంచుతుంది. విపత్తు సంభవించిన తరువాత కూడా పిల్లల పుట్టినరోజు వేడుకలు జరగడం, సముద్రతీర కేఫ్‌లలో కాఫీ తాగడం వంటి సాధారణ దృశ్యాలు కనిపిస్తాయి. ప్రపంచం తలకిందులైనా మనుషులు మాత్రం పాత అలవాట్లను వదులుకోలేకపోవడంలోని వైరుధ్యాన్ని రచయిత వ్యంగ్యంగా చిత్రించారు.

​

వర్తమాన ప్రతిబింబం

ఈ నవలను కేవలం విపత్తు నేపథ్యంలో సాగే సైన్స్‌ ఫిక్షన్‌ కథగా చూడలేం. ఇది సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులపై చేసిన వ్యాఖ్యానం కూడా. విపత్తు అంటే ఎప్పుడూ ప్రకృతి వైపరీత్యమో, యుద్ధమో, గ్రహాంతర జీవుల దాడో కానవసరం లేదని రచయిత సూచిస్తారు. మనిషికి వాస్తవాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం దెబ్బతినడం, నిజానిజాల మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటం కూడా ఒక విపత్తే. ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటం, ప్రజాస్వామ్య విలువలు క్షీణించడం, సామాజిక నియమాలు విచ్ఛిన్నం కావడం, సాంకేతికత మనిషి ఆలోచనలను ప్రభావితం చేయడం వంటి పరిణామాలు ఈ నవలలో అంతర్లీనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌, డిజిటల్‌ ప్రపంచం, కృత్రిమ మేధస్సు ప్రభావంతో వాస్తవం, అవాస్తవం మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులను రచయిత పరోక్షంగా ప్రశ్నిస్తారు. అమెరికాలో ట్రంపిజం, ఇంటర్నెట్‌ ద్వారా వ్యాపించే తప్పుడు సమాచారం, పర్యావరణ విధ్వంసం వంటి సమకాలీన అంశాలు తన ఆలోచనలను ప్రభావితం చేశాయని హారిసన్‌ వెల్లడించారు. ప్రపంచం గురించి మనకు ఉన్న అంచనాలు, వివరణలన్నీ నిరంతర విపత్తుగా మారిపోయినా మనం జీవితాన్ని కొనసాగించాల్సి వస్తే ఏం జరుగుతుందన్న ప్రశ్నే ఈ నవల రచనకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. ఇక్కడ డిస్టోపియా అనే సాహిత్య ప్రక్రియను కూడా గమనించాలి. యుటోపియా అంటే ఆదర్శ సమాజాన్ని ఊహించడం కాగా, డిస్టోపియా అంటే భవిష్యత్తులో సమాజం ఎదుర్కొనే భయానక పరిస్థితులను చిత్రించడం. జార్జ్‌ ఆర్వెల్‌ '1984', ఆల్డస్‌ హక్స్లీ 'బ్రేవ్‌ న్యూ వరల్డ్‌' వంటి రచనలు ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. హారిసన్‌ కూడా అదే సంప్రదాయంలో వర్తమాన సంక్షోభాలను భవిష్యత్తు నేపథ్యంలో ఆవిష్కరించారు. అయితే ఆయన రచనలో మరో ప్రత్యేకత ఉంది. విపత్తు తరువాత ప్రపంచం ఎలా ముగుస్తుందన్నదాని కంటే, అంతా కూలిపోతున్నా మనిషి ఎందుకు, ఎలా బతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడన్నదానిపై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే ఈ నవలను న్యాయనిర్ణేతలు భవిష్యత్తు దృష్టితో చూసిన వర్తమాన రాజకీయాల చిత్రణగా అభివర్ణించారు.

​

రచయిత ప్రస్థానం

1945లో జన్మించిన ఎం. జాన్‌ హారిసన్‌ 1965లో తన తొలి కథను ప్రచురించడం ద్వారా సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1969లో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సైన్స్‌ ఫిక్షన్‌ పత్రిక 'న్యూ వరల్డ్స్‌' సంపాదక బృందంలో చేరారు. 1978 వరకు ఆ పత్రికలో పుస్తకాల విభాగానికి సంపాదకుడిగా పనిచేశారు. సైన్స్‌ ఫిక్షన్‌, ఫాంటసీ రచయితగానే కాకుండా సాహిత్య విమర్శకుడిగానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 'విరికోనియం' కథలు, నవలలతో పాటు 'ది సెంటారీ డివైస్‌', 'క్లైంబర్స్‌', 'ది కోర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌', 'నోవా స్వింగ్‌', 'ది సన్‌కెన్‌ ల్యాండ్‌ బిగిన్స్‌ టు రైజ్‌ అగైన్‌' వంటి రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనాలు. 'క్లైంబర్స్‌' నవలకు 1989లో బోర్డ్‌మన్‌ టాస్కర్‌ పురస్కారం, 'నోవా స్వింగ్‌'కు 2007లో ఆర్థర్‌ సి. క్లార్క్‌ అవార్డు, 'ది సన్‌కెన్‌ ల్యాండ్‌ బిగిన్స్‌ టు రైజ్‌ అగైన్‌'కు 2020లో గోల్డ్‌స్మిత్స్‌ పురస్కారం లభించాయి. ఐదు కథా సంపుటాలు, 13 నవలలతో పాటు తనదైన ప్రత్యేక శైలిలో ఆత్మకథాత్మక రచన కూడా చేశారు. 2022లో బుకర్‌ పురస్కార న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆయన, నాలుగేళ్ల తరువాత అదే పురస్కారాన్ని రచయితగా అందుకోవడం విశేషం. ఈ నవలను ప్రచురించిన 'సర్పెంట్స్‌ టెయిల్‌' స్వతంత్ర ప్రచురణ సంస్థకు కూడా ఇది తొలి బుకర్‌ విజయం. రచయితకు 50 వేల బ్రిటిష్‌ పౌండ్ల నగదు బహుమతి లభించింది. హారిసన్‌ విజయం మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ అంటే కేవలం ఊహాలోకాల్లో విహరించే సాహిత్యం కాదు. సమాజాన్ని, రాజకీయాలను, మానవ సంబంధాలను విశ్లేషిస్తూ భవిష్యత్తు ప్రమాదాలపై హెచ్చరించగల శక్తిమంతమైన సాహిత్య ప్రక్రియ. ఒక రచన విలువ అది ఏ ప్రక్రియకు చెందిందన్నదానిపై కాకుండా, మనిషి జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగిందన్నదానిపై ఆధారపడి ఉంటుందని 81 ఏళ్ల హారిసన్‌ బుకర్‌ విజయం మరోసారి నిరూపించింది.


- సత్యాజీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్