సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లక్షల మంది రక్తదాహానికి ఒక్క మనిషి అడ్డంగా నిలబడ్డాడు!

3 గంటల క్రితం

లక్షల మంది రక్తదాహానికి ఒక్క మనిషి అడ్డంగా నిలబడ్డాడు!
గాంధీజీకి కొడవటిగంటి కుటుంబరావు నివాళి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- గాంధీజీకి కొడవటిగంటి కుటుంబరావు నివాళి

ఇది వందేళ్ల క్రితం సంగతి. మదన మోహన మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతనం భారత స్వాతంత్ర్య పోరాటంతోనూ, పోరాటయోధులతోనూ సంబంధం కలిగి ఉన్నాయి. గాంధీజీతో ఈ రెండు విద్యాసంస్థలకు విడదీయరాని అనుబంధం ఉంది. దక్షిణాఫ్రికా పోరాటం పూర్తి చేసుకొని తొలుత గాంధీజీ కుటుంబం భారతదేశం వచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరనే కొన్ని నెలలు ఉన్నారు. అలాగే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సందర్భంలో గాంధీజీ చేసిన ప్రసంగం భారతదేశంలో ఆయన చేసిన తొలి రాజకీయ బహిరంగ ప్రసంగంగా పరిగణిస్తారు. ఇటు మాలవ్యతోనూ, అటు ఠాగూర్‌తోనూ గాంధీజీకి అనుబంధం ఆసాంతం సాగింది.

​ఈ రెండు విశ్వవిద్యాలయాలు అంటే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ప్రత్యేక గౌరవాభిమానాలుండేవి. ఆ మహామహులు రాసుకున్న ఆత్మకథల్లో, జీవిత చరిత్రల్లో ఈ విషయాలు తరచు కనపడతాయి. ఇక్కడ చదివిన వారే, చదవాలని ఆశపడిన వారు కూడా ఎక్కువే. హిందూ విశ్వవిద్యాలయంలో చదివిన వారిలో రాజకీయ ప్రముఖులు దామోదరం సంజీవయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు; సాహిత్యవేత్తలు విద్వాన్ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు; శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ.ఎస్. రావు, వై. నాయుడమ్మ మొదలైన వారున్నారు. కనుక వీరందరికీ గాంధీజీని చూసే, మాట్లాడే, కలిసే అవకాశం కలిగింది.

​మేధావులైన తెలుగు రచయితలు త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్ వంటి వారు గాంధీజీ గురించి చాలా లోతుగా విశ్లేషించారు. అలాగే కృష్ణశాస్త్రి, దాశరథి, దేవరకొండ బాలగంగాధర తిలక్ కూడా విలక్షణంగా విశ్లేషించారు. అయితే కొకు, తిలక్, సోమసుందర్ రచనలు సంకలనాలలో, పత్రికలలో పెద్దగా తారసపడవు. గాంధీజీ హత్య అయిన తర్వాత ‘ఆంధ్ర మహిళ’ పక్షపత్రిక (ఫిబ్రవరి-మార్చి 1948) సంచికలో కుటుంబరావు గాంధీజీని తనదైన బాణిలో పరిశీలించారు. ఏ కారణం చేతనో ఈ వ్యాసం కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర సాహిత్యపు సంపుటాలలో ఉండదు! సరళత, హేతుబద్ధత తొణికిసలాడే కుటుంబరావు సాహిత్యపు చూపు మహాత్ముని గురించి ఎంత విలక్షణమైనదో మీరే అవలోకించండి.

- డా. నాగసూరి వేణుగోపాల్, 94407 32392

​

“అసంఖ్యాకులైన భారతీయులకు నేను ప్రతినిధినైనానంటే ఆ అధికారాన్ని నేను కష్టపడి సాధించుకున్నాను” అని గాంధీజీ ఒకప్పుడు చెప్పారు. గాంధీజీ సాగించిన రాజకీయోద్యమాలే గాక ఆయన కొల్లాయిగుడ్డా, అల్పాహారమూ, ప్రకృతివైద్యమూ, పేదరికమూ మొదలైనవి కూడా భారత ప్రజానీకానికి ఆయనని ప్రతినిధిని చేశాయి. కోటీశ్వరులూ, ప్రభువులూ, నాయకులూ, రాజకీయ తంత్రజ్ఞులూ ఆయన దర్శనం చేసుకున్నప్పుడల్లా ప్రజల దర్శనం చేసుకున్నారు. గాంధీజీని నిత్యమూ చుట్టుముట్టిన వాళ్ళంతా గాంధీజీ సిద్ధాంతాలను అర్థం చేసుకున్న వాళ్ళనుకోవటం భ్రమ. కోటీశ్వరులకూ, ప్రజలని దోపిడీ చేసే వాళ్ళకూ, అధికార వ్యామోహితులకూ గాంధీ భక్తులమని చెప్పుకునే అధికారం లేదు. ఖరీదైన కార్లలో గాంధీ దర్శనం చేయబోయిన వారంతా, గాంధీలో ఉన్నది ప్రజాశక్తి కనకనే వెళ్ళారు.

దాదాపు 20 ఏళ్ళ క్రితం నేను కాశీ విశ్వవిద్యాలయంలో చదువుతుండగా యాజ్ఞిక్ అనే ఆయన మా బ్లాకుకు వార్డెన్‌గా ఉండేవాడు. ఆయన హిందూమతాభిమాని. ఆ రోజుల్లో గాంధీజీ కాశీ వచ్చి మా విశ్వవిద్యాలయానికి కూడా రానున్నారు. మాతో మా వార్డెన్ గాంధీజీ ‘గోహత్య’ చేశాడు గనుక హిందువు కాదనీ, ఊళ్ళో ఉన్న హిందూ మతాభిమానులందరూ గాంధీజీకి నల్లజెండాలు చూపుతున్నారనీ చెప్పాడు. తాను కూడా వాళ్ళతోపాటు నల్లజెండాలు చూపుతానన్నాడు. ఆ రోజు ఉదయం యాజ్ఞిక్ ఏమి చేసిందీ నాకు తెలియదు. కాని ఆ సాయంకాలం విశ్వవిద్యాలయంలో గాంధీజీ కోసం పెట్టిన మీటింగులో యాజ్ఞిక్ గాంధీపాదాలు తగులుతూ కూర్చుని ఉండటం మేమంతా చూశాం. గాంధీజీలో వ్యక్తిగతమైన ఒక ఆకర్షణశక్తి ఉందనీ, అది అందర్నీ వివశులను చేస్తుందనీ చెప్పవచ్చు. కాని యాజ్ఞిక్, గాంధీజీని గురించి తన విశ్వాసాలు మార్చుకున్నాడనుకోను. వీధిలో ఏదన్నా ప్రమాదం జరిగితే ఆగి చూడకుండా ఉండడం ఎంత అసాధ్యమో గాంధీజీ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం అంత అసాధ్యం.

గాంధీజీని నిత్యమూ చుట్టుముట్టిన వాళ్ళు ఆయనలో ఉన్న ఈ శక్తికి గురి అయ్యారే గాని ఆయనని అర్థం చేసుకోలేదు. ఈ దరిద్ర నారాయణుడు కోటీశ్వరులకే దర్శనం ఇచ్చాడు. ఈ హిందూ మతాభిమాని మతసామరస్యం కోసమే ప్రాణత్యాగం చేశాడు. ఇందులో అర్థం ఉంది. ఈ అర్థం భజనల ద్వారానూ, బొల్లి ఏడుపుల ద్వారానూ వ్యక్తం కాబోదు. “ఒక మహాపురుషుడి కోసం దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది.” నిజమే కాని ఈ మహాపురుషుణ్ణి హత్య చెయ్యటానికి దేశం అన్ని మూలలా కుట్ర సాగింది. ఈ మహాపురుషుడి చావు గురించి ముందుగానే కరపత్రాలు తయారు చేయబడ్డాయి. ఈ అశుభ వార్త కోసం టెలిఫోనుల వద్ద కొందరు ఆత్రంగా వేచికూర్చున్నారు. ఈ మహాపురుషుడు చచ్చిపోగానే సంతోషంగా మిఠాయిలు పంచుకున్నారు. దేశంలో అనేక వేల మందికి – లక్షలమందికి – మహాత్ముడి చావు అత్యవసరమయింది.

ఎందుచేత? ఈ లక్షలమంది రక్తదాహానికి ఒక్క మనిషి అడ్డంగా నిలబడ్డాడు. సాంఘిక వాతావరణమూ, రాజకీయ వాతావరణమూ ప్రజాద్రోహులకు అనుకూలంగా ఉన్నాయి. జీవితంలో కుళ్ళు హెచ్చింది. కుళ్ళులో నుంచి క్రిములు రాక ఏం చేస్తాయి? ప్రజాక్షేమానికి అనర్ధదాయకమైన పరిస్థితులు సాగించగలందులకు గాంధీజీ హత్య కావటంలో నాకెంతో అర్థం స్ఫురిస్తుంది. దేశంలో ఉన్న శ్రామికులూ, దరిద్రులూ, అనాథలూ సుఖపడేటందుకు రాజకీయవేత్తలు ఏంచేశారు? స్వాతంత్ర్యం వచ్చినాక ఈ ప్రజాసామాన్యానికి జీవితం మరింత దుర్భరమైంది. తుపాకులు సర్వసామాన్యమైనాయి. హింస ఏనాడో వచ్చింది. సత్యాన్ని లోతుగా పాతేశాం. ప్రజాక్షేమానికి హాని కలిగించే గుత్త పెట్టుబడిదార్లు, నరపాలకులూ అదుపు చేయబడలేదు. ఉద్యోగం కావాలనటం, తిండి కావాలనటం, బట్ట కావాలనటం దేశద్రోహమయింది. సాంఘిక దోపిడీ – అటువంటిది ఉందనే జ్ఞానం కూడా లేనట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం – అది ఇప్పుడు విజృంభించింది. ఈ దేశంలో ఈనాడు సామాన్య మానవుడై జీవించటం కంటే హేయమైనది లేదు. ఈ వాతావరణంలో గాంధీజీ చావవలసి వచ్చింది. “నేను గాంధీజీ వారసుణ్ణి” అని చెప్పుకోగల ఒక రాజకీయవాది గాని ఒక రాజకీయ సంస్థ గాని దేశంలో లేదు. గాంధీజీకి వారసులు నిరుపేదలు, అనాథలు, అశక్తులు, స్త్రీలు, పిల్లలు.

అధర్మం ప్రబలి ధర్మచ్యుత్తి జరిగినప్పుడు అవతార పురుషుడు జన్మించి దుష్టులను శిక్షించి శిష్టరక్షణ చేస్తాడనేది కల్ల. కృష్ణుడు కిరాతకుడి చేతిలో చచ్చాడు. గాంధీజీని చంపటానికి మరొక పరమ కిరాతకుడు కావలసి వచ్చింది. తనను నాశనం చేసిన అధర్మం ఎటువంటిదో ప్రజలకు చూపటానికే అవతారపురుషులు ఉపకరిస్తారు. గాంధీజీ మనకు తన మృతి ద్వారా హిందూ మతావేశపరుల నగ్న స్వరూపం చూపగలిగారు. గాంధీజీ ఆత్మకు శాంతి కలగాలంటే రాజకీయవాదులూ గాంధీజీ హత్యానేరాన్ని తమమీద వేసుకోవాలి. దేశాన్ని ప్రజలపరం చేయాలి. రాజ్యాన్ని అనాథల, అతి నికృష్టుల రాజ్యం చేయాలి. ధనికుల అధిక లాభాల కోసం ప్రజలు బలికావటం అంతం కావాలి. ఆదర్శ రహితమైన గూడుపుఠాణీ రాజకీయాలూ, ప్రజల జీవితంలో స్థానం లేని మత సంపర్కాలూ తక్షణం నిర్మూలం కావాలి. అదే దేశానికి విముక్తి మార్గం. ఆ మార్గం తొక్కితేనే గాంధీజీ మృతికి ఒక అర్థం ఏర్పడుతుంది.

​

(‘ఆంధ్రమహిళ’ పక్షపత్రిక, ఫిబ్రవరి – మార్చి 1948)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్