సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమాజపు పోకడలపై కవితాస్త్రం

11 గంటల క్రితం

సమాజపు పోకడలపై కవితాస్త్రం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 04:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ కవితా సంపుటి ‘అధ్యక్షరం’లో సమాజంలోని వివిధ కోణాలు, మానవ సంబంధాల లోతులు, ఆధునిక జీవనశైలిలోని వైరుధ్యాలు సరళమైన, సూటియైన పదాలతో ఆవిష్కృతమయ్యాయి. మన చుట్టూ జరిగే సంఘటనలు, మనుషుల ప్రవర్తనలు, జీవితంలోని అనుభవాలను ప్రతిబింబించే ఈ కవితలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ‘అక్షర తూణీరం’ కవితలో అక్షరానికి ఉన్న సృజనాత్మక, విధ్వంసక, రక్షణాత్మక శక్తులను రూపకాలతో ఆవిష్కరించారు. అక్షరమే మానవతకు, నాగరికతకు ప్రాణాధారమని చెబుతూ, కుటుంబం కోసం తన సర్వస్వాన్ని ధారపోసే అమ్మను సృష్టికర్తగా అభివర్ణించారు. జీవితాంతం అందరి బరువు మోసినా చివరికి ఇంట్లోనే విలువలేని ‘పూచిక పుల్ల’లా మారే అమ్మ స్థితిని హృద్యంగా చిత్రిస్తూ, ఆమె నిస్వార్థ ప్రేమను గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాల్సిన సామాజిక బాధ్యతను గుర్తుచేశారు.

‘నేతిబీర’ కవితలో ప్రజాస్వామ్యం తన అసలు విలువలను కోల్పోతున్న తీరుపై కవి ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, డబ్బు ప్రభావంతో నాయకత్వాలు ఏర్పడుతున్న పరిస్థితులను, ప్రకృతి సంపద ప్రజలకు చేరకుండా కొందరి చేతుల్లోకి వెళుతున్న వైనాన్ని విమర్శించారు. పైకి తీపి మాటలు చెప్పినా ఆచరణలో ప్రజాస్వామ్య విలువలు కనిపించని పరిస్థితిని ‘నేతిబీరకాయ’ రూపకంతో ఎత్తిచూపారు. ‘తృప్తి’ కవితలో “నాకున్నది చాలు/ అనుకుంటే మేలు/ ఇంకా కావాలి/ అనుకుంటే చాలు/ నానా అవస్థల పాలు/ ఎన్నో కొంపలు కూలు” అంటూ ఉన్నదానితో తృప్తి చెందడం జీవితంలో ప్రశాంతతకు అవసరమని చెబుతారు. ‘వాగ్దేవి వాణి’లో సరస్వతి రైతుల కష్టాలను, ప్రజల వేదనలను కవిత్వంగా మలచమని మార్గదర్శనం చేసినట్లు కవి హృదయాన్ని ఆవిష్కరించారు. సాహిత్యం ప్రజల బాధలను ప్రతిబింబిస్తూ సమాజాన్ని మేల్కొలిపే సాధనంగా ఉండాలని ఈ కవిత సూచిస్తుంది. ‘ఫలితం’లో “పెరుగును మధిస్తే/ నవనీతం/ సాగరాన్ని మధిస్తే/ అమృతం/ రాజకీయాన్ని మధిస్తే/ అవినీతి భాగోతం/ ఆశ్రిత పక్షపాతం” అంటూ రాజకీయ వ్యవస్థలోని అవినీతి, బంధుప్రీతిని వ్యంగ్యంగా ప్రస్తావించారు. ‘దాహం’లో అంతులేని ధనాశ మనిషికి మనశ్శాంతిని దూరం చేయడమే కాకుండా, ప్రకృతిని నాశనం చేస్తూ బంధాలను దూరం చేసి శత్రుత్వాలకు కారణమవుతుందని హెచ్చరించారు.

‘వాషింగ్ మెషిన్’ కవితలో బట్టలపై మరకలను తొలగించే యంత్రం వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాల మురికిని శుభ్రం చేయలేకపోతోందని చెబుతూ ‘మనం మారాలా?’ అనే ప్రశ్నను సంధించారు. వ్యవస్థలో మార్పు రావాలంటే వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తనలో మార్పు అవసరమనే సందేశాన్ని అందించారు. ‘ఊరకుక్క’లో సమాజంలో గౌరవప్రదంగా కనిపిస్తూ వెన్నుపోటు పొడిచే, ఇతరుల ఎదుగుదలను ఓర్వలేక కుట్రలు చేసే అవకాశవాదుల వక్రబుద్ధిని ఎత్తిచూపారు. ‘సూత్రం’ కవితలో “భారతీయ కుటుంబ వ్యవస్థకు/ అనాదిగా పునాది/ మంగళసూత్రం/ గౌరవప్రదమైన ఆ పునాదికి/ శాశ్వత సమాధి/ నేటి సహజీవన ‘సూత్రం’” అంటూ సంప్రదాయ కుటుంబ వ్యవస్థకు, ఆధునిక జీవన పోకడలకు మధ్య ఉన్న సంఘర్షణను వ్యక్తం చేశారు. ‘భయం’లో “బాధ్యతలని విడిచే జనత/ పెడదారిని పట్టే యువత/ వెర్రి తలలు వేసె నవత/ ప్రయోజనం మరచే కవిత/ ఊహకందబోదు భవిత/ ఎలా ఉంటుందో విధిరాత?” అంటూ సమాజం, యువత సరైన మార్గంలో నడవకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళనను వ్యక్తం చేశారు. ‘వాడు–వీడు’లో డబ్బు కన్నా మనుషులు, బంధాలే మిన్న అని చెబుతూ ధనమే లోకమనుకున్న వ్యక్తి ఒంటరిగా మిగిలిపోగా, అనుబంధాలకు విలువనిచ్చిన వ్యక్తి అందరి మనసుల్లో నిలిచిపోయే తీరును చిత్రించారు. ‘ప్రమోదం–ప్రమాదం’లో ఐక్యతను కలిపే దారంతో, విభజనను విడదీసే కత్తెరతో పోలుస్తూ మనుషుల మధ్య బంధాలను నిలబెట్టే ప్రేమ, ఐక్యతే నిజమైన ఆనందమని తెలియజేశారు.

‘ఆత్మావలోకనం’లో గొప్పలు చెప్పుకోవడం కంటే మాటల్లో, చేతల్లో నిజాయితీ, నిబద్ధత ఉండటమే మనిషికి నిజమైన విలువనిస్తుందని చెబుతారు. ‘తీర్పు’లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు చివరికి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు కారణమయ్యే తీరును వాస్తవికంగా చూపించారు. ‘ఏకాకి’లో తల్లి, భార్య, బిడ్డ అందరూ దూరమై జీవితపు చివరి దశలో ఒంటరిగా మిగిలిన వృద్ధుని ఆవేదనను చిత్రించారు. బంధాలన్నీ దూరమైన ఆయన కనీసం కాకిలా గుంపుగా జీవించే అదృష్టం ఉంటే బాగుండునని కోరుకోవడం హృదయాన్ని తాకుతుంది. ‘NO రసం’ కవితలో అభ్యుదయం కోసం అరసం, విప్లవం కోసం విరసం, మహిళల కోసం నరసం వంటి సాహిత్య సంఘాల పేర్లను ప్రస్తావిస్తూ, సాహిత్యాన్ని సిద్ధాంతాల కట్టుబాట్లకు అతీతంగా స్వేచ్ఛగా ఆస్వాదించే రసజ్ఞుల కోసం ‘NO రసం’ అంటూ చమత్కరించారు. ‘పుడమి పాట’, ‘మట్టి’, ‘కొత్త సంస్కృతి’, ‘ఈతరం తనయుడు’, ‘పర్యవసానం’ వంటి ఇతర కవితల్లోనూ సమాజం, మనుషులు, జీవన విలువలపై కవి ఆలోచనలు వ్యక్తమయ్యాయి. సమాజాన్ని పరిశీలించే దృష్టితో పాటు మనిషి తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలను ఈ కవితలు ముందుకు తెస్తాయి.


- పింగళి భాగ్యలక్ష్మి, 97047 25609

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్