బెంగాల్లో పుస్తక విక్రయ కేంద్రాలపై దాడులు, కార్టూనిస్టు సతీష్ ఆచార్య ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు, ఉత్తరాఖండ్‌లో గాయకుడు దలేర్ మెహందీ పట్ల బీజేపీ మంత్రి సుబోధ్ ఉనియాల్ అనుచితంగా వ్యవహరించిన తీరు.. ఇవన్నీ భిన్నమైన ఘటనలుగా కనిపించినా సృజనాత్మక స్వేచ్ఛపై పెరుగుతున్న నియంత్రణకు, నిరంకుశత్వానికి అద్దం పడుతున్నాయి. తెలుగులోనూ భవానీల పాటలు ఎలా పాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, రీల్స్‌లో చర్చలు సాగుతున్నాయి. తాము ఆమోదించే నిర్దిష్ట చట్రంలోనే కళలు, సంస్కృతి, భావప్రకటన ఉండాలనే నిరంకుశ ధోరణి ఈ పరిణామాల్లో కనిపిస్తోంది. గత పదిహేనేళ్లుగా మనదేశంలో ఈ ధోరణి వివిధ రూపాల్లో పెరుగుతోంది. ముఖ్యంగా మతం, చరిత్ర, కులం, రాజకీయాలు, జాతీయవాదం వంటి అంశాలను సృజనాత్మక రచనల్లో ప్రస్తావించినప్పుడు కొన్ని సంస్థలు, వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆగకుండా దాడులకు దిగుతుండటం పరిపాటి అయింది.
2026 అక్టోబరులో పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన పుస్తక విక్రయ కేంద్రాలపై దాడులు జరిగాయి. కోల్‌కతాలోని జాదవ్పూర్తోపాటు పలు ప్రాంతాల్లో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష సంస్థల పుస్తక కేంద్రాలను ధ్వంసం చేయడం, పుస్తకాలను రోడ్లపై పడేయడం, కొన్ని చోట్ల నిప్పంటించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జాదవ్‌పూర్‌లో దాదాపు 49 ఏళ్లుగా కొనసాగుతున్న పుస్తక కేంద్రాన్ని తొలగించేందుకు బుల్డోజర్ను తీసుకురావడం నిరసనలకు దారితీసింది. దుర్గాపూజ పందిళ్ల వద్ద వామపక్షాలు పుస్తక కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చూడాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ దారుణాలకు కారణమయ్యాయి. ఈ దుశ్చర్యలకు వ్యతిరేకంగా అక్టోబరు 31న కోల్‌కతాలో రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు పుస్తకాలు చేతబట్టి 'వాక్ ఫర్ బుక్స్' పేరుతో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
భిన్నత్వంలోని ఏకత్వం మన దేశం ప్రత్యేకత. దానిని ఖూనీ చేసే దిశగా బీజేపీ పాలన సాగుతోంది. 2025 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాల ప్రచురణ, విక్రయం, పంపిణీని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాలో అరుంధతీ రాయ్ రాసిన 'ఆజాదీ', ఎ.జి. నూరానీ రచించిన 'ది కాశ్మీర్ డిస్ప్యూట్ 1947-2012', అనురాధా భాసిన్ రాసిన 'ఎ డిస్మాంటిల్డ్ స్టేట్' తదితర పుస్తకాలున్నాయి. కాశ్మీర్ రాజకీయ చరిత్ర, ఆర్టికల్ 370 రద్దు, ప్రజల హక్కులు, సైనికీకరణ, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పరిశోధనాత్మక రచనలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిందే చరిత్రగా, దానికి భిన్నంగా ఉన్నదంతా తప్పుడు ప్రచారంగా పరిగణిస్తే పరిశోధనకు స్థానం ఎక్కడ ఉంటుంది? కొన్ని హిందూత్వ సంస్థలు తమకు అనుకూలమైన చారిత్రక వ్యాఖ్యానాన్నే అసలైన చరిత్రగా ప్రచారం చేస్తున్నాయి. భిన్నమైన పరిశోధనలను దేశవ్యతిరేకతగా, హిందూ వ్యతిరేకతగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011లో ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్ర పాఠ్యాంశం నుంచి ఎ.కె. రామానుజన్ రాసిన 'త్రీ హండ్రెడ్ రామాయణాస్' వ్యాసాన్ని తొలగించడం ఇందుకు ఉదాహరణ. రామాయణానికి భారతదేశంలోనే కాకుండా ఆసియా దేశాల్లోనూ అనేక రూపాలున్నాయని, ప్రాంతీయ, జానపద, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో భిన్నమైన కథనాలు ఉన్నాయని ఆ వ్యాసం వివరిస్తుంది. కొన్ని సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో విశ్వవిద్యాలయం దాన్ని తొలగించింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి కూడా కొన్ని చరిత్ర పాఠాలను తీసివేశారు. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ 'మాధోరుభాగన్' (తెలుగులో అర్ధనారి) నవలపై 2014లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలని, రచయిత క్షమాపణ చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. రచనల నుంచి తాను వైదొలుగుతున్నట్లు రచయిత ఆవేదనతో ప్రకటించేంతటి పరిస్థితి ఏర్పడింది. 2016లో మద్రాస్ హైకోర్టు రచయితకు అండగా నిలిచింది. ఒక రచన నచ్చకపోతే విమర్శించాలి తప్ప రచయితను రాయకుండా చేయకూడదని స్పష్టం చేసింది.
సినిమాలకు అడ్డంకులు
సినిమా రంగంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. 2014లో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై హిందూ దేవతల చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందంటూ హిందూత్వ సంస్థలు నిరసనలు తెలిపాయి. 2017లో సంజరు లీలా భన్సాలీ రూపొందించిన 'పద్మావతి'పై కర్ణిసేన తదితర సంస్థలు దాడికి దిగాయి. సినిమా సెట్లను ధ్వంసం చేశాయి. చివరకు పేరు 'పద్మావత్'గా మార్చి, సెన్సార్ బోర్డు సూచించిన మార్పులతో విడుదల చేయాల్సి వచ్చింది. పాటల సాహిత్యంపైనా మతపరమైన అభ్యంతరాల పేరుతో ఒత్తిళ్లు వస్తున్నాయి. 2021లో 'వరుడు కావలెను' సినిమా కోసం గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన 'దిగు దిగు దిగు నాగ' పాట వివాదాస్పదమైంది. దేవతలను కించపరిచేలా పాట రాశారంటూ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ఏడాది గాయని మంగ్లీ పాడిన తెలంగాణ బోనాల పాట 'చెట్టు కింద కూసున్నవమ్మా'పైనా వివాదం రేగింది. మైసమ్మ గ్రామదేవతను చుట్టంలా సంబోధించడం, కొన్ని జానపద పదాలను ఉపయోగించడం దేవతను అవమానించడమేనని కొందరు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ పాటను సుమారు పాతికేళ్ల క్రితమే జానపద రచయిత పాలమూరు రామస్వామి రాశారు. అది నిందాస్తుతి సంప్రదాయానికి చెందిన పాట. గ్రామదేవతలను ఇంటి సభ్యుల్లా భావించి ఆప్యాయతతో ఏకవచనంలో సంబోధించడం గ్రామీణ సంప్రదాయాల్లో సహజం. రామదాసు వంటి భక్తులు తమ కీర్తనల్లో రాముడిని ప్రశ్నించారు. అలాంటి సంప్రదాయాలను అర్థం చేసుకోకుండా జానపద గీతాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గ్రామీణ సంస్కృతిని ఒకే మతపరమైన చట్రంలోకి కుదించడమే!
ఇప్పుడు తెలుగులో భవానీల పాటలు ఎలా పాడాలి, ఎలాంటి పదాలు ఉపయోగించాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై కొన్ని రీల్స్, యూట్యూబ్ ఛానెళ్లలో చర్చలు, ఉపన్యాసాలు సాగుతున్నాయి. భక్తి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా వ్యక్తమవుతుంది. పాటలకూ, ఆచారాలకూ స్థానిక సంప్రదాయాలు, సామాజిక నేపథ్యాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోకుండా కొందరు తమకు తెలిసిన పద్ధతినే సరైనదిగా నిర్ణయించి, మిగతావారికి నియమాలు విధించాలనుకోవడం ప్రమాదకరం. ఇదే కాలంలో బీజేపీ, దాని అనుబంధ సంస్థలు చరిత్రను వక్రీకరించి మరీ అనేక సినిమాలను తీసి, ప్రచారం పొందాయి. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ వంటి సత్యానికి భిన్నమైన సినిమాలకు పెద్దఎత్తున బీజేపీ పెద్దలే ప్రచారం కల్పించారు. మోడీ, అదానీల సంబంధం దేశ ఆర్థిక రంగాన్ని ఏ విధంగా ఒక వ్యక్తి చేతుల్లోకి మళ్లిస్తుందో వివరించిన 'ది ఫ్రెండ్షిప్ ఫైల్స్'పై మాత్రం నిషేధం విధించారు.
కామెడీపైనా, కార్టూన్లపైనా అక్కసు
స్టాండప్ కామెడీ, రాజకీయ కార్టూన్లు కూడా ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నాయి. హిందూ దేవతలను అవమానించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 2021లో హాస్యనటుడు మునావర్ ఫారూఖీ ఇండోర్‌లో అరెస్టు చేయించారు. అయితే ఆయన ప్రదర్శనలో అలాంటి వ్యాఖ్యలు చేశారనేందుకు ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటమే ఆ కళాకారుడిపై అక్కసు పెంచుకోవటానికి కారణమైంది. సుమారు నెలరోజుల తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కూడా ఆయన ప్రదర్శనలకు అడ్డంకులు కొనసాగాయి. కునాల్ కమ్రా వంటి ఇతర హాస్యనటుల కార్యక్రమాలకూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. కార్టూనిస్టు సతీష్ ఆచార్య ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాలపై వేసిన కార్టూన్లు పాలకులకు కంటగింపు అయ్యాయి. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారతదేశంలో అందుబాటులో లేకుండా నిలిపివేయించారు. మరో కార్టూనిస్టు మంజుల్ వేసిన ఎన్నికల సంఘానికి సంబంధించిన కార్టూన్పైనా పరిమితులు విధించారు.
భారత రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం పౌరులకు భావప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఒక భావజాలానికి సంరక్షకురాలిగా కాకుండా, భిన్నమైన భావజాలాలన్నింటికీ సమాన రక్షణ కల్పించే వ్యవస్థగా వ్యవహరించాలి. భిన్నాభిప్రాయాలను సహించలేని సమాజంలో సృజనాత్మకతకు చోటు ఉండదు. ప్రశ్నించే, విభేదించే, కొత్తగా ఆలోచించే హక్కును కాపాడినప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. ఈ మౌలిక సూత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పాలకుల నిరంకుశ చర్యలను సృజనకారులు సమిష్టిగా ఎదుర్కోవాలి. సాహిత్యం, కళలూ ఏలినవాళ్లకు చాకిరీ చేయవు, ప్రజాపక్షం వహిస్తూ సత్యాన్ని ఎలుగెత్తుతాయని చాటి చెప్పాలి.
- సత్యాజీ








కామెంట్లు (0)