అక్షరానికి అధికారానికీ మధ్య సంఘర్షణ ఎలా ఉంటుంది? కత్తిని నమ్ముకున్న రాజు ముందు కలాన్ని నమ్ముకున్న కవి ఎలా నిలబడతాడు? ఈ ప్రశ్నలకు జాషువా ‘పిరదౌసి’ కావ్యం ఒక బలమైన సమాధానం. కవి ఆత్మగౌరవానికి, అహంకారపూరిత అధికార గర్వానికి మధ్య జరిగిన సంఘర్షణను ఈ కావ్యం ఆవిష్కరిస్తుంది. ఒకవైపు తన మాటను నిలబెట్టుకోని గజనీ మహమ్మదు, మరోవైపు తన కవిత్వానికి, ఆత్మగౌరవానికి విలువ ఇచ్చిన పిరదౌసి. కవిని పట్టుకోవడానికి కదిలిన రాజసైన్యం నుంచి, కవి మరణించిన తర్వాత పశ్చాత్తాపంతో అతని ఋణం తీర్చుకోవడానికి ప్రయత్నించిన సుల్తాన్ వరకు సాగిన ఈ కథలో అధికారం తాత్కాలికమనీ, అక్షరం శాశ్వతమనీ జాషువా బలంగా ప్రతిపాదించాడు.
‘పిరదౌసి’ కావ్యం మూడు భాగాలుగా ప్రచారంలో ఉండగా, మనసు ఫౌండేషన్ ప్రచురణలో మూడవ భాగాన్ని రెండుగా విభజించి నాలుగు భాగాలుగా ముద్రించారు. నాలుగవ భాగంలోని 41 పద్యాలలో 14 కంద పద్యాలు ఉన్నాయి. కథా గమనంలో అత్యంత కీలకమైన ఈ భాగంలో కంద పద్యాలకు జాషువా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాడు. సాధారణంగా సుదీర్ఘ వర్ణనలకు పెద్ద వృత్తాలు అనుకూలంగా ఉంటే, వేగవంతమైన సంఘటనలు, నాటకీయ మలుపులు, ఆకస్మిక పరిణామాలను సూటిగా చెప్పడానికి కంద పద్యం అనుకూలంగా ఉంటుంది. అందుకే సుల్తాన్ ఆగ్రహం, సైన్యం కదలడం, పిరదౌసి పలాయనం, సామంతుల హితబోధ, సుల్తాన్ పశ్చాత్తాపం, కవి మరణం వంటి కీలక ఘట్టాలను కంద పద్యాల ద్వారా జాషువా వేగంగా నడిపించాడు.
పారశీక కవులలో శ్రేష్ఠుడైన పిరదౌసిని గజనీ మహమ్మదు పిలిపించి, ‘షానామా’ అనే రాజుల చరిత్రను రచించి తనకు అంకితం చేస్తే ప్రతి పద్యానికి ఒక బంగారు దీనారం ఇస్తానని వాగ్దానం చేశాడు. పిరదౌసి ముప్పై సంవత్సరాలు శ్రమించి అరవై వేల పద్యాలతో గ్రంథాన్ని పూర్తి చేశాడు. రాజసభలో దాన్ని వినిపించి రాజుకు సమర్పించాడు. కానీ వాగ్దానం చేసిన బంగారు నాణేల స్థానంలో వెండి నాణేలు రావడంతో వాటిని తిరస్కరించి రాజు లోభత్వాన్ని విమర్శిస్తూ పద్యాలు రాశాడు. ఆగ్రహించిన సుల్తాన్ కవిని చంపమని భటులను ఆజ్ఞాపించాడు. పిరదౌసి కుటుంబంతో కలిసి గజనీని విడిచి తూసు పట్టణం వైపు వెళ్లిపోయాడు.
సుల్తాన్ ఆజ్ఞతో కవిని పట్టుకోవడానికి సైన్యం కదిలిన దృశ్యాన్ని జాషువా అత్యంత వేగంగా చిత్రించాడు:
అట గజనీ సులతానుని
భటాళి పిరదౌసి కవిని బట్టుకొనుటకై
చటుల కరవాలకరముం
గుటిలముఖం బగుచు గదలె గుఱ్ఱాలపయిన్
కత్తులు ధరించిన భటులు గుర్రాలపై కవిని వెతుకుతూ కదిలే దృశ్యం ఈ పద్యంలో కనిపిస్తుంది. అధికారపు క్రూరత్వానికి, కవి నిరాయుధ స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ నాలుగు పాదాలు స్పష్టంగా చూపిస్తాయి. అయితే సైన్యం చేరుకునేలోపే పిరదౌసి కుటుంబంతో అడవుల్లోకి వెళ్లిపోయాడు. భటులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు సామాన్య ప్రజలు భయాశ్చర్యాలకు గురయ్యారు. ఒక నిరుపేద కవిని చంపడానికి ఇంతటి అశ్వికదళం ఎందుకని వారి ఆవేదన. పిరదౌసి దాక్కున్న అడవిని భటులు కనిపెట్టలేకపోవడం ద్వారా ప్రకృతి, దైవశక్తి కవిని కాపాడినట్లుగా జాషువా చిత్రించాడు.
కవిని పట్టుకోలేకపోయినా సుల్తాన్ కక్ష తగ్గలేదు. పిరదౌసికి ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిని తన శత్రువులుగా పరిగణిస్తానని సామంత రాజులకు ఆజ్ఞలు పంపించాడు. ఈ ఆజ్ఞకు సామంత రాజులలోని కొందరు వివేకవంతులు స్పందించారు. ఒక గొప్ప కవిని ఇలా వేధించడం తగదని భావించి సుల్తాన్‌కు హితవు పలికారు. వారి మాటల్లో కవి శాశ్వతత్వం, అధికారం తాత్కాలికత్వం స్పష్టమయ్యాయి:
కవి శాశ్వతుఁ డుర్వర నా
రవితారముగా వసించు రాజా! మీరో
కవితాకన్యకు పతు లా
రవితారముగా సహింతురా యపకీర్తుల్
కవి కీర్తి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలుస్తుందని, కానీ రాజాధికారం శాశ్వతం కాదని వారు గుర్తుచేశారు. పిరదౌసి రాసిన ‘షానామా’కు వాగ్దానం చేసిన అరవై వేల బంగారు నాణేలను ఇవ్వకుండా వెనుకడుగు వేయడం కూడా తగదని ప్రశ్నించారు. కళలను గౌరవించడం ద్వారా రాజుకు లభించే కీర్తి సంపదకంటే గొప్పదని సూచించారు. ఈ హితబోధ సుల్తాన్ మనసును కదిలించింది. కోపం తగ్గి పశ్చాత్తాపం మొదలైంది. పిరదౌసికి ఇవ్వాల్సిన ధనాన్ని పంపించాలని నిర్ణయించాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. పిరదౌసి వృద్ధాప్యం, అనారోగ్యం, దారిద్ర్యంతో తీవ్రంగా బాధపడుతున్నాడు. రాజు పంపిన ధనం చేరేలోపే అతను మరణించాడు. తండ్రి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో కవి కుమార్తె పలికిన మాటలు ఈ విషాదాన్ని మరింత తీవ్రం చేస్తాయి:
కులగిరులు గరఁగి పోయెడు
పలుకులు దైన్యంబు చిందిపడఁ బలికె నొగిన్
చెలువమున వెలయు కవిసుత
యెలఁబ్రాయపుటింపు విడని మృదుకంఠార్తిన్
తండ్రి జీవితంలో గౌరవంగా అందాల్సిన ధనం ఆయన మరణించిన తర్వాత వచ్చినా దాని విలువ ఏమిటన్న ఆత్మగౌరవం ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది. కవి కుమార్తె ఆ ధనాన్ని తిరస్కరించిందని, పిరదౌసి మరణించాడని తెలుసుకున్న సుల్తాన్ తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. కవి ఋణాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతని సొంత ఊరైన తూసు పట్టణంలో పిరదౌసి పేరుతో సత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ చర్య కూడా జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయింది. జీవితంలో ఇవ్వాల్సిన గౌరవం మరణం తర్వాత ఇచ్చిన సంపదతో తిరిగి రాదు. అందుకే ‘పిరదౌసి’ కేవలం ఒక కవి జీవితంలోని విషాదగాథగా మిగలదు. భౌతిక సంపద, తాత్కాలిక అధికారం కంటే అక్షరం, జ్ఞానం, సృజన శాశ్వతమైనవనే సామాజిక సత్యాన్ని అది ముందుకు తెస్తుంది. కళాకారుడి ఆత్మగౌరవాన్ని గుర్తించని అధికారం చివరకు చరిత్ర ముందు నిలబడాల్సిందేనని జాషువా చెబుతాడు. కవిత్వం కేవలం అధికారాన్ని కీర్తించడానికి మాత్రమే కాదు; అది ప్రశ్నించగలదు, చైతన్యాన్ని రగిలించగలదు, అధికారాన్ని పశ్చాత్తాపానికి గురిచేయగలదు. రాజులు, సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా కవి సృష్టించిన అక్షరం మాత్రం నిలిచిపోతుంది. ఈ సామాజిక చైతన్యమే ‘పిరదౌసి’కి నేటికీ ఉన్న ప్రాసంగికత.
(నేడు మహాకవి గుఱ్ఱం జాషువా జయంతి)
- విల్సన్ రావు కొమ్మవరపు
89854 35515








కామెంట్‌లు (0)