ఇంతా చేసి వంగ పువ్వు రంగులో
15 కాయితాలు
జాతిపిత నవ్వో వైపు
అలనాటి రాణి గారి బావి మరో వైపు
ఎటు చూసినా విలువొకటే
ఒకటి పక్కన రెండు సున్నాలు!
ఎండా వానా, రాత్రీపగలు
గడియారం ముళ్ళ మధ్య పరుగులెత్తి,
సొంత కష్టం కాయితమైతే,
ఏ పేరూ లేని అప్పుకి హామీ పత్రం!
వేళ్ళ సందున మళ్లీ మళ్లీ లెక్క పెడితే
అదో సంబరంలా ఉండేది!
ఏ ఒకటి ఖర్చు పెట్టాలన్నా
కష్టార్జితం కరిగిపోతుందని
మనసంతా గుబులేసేది!
ఊదా రంగు రెపరెపల్లో ఇంకిన
మట్టి గంధం, కాయ కష్టం,
రక్త బంధం ఖర్చుకి కళ్ళెం వేసేది
మెల్లగా మారువేషాలు మొదలై,
చెయ్యి మారితే చాలు
చెమట చెమ్మేదో, మోసపు బుసలేదో తెలీని నోటుగా,
తలలు మార్చే ఓటయ్యింది
రంగుల రాట్నమై
ప్రాణం పణం పెట్టే బలహీనతై
కొండా కోనా, గాలీ జాలిలా
డబ్బు కూడా మాయమై పోయింది!
క్యూఆర్ కోడ్‌లో పడి కొట్టుకుని,
అపరిచితుడి గొంతులో
వందిచ్చావ్, ధన్యవాదాలు అంటూ
విచిత్రంగా సెలవు తీసుకుంటోంది
లక్షలు గల్లంతైనా కాసుల్లా గలగలమనవు!
రూపాయి రాకాపోకా అర్థం కాక,
కరువు బరువై,
బేతాళుడి శవం రాజు భుజం మీద వాలినట్టు
తెలిసి జవాబు చెప్పలేక
తల వెయ్యి ముక్కలయే వ్యాపారంలో
జీవిత బీమా మీద కూడా పన్ను కట్టుకుంటోంది.
అసలేం జరుగుతోంది?
- కాళ్ళకూరి శైలజ, 98854 01882








కామెంట్‌లు (0)