- యుపి ప్రభుత్వ తీరుపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
అలహాబాద్ : గ్యాంగ్‌స్టర్స్ చట్టం చెల్లదని సుప్రీం కోర్టు ప్రకటించినప్పటికీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పదేపదే దాన్ని కొనసాగిస్తుండడంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును పాటించడంలో అధికారులు పదే పదే విఫలమవుతుండడాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీనివల్ల కక్షిదారులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, ఫలితంగా రాజ్యాంగ న్యాయస్థానం విలువైన సమయం వృథా అవుతోందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్, సంఘ వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1986 అమలును కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ యుపి ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు కోరింది. ‘‘ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను ఒకసారి ప్రకటించిన తర్వాత ఆ చట్ట నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడాన్ని అధికారులు కొనసాగించరాదు.’’ అని కోర్టు పేర్కొంది. అంబేద్కర్ నగర్ జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీసు స్టేషన్‌లో అక్టోబరు 23న ఈ చట్టంలోని సెక్షన్ 3(1) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు కావడాన్ని సవాలు చేస్తూ బ్రిజేష్ కుమార్ అలియాస్ బంటీ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు రూలింగ్‌ను ప్రస్తావిస్తూ పిటిషనర్, అధికారులు ఇక ఆ చట్టం కింద చర్యలు తీసుకోలేరని అన్నారు. జస్టిస్ అబ్దుల్ మోయిన్, జస్టిస్ ప్రమోద్ కుమార్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం ఆ ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ ఎటువంటి చర్యలు తీసుకోరాదని పేర్కొంది. ఎవరైనా పాటించకపోతే సదరు అధికారి రికార్డులతో సహా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వుంటుందని హెచ్చరించింది.







కామెంట్‌లు (0)