“మీరింకా బతికే వున్నారా? “
చల్లని గదిలో అధికార దర్పంతో కూర్చుని
చాలా విలాసంగా ఎకసెక్కంగా అడిగావు నవ్వుతూ -
రైతులం, మా ఖర్మ కాకపోతే మేము బతికే వున్నామని
మాకు మేమే నడిచొచ్చి చెప్పుకోవాల్సి వస్తదా ఇట్లా?
చనువుతో అన్నానంటున్నావు గానీ
“చావలేదా ఇంకా ” అని చనువుగానూ అడగొచ్చని
మా మట్టి బుర్రకు అస్సలు తట్టలే-
అయినా నిన్నొక్కడినే అని ఏముందిలే
ఇవాళ ఎత్తయిన సింహాసనాల మీద కూర్చున్న
పెద్ద పెద్దోళ్లే ఎదురుచూస్తున్నారు
ఎప్పుడు మా అంతట మేమే పొలాల్ని ఖాళీ చేస్తామా అని
కాకపోతే ఖాళీ చేసేలా చేద్దామా అని
ఇంకా కాకపోతే ఏదో తరీఖాలో ఖాళీ చేయిద్దామా అని
భూమితో బతుకు లేదని మా చేతనే అనిపిద్దామని-
అప్పుడు అప్పనంగా పొలాలను కట్టగట్టి
ఏ ఒక్కరికో ఇద్దరికో అప్పగిద్దామని గుండు గుత్తగా,
రేవులనూ విమానాల తావులనూ బాజాప్తాగా
దఖలు చేస్తున్నట్లుగానే-
కానీ మేం బతికే ఉన్నాం,
వుంటాం కూడా ఈ మట్టి చేతులతో.
మేం చచ్చిపోతే అన్నం కూడా చచ్చి పోయినట్లే.
బతికి తీరుతాం, బతకడానికి అవసరమైతే
పొలాలను జులూస్ గా తీసుకొచ్చి
రాజధానుల రోడ్ల మీద పెడతాం.
కాదూ కూడదంటే ఈ దేశాన్నే ఒక పొలంగా చేస్తాం!
- దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039







కామెంట్లు (0)