ప్రజాసమస్యలపై పోరాడేవారిని గెలిపించండి : సుబ్బరావమ్మ
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు జెడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలకు సిపిఎం అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా పుట్లూరు జెడ్‌పిటిసి స్థానానికి కె.నాగభూషణం, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి జెడ్‌పిటిసికి కదిరిప్ప నామినేషన్లు దాఖలు చేశారు. అనంతపురం రూరల్ కక్కలపల్లి ఎంపిటిసికి సి.ఆదెమ్మ, రాజీవ్ కాలనీ-2కు ఎస్.మసూద్‌వలీ, నార్పల మండలం కేశేపల్లి నుంచి వై.చిన్న ఎర్రినాగప్పలు నామినేషన్లు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలానికి చెందిన అమరాపురం-1 ఎంపిటిసి స్థానానికి పి.నజీమా భాను, అమరాపురం-2 స్థానానికి పి.మహబూబ్ ఖాన్, చిలమత్తూరు మండలం కోడూరు-2కు ఫిరంగి సౌందర్య నామినేషన్లు వేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జెడ్‌పిటిసి స్థానానికి మండంగి శ్రీనివాసరావు, కురుపాంలో పాలక నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురంలో సిపిఎం రాష్ర్టకార్యదర్శివర్గ సభ్యులు కె. సుబ్బరావమ్మ మాట్లాడుతూ..ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేసి ప్రజలు కోరారు. మన్యం జిల్లాలో తాగు, సాగునీరు, చెక్ డ్యాములు, గిరిజనుల పంటలకు గిట్టుబాటు కోసం సిపిఎం, వామ పక్షాలు నిరంతరం పోరాడుతున్నాయని గుర్తు చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ జెడ్‌పిటిసి స్థానానికి సిరగర శాంతి నామినేషన్ వేశారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు జెడ్‌పిటిసికి సిపిఎం అభ్యర్థిగా పెనగడం గురవయ్య, కర్నూలు జిల్లా దేవనకొండ మండల జెడ్ పిటిసికి బోయపావని, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జెడ్‌పిటిసి స్థానానికి సిపిఎం అభ్యర్థిగా నెరుసుల ప్రేమకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఉండి జెడ్‌పిటిసి అభ్యర్థిగా సిపిఎం తరఫున ధనికొండ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండల జెడ్‌పిటిసి అభ్యర్థిగా మట్ల వాణిశ్రీ, రాజవొమ్మంగి జెడ్‌పిటిసి అభ్యర్థిగా లోతా రామారావు, విఆర్.పురం జెడ్‌పిటిసి అభ్యర్థిగా కారం సుజాత, చింతూరు జెడ్‌పిటిసి అభ్యర్థిగా ఎం.శ్రీదేవి నామినేషన్లు వేశారు. పోలవరం నిర్వాసితులు, గిరిజనులు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం వీరు పోరుబాట సాగిస్తున్న వారిని గెలిపించాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి మండల జెడ్‌పిటిసి అభ్యర్థిగా కాళ్ల తేలయ్యబాబు నామినేషన్ దాఖలు చేశారు.







కామెంట్‌లు (0)