విచారణ వాయిదా
ప్రజాశక్తి-అమరావతి : ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకున్న ప్రాంతాల్లో గడువును కనీసం 48 గంటలు పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసిపి శుక్రవారం హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతోపాటు దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసానికి పాల్పడిన వారిపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించింది. న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వైసిపి అభ్యర్థులు ఎంపిటిసి ఎన్నికల్లో ఇప్పటి వరకు 12,500 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. అక్కడక్కడ జరిగిన కొన్ని ఘటనలను చూపి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.







కామెంట్‌లు (0)