పలు చోట్ల వర్షం
ప్రజాశక్తి - యంత్రాంగం : అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదారి, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో కొంత తెరిపిచ్చినప్పటికీ ఆ తర్వాత జల్లులు పడుతూనే ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ఉదయం ఎండ తీవ్రత మాములుగానే కొనసాగినా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఏలూరు నగరంలో ఉరుములు, పిడుగులతో కొద్దిసేపు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడి జనం సేదతీరారు. నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
తిరుమల జలాశయాల్లో జలకళ!
తిరుమల శ్రీవారి కొండపై జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలకు నీటి చేరిక మెరుగుపడుతోంది. తాజాగా జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరగడం ఊరటనిస్తోంది. దీంతో, తిరుమలలో తాగునీటి లభ్యతపై కొంత భరోసా ఏర్పడుతోంది. ఏడాది పొడవునా లక్షలాది మంది యాత్రికులు తిరుమలను సందర్శిస్తుంటారు. వారి రద్దీకి అనుగుణంగా తాగునీటి అవసరాలు కూడా పెరుగుతుంటాయి. మరోవైపు వసతి గదులు, అన్నప్రసాద వితరణ, పారిశుధ్య నిర్వహణ, ఇతర నిత్యావసరాలకు భారీగా నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం టిటిడికి ఉపశమనం కలిగించే అంశం.







కామెంట్‌లు (0)