శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పులివెందుల ఎన్నికల్లో భద్రతా చర్యలు తీసుకోండి

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌ఇసికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి : వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 2కు వాయిదా వేసింది. గతంలో జరిగిన పులివెందుల జెడ్‌‌పిటిసి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు రిగ్గింగ్‌కు పాల్పడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని, అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇసికి వినతిపత్రం ఇచ్చామని అవినాష్‌‌రెడ్డి తెలిపారు. ఆ వినతిని జిల్లా ఎస్‌‌పికి పంపిన ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోలేదని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది స్పందిస్తూ, జిల్లాల కలెక్టర్లు, ఎస్‌‌పిలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, అనంతరం పూర్తి వివరాలు సమర్పిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. అవినాష్ రెడ్డి ఇచ్చిన వినతిపత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఇసిని ఆదేశించారు.

డోన్‌లో దొంగ ఓట్లను అడ్డుకోవాలని పిల్‌

నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో తొలగించిన ఓటర్ల పేర్లతో దొంగ ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వైసిపి అభ్యర్థి వల్లే చైతన్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 2కు వాయిదా వేసింది.

బేతంచెర్లలో పోలీసు బందోబస్తు

నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో తగిన పోలీసు భద్రత కల్పించాలంటూ వైసిపి ఛైర్మన్ అభ్యర్థి దూదేకుల దస్తగిరి సమర్పించిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. నవంబరు 1న జరగనున్న ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగినంత పోలీసు బలగాలను నియమించడం లేదని పేర్కొంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అవసరమైన సందర్భాల్లో రీ పోలింగ్ సమయంలో, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మొబైల్ పోలీసు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, పిటిషనర్ సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 2కు వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్