ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జెడ్‌పిటిసి స్థానానికి వైసిపి తరఫున నామినేషన్ వేసిన బొత్స లక్ష్మణరావు కుమారుడు చైతన్యబాబు నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. చైతన్యబాబుకు విజయనగరం కార్పొరేషన్ లోని 41వ డివిజన్ లో ఓటు ఉందని, పూసపాటిరేగ జెడ్‌పిటిసి స్థానానికి ఎలా నామినేషన్ వేస్తారని పూసపాటిరేగ జనసేన అభ్యర్థి కోట్ల రేవతి భర్త కోట్ల రఘు నామినేషన్ల పరిశీలన సందర్భంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓటరు జాబితా పరిశీలించగా గరివిడి మండలంలో ఓటు లేకపోవడం, అర్బన్ ప్రాంతంలో ఓటు ఉండడంతో చైతన్యబాబు నామినేషన్ ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి పి.కిరణ్ కుమార్ ప్రకటించారు.
సిరి సహస్ర నామినేషన్లపై అభ్యంతరం
తెర్లాం, కొత్తవలస మండలాల నుంచి జెడ్‌పిటిసి అభ్యర్థిగా రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన జెడ్‌పి మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర నామినేషన్లపై వైసిపి జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపారు. సిరి సహస్ర పుట్టికతో జైన్ అనే ఒసి కులానికి చెందిన వారని, ఆమె నామినేషన్ పత్రాల్లో బిసి గా నమోదు చేశారని బెల్లాన ఫిర్యాదు చేశారు. సిరి సహస్ర జైన్ కులానికి చెందిన ముష్కాన్ రమేష్ కుమార్ కుమార్తె అని, సిరి సహస్ర అసలు పేరు ముష్కాన్ జైన్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. రిటర్నింగ్ అధికారి పి.కిరణ్ కుమార్ స్పందిస్తూ ఆమె బిసి కులానికి చెందిన వారని తహశీల్దార్ సర్టిఫికెట్ ఇచ్చినందున నామినేషన్ ను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఒసి మహిళకు బిసి సర్టిఫికెట్ ఇచ్చిన తహశీల్దార్ పై కోర్టుకు వెళ్తామని చంద్రశేఖర్ తెలిపారు.






కామెంట్‌లు (0)