శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మనసు దోచే దోశలు ..

-743 నిమిషాల క్రితం

dosalu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 07:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పెనంపై పిండి పడగానే గుండ్రంగా విస్తరించి.. అంచులు బంగారు రంగులోకి మారి, కరకరలాడుతూ కనిపిస్తుంటే ఆ దోశను చూడగానే తినాలనిపిస్తుంది! ఉదయాన్నే టిఫెన్లో దోశ కనిపిస్తే చాలు.. చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి! సాధారణంగా బియ్యం, మినప్పప్పుతో చేసే దోశల నుంచి గోధుమపిండి, రాగులు, ఓట్స్, చిరుధాన్యాలు, కూరగాయలు వంటి రకరకాల పదార్థాలతోనూ ఎన్నో రకాల దోశలను తయారు చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తదనం జోడిస్తే చాలు.. ప్రతిరోజూ తినే దోశలోనే సరికొత్త రుచులను ఆస్వాదించవచ్చు. మరి టిఫిన్‌ మెనూలో కొన్ని వెరైటీ దోశల తయారీ తెలుసుకుందామా !

011

ఓట్స్‌ ‌దోశ

కావాల్సినవి: ఓట్స్‌ – కప్పు, బియ్యప్పిండి – ½ కప్పు, రవ్వ – ¼ కప్పు, పెరుగు – ¼ కప్పు, ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), అల్లం – చిన్న ముక్క (సన్నగా తరిగినది), జీలకర్ర – ½ స్పూను, మిరియాల పొడి – ¼ స్పూను, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత,

నీళ్లు – అవసరమైనంత, నూనె – దోశలు కాల్చడానికి.

తయారీ : ముందుగా ఓట్స్‌ను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్‌ పొడి, బియ్యప్పిండి, రవ్వ వేసి బాగా కలపాలి. అందులో పెరుగు, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పలుచని పిండిలా తయారు చేసుకోవాలి. ఈ పిండిని 15–20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఓట్స్‌, రవ్వ నీటిని పీల్చుకోవడం వల్ల పిండి చిక్కబడితే మరికొద్దిగా నీళ్లు కలపాలి.

తర్వాత దోశ పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. పిండిని గరిటెతో తీసుకుని పెనంపై పలుచగా పోయాలి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మధ్యస్థ మంటపై కాల్చాలి. అడుగు భాగం బంగారు రంగులోకి మారి, అంచులు కరకరలాడిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి. అంతే.. రుచికరమైన ఓట్స్‌ దోశలు రెడీ! వీటిని కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా పల్లీల చట్నీతో వేడివేడిగా తినాలి. ఓట్స్‌లో కరిగే పీచుపదార్థమైన బీటా-గ్లూకాన్‌ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తోడ్పడుతుంది.

palak dosa

పాలక్‌ దోశ

కావాల్సినవి: దోశ పిండి – 2 కప్పులు, పాలకూర – 2 కప్పులు, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – ½ స్పూను, ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత,

నూనె – దోశలు కాల్చడానికి.

తయారీ: ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు మరిగించి పాలకూరను అందులో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. చల్లారిన తర్వాత పాలకూరను పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకుని, అందులో పాలకూర ముద్ద, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. తర్వాత దోశ పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. గరిటెతో పిండిని తీసుకుని పెనంపై గుండ్రంగా పలుచగా పరచాలి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మధ్యస్థ మంటపై కాల్చాలి. దోశ అడుగు భాగం చక్కగా కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా ఉడికిన తర్వాత పెనం మీద నుంచి తీసేయాలి. అంతే.. రుచికరమైన పాలక్‌ దోశలు రెడీ.

atta

అట్టా దోశ

కావాల్సినవి : గోధుమ పిండి (అట్టా) – కప్పు, బియ్యప్పిండి – ¼ కప్పు, బొంబాయి రవ్వ – 2 స్పూన్లు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ½ స్పూను, అల్లం – చిన్న ముక్క, కరివేపాకు – కొద్దిగా, కొత్తిమీర – 2 స్పూన్లు, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరమైనంత, నూనె – దోశలు కాల్చడానికి.

తయారీ : ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పలుచని దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 15–20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత దోశ పెనం పొయ్యిమీదపెట్టి, వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. పిండిని గరిటెతో తీసుకుని పెనంపై పలుచగా, గుండ్రంగా పోయాలి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మధ్యస్థ మంటపై కాల్చాలి. దోశ అడుగు భాగం బంగారు రంగులోకి మారి, అంచులు కరకరలాడుతున్నప్పుడు మరోవైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత పెనం మీద నుంచి తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి. రుచికరమైన క్రిస్పీ వీట్ దోశ సిద్ధం! కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

dosa multi

మల్టీ గ్రెయిన్‌ దోశ

కావాల్సినవి: రాగులు – ¼ కప్పు, జొన్నలు – ¼ కప్పు, సజ్జలు – ¼ కప్పు, గోధుమలు – ¼ కప్పు, బియ్యం – ½ కప్పు, మినప్పప్పు – ¼ కప్పు, మెంతులు – ½ స్పూను, అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ½ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – దోశలు కాల్చడానికి, నీళ్లు – అవసరమైనంత.

తయారీ: ముందుగా రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, బియ్యం, మినప్పప్పు వేర్వేరుగా శుభ్రం చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి మెంతులు కలిపి, తగినన్ని నీళ్లు పోసి 5–6 గంటల పాటు నానబెట్టాలి. నానిన పదార్థాల్లోని నీటిని వంపేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి 6–8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. పిండి పులిసిన తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలపాలి. పిండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు దోశ పెనాన్ని వేడి చేసి, కొద్దిగా నూనె రాయాలి. గరిటెతో పిండిని తీసుకుని పెనంపై గుండ్రంగా పలుచగా పరచాలి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి మధ్యస్థ మంటపై కాల్చాలి. దోశ అడుగు భాగం బంగారు రంగులోకి మారి, అంచులు కరకరలాడిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత పెనం మీద నుంచి తీసేయాలి. అంతే.. రుచికరమైన మల్టీగ్రెయిన్‌ దోశలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా పల్లీల చట్నీతో వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్