మన పేగుల్లోనే గుండె జబ్బులకు కళ్లెం వేసే ఓ సూక్ష్మజీవి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పేరుకుపోయే కొవ్వు ఫలకాలను తగ్గించే సామర్థ్యం దానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్యాక్టీరాయిడ్స్ యూనిఫార్మిస్ అనే ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఓ కొవ్వు ఆమ్లం కాలేయంలో కొలెస్ట్రాల్ తయారీని నియంత్రిస్తున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ ఆమ్లం ధమనుల్లోని కొవ్వు ఫలకాలను సగానికి తగ్గించింది. మనుషుల నమూనాల్లోనూ ఈ ఆమ్లం స్థాయులకు, రక్తంలోని కొవ్వు పదార్థాలకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. పేగుల్లోని సూక్ష్మజీవుల సహాయంతో గుండె జబ్బులను ఎదుర్కొనే కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చనే ఆశలను ఈ పరిశోధన రేకెత్తిస్తోంది.
మన శరీరంలో నివసించే సూక్ష్మజీవులన్నీ హానికరమైనవి కావు. వాటిలో అనేకం మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలు శరీరానికి అందడానికి సహాయపడతాయి. అయితే, వాటి ప్రయోజనాలు జీర్ణక్రియకే పరిమితం కావని శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. పేగుల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే పదార్థాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. అక్టోబర్ 7న నేచర్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధనలో బ్యాక్టీరాయిడ్స్ యూనిఫార్మిస్ (Bacteroides uniformis) అనే బ్యాక్టీరియాకు గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. గుండె జబ్బుల నివారణ, చికిత్సలో ఈ సూక్ష్మజీవి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
గుండెకు ముప్పు
గుండె జబ్బులకు దారితీసే ప్రధాన సమస్యల్లో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఒకటి. కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైన పదార్థమే అయినప్పటికీ, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు అది ఇతర కొవ్వు పదార్థాలతో కలిసి రక్తనాళాల గోడల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఇలా కొవ్వు పేరుకుపోయి ఫలకాలుగా ఏర్పడుతుంది. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడి, క్రమంగా సన్నబడతాయి. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో అథెరోస్క్లెరోసిస్ అంటారు. రక్తనాళాలు సన్నబడటంతో గుండెకు అవసరమైన రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కొవ్వు ఫలకం చిట్లి రక్తం గడ్డకట్టినప్పుడు ధమని మూసుకుపోయి గుండెపోటు రావొచ్చు. ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, అవసరమైనప్పుడు వైద్యులు సూచించే మందులు కీలకంగా పనిచేస్తాయి.
అయితే, కొలెస్ట్రాల్ నియంత్రణలో పేగుల్లోని సూక్ష్మజీవుల పాత్ర ఏమిటన్నది ఇటీవలి కాలంలో పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మన పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు నివసిస్తాయి. వీటిలో కొన్ని ఆహారంలోని పదార్థాలను విచ్ఛిన్నం చేసి, శరీరంలోని జీవక్రియలను ప్రభావితం చేసే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థాలు పేగులకే పరిమితం కాకుండా కాలేయం పనితీరును, రక్తంలోని కొవ్వు పదార్థాల స్థాయిలనూ ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులున్న వారిలో, ఆరోగ్యంగా ఉన్నవారిలో పేగు బ్యాక్టీరియా ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధకులు వారి మల నమూనాలను విశ్లేషించారు. ఈ పరిశీలనలో గుండె జబ్బులున్నవారిలో బ్యాక్టీరాయిడ్స్ యూనిఫార్మిస్ బ్యాక్టీరియా సాధారణంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ సూక్ష్మజీవికి గుండె ఆరోగ్యంతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో మరింత లోతుగా పరిశోధించారు.
బ్యాక్టీరియా ప్రభావం..
పరిశోధకులు అధిక కొవ్వు ఆహారం తీసుకునేలా చేసి, ధమనుల్లో కొవ్వు ఫలకాలు ఏర్పడే పరిస్థితిని కల్పించిన ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటికి బ్యాక్టీరాయిడ్స్ యూనిఫార్మిస్ బ్యాక్టీరియాను అందించినప్పుడు, చికిత్స పొందని ఎలుకలతో పోలిస్తే ధమనుల్లో కొవ్వు ఫలకాలు సుమారు మూడో వంతు తగ్గినట్లు గుర్తించారు. రక్తంలోని మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు కూడా తగ్గాయి. అంటే, ఈ బ్యాక్టీరియా ప్రభావం రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలకే పరిమితం కాకుండా, ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియపైనా ఉండవచ్చని ప్రయోగాలు సూచించాయి.
ఈ ప్రభావానికి కారణమేమిటో తెలుసుకునేందుకు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే పదార్థాలను పరిశీలించారు. వాటిలో పెంటాడెకానోయిక్ ఆమ్లం (C15:0) అనే కొవ్వు ఆమ్లం కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆమ్లాన్ని విడిగా ఎలుకలకు అందించినప్పుడు ధమనుల్లో కొవ్వు ఫలకాల పరిమాణం సుమారు 50 శాతం తగ్గింది. బ్యాక్టీరియాను నేరుగా అందించినప్పుడు కనిపించిన ప్రయోజనం కంటే, అది ఉత్పత్తి చేసే ఈ ఆమ్లాన్ని అందించినప్పుడు కొవ్వు ఫలకాలు మరింత తగ్గడం పరిశోధనలో ముఖ్యమైన అంశం. పేగు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే పదార్థాల ఆధారంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించే కొత్త చికిత్సలను అభివృద్ధి చేయవచ్చనే అవకాశాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
సాధారణంగా కాలేయంలో కొలెస్ట్రాల్ తయారీకి హెచ్‌ఎంజీ-సీఓఏ రిడక్టేజ్ (HMG-CoA reductase) అనే ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించే స్టాటిన్ మందులు కూడా ఈ ఎంజైమ్ పనితీరును అడ్డుకుంటాయి. పెంటాడెకానోయిక్ ఆమ్లం సైతం ఈ ఎంజైమ్ పనితీరును నిరోధించడం ద్వారా కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడే కాలేయ కణాల గ్రాహకాల పనితీరు మెరుగుపడే అవకాశమూ కనిపించింది. అంటే, ఒకవైపు కొలెస్ట్రాల్ తయారీ తగ్గడం, మరోవైపు రక్తంలో ఇప్పటికే ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియ మెరుగుపడటం వంటి రెండు ప్రయోజనాలు కలగవచ్చని పరిశోధన సూచిస్తోంది.
చికిత్సకు కొత్త దారి
ఈ పరిశోధనలో భాగంగా 200 మందికి పైగా వ్యక్తుల రక్తం, మల నమూనాలనూ విశ్లేషించారు. రక్తంలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నవారిలో పెంటాడెకానోయిక్ ఆమ్లం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇది మనుషుల్లోనూ ఈ ఆమ్లానికి, కొవ్వు జీవక్రియకు మధ్య సంబంధం ఉండవచ్చనే అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. అయితే, ఈ పరిశీలనతోనే ఈ ఆమ్లం తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిర్ధారించలేం. ఇందుకు మరిన్ని పరిశోధనలు అవసరం.
ప్రస్తుతం ఈ పరిశోధనలో కొవ్వు ఫలకాలు తగ్గినట్లు లభించిన ప్రధాన ఆధారాలు జంతు ప్రయోగాల నుంచే వచ్చాయి. ఈ బ్యాక్టీరియాను లేదా అది ఉత్పత్తి చేసే పెంటాడెకానోయిక్ ఆమ్లాన్ని మనుషులకు అందించినప్పుడు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది? ఎంత మోతాదులో ఇవ్వాలి? దీర్ఘకాలంలో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఇప్పటికే గుండె జబ్బులున్నవారికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఆమ్లం రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, మనుషుల్లో గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గించగలదా అన్నది నిర్ధారించాల్సి ఉంది. భవిష్యత్తులో మనుషులపై నిర్వహించే అధ్యయనాల్లోనూ ఇదే తరహా ఫలితాలు నిర్ధారణ అయితే, గుండె జబ్బుల నివారణ, చికిత్సలో మరో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)