సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతిభతోపాటు కొత్తదనాన్ని ఆహ్వానించే తత్వం కూడా ఉండాలి. పాత్రల ఎంపికలో వైవిధ్యం, నటనలో సహజత్వం, కథల పట్ల ఆసక్తి.. ఈ లక్షణాలతో ముందుకు సాగుతున్నారు జో శర్మ. నటిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ దశమ వార్షికోత్సవ వేడుకల్లో అంతర్జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న జో శర్మ సినీరంగ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళా పాత్రలతో ప్రేక్షకులకు చేరువ కావాలని కోరుకుంటున్న ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. 
హైదరాబాద్‌లో జన్మించిన జో శర్మ బాల్యం నాగ్‌పూర్, ముంబయి నగరాల్లో గడిచింది. ఆంధ్రప్రదేశ్‌తోనూ, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోతో అనుబంధం కొనసాగిస్తున్న ఆమెకు తెలుగు, హిందీ, మరాఠీ భాషలపై పరిచయం ఉంది. భిన్న ప్రాంతాలు, సంస్కృతుల మధ్య పెరగడం తన ఆలోచనా పరిధిని విస్తృతం చేసిందని ఆమె అంటారు. విభిన్న వ్యక్తుల జీవితాలు, వారి భావోద్వేగాలు, జీవనశైలిని అర్థం చేసుకోవడం నటిగా తనకు ఉపయోగపడింది. నటనపై ఆసక్తితో రంగస్థల ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు. అమెరికాలో థియేటర్ ద్వారా పొందిన అనుభవం ఆమెకు నటనలో మరింత పరిణతిని అందించింది. పాత్రను అర్థం చేసుకోవడం, సంభాషణలకు అనుగుణంగా భావాలను పలికించడం, ప్రేక్షకులతో అనుసంధానమవడం వంటి అంశాల్లో రంగస్థలం ఎంతో నేర్పిందని ఆమె అభిప్రాయం.
సొంతంగా నిర్మాణ సంస్థ
సొంతంగా థియేటర్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కళాత్మక ప్రయోగాలకు కూడా అవకాశం కల్పించుకుంటున్నారు. ‘M4M’లో జర్నలిస్టుగా.. జో శర్మ నటనా ప్రయాణంలో ‘‘M4M – Motive for Murder’’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె రాధ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రను పోషించారు. నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథలో నిజాన్ని వెలికితీయాలనే పట్టుదలతో ముందుకు సాగే జర్నలిస్టుగా కనిపించారు. పాత్రలోని ఆత్మవిశ్వాసం, పరిశోధనాత్మక దృక్పథం, భావోద్వేగాలను తెరపై సహజంగా పలికించేందుకు కృషి చేశారు. ఈ పాత్ర కోసం దర్శకుడు మోహన్ వడ్లపట్ల వద్ద మూడేళ్లపాటు శిక్షణ పొందినట్లు జో శర్మ తెలిపారు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం నుంచి, దాన్ని తెరపై ఆవిష్కరించే విధానం వరకు ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. ఈ సినిమాతో ఆమె నటనకే పరిమితం కాలేదు. మోహన్ వడ్లపట్ల, రాహుల్‌తో కలిసి కథా రచనలోనూ భాగస్వామ్యం వహించారు. నిర్మాతగానూ ఒక సినిమా నిర్మాణంలో వివిధ విభాగాల పనితీరును దగ్గరగా గమనించడం వల్ల కథను చూసే తన దృక్పథం మరింత విస్తృతమైందని చెబుతున్నారు. నటిగా ఒక పాత్రను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, రచయితగా కథలోని పాత్రల బలాబలాలను గుర్తించడం కూడా అంతే ముఖ్యమని ఆమె అభిప్రాయం.
మొదటి సినిమాకే అవార్డులు
‘‘M4M – Motive for Murder’’ 2026 మే 8న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ఈ చిత్రం గుర్తింపు పొందింది. విడుదలకు ముందే 15 అవార్డులు అందుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఓ పుస్తకంలో రాసినట్లుగానే వరుస హత్యలు జరిగితే ఎలా ఉంటుంది? ఆ శవాలతో హంతకుడు ఓ ఆర్ట్ వేస్తే? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘‘ఎం4ఎం (Motive for Murder)’’. ఈ అనుభవం భవిష్యత్తులో మరిన్ని మంచి కథల్లో భాగమవ్వాలనే ఉత్సాహాన్ని కలిగించిందని చెబుతున్నారు. మహిళా పాత్రలకు ప్రాధాన్యం నటనలో ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం జో శర్మకు ఇష్టం లేదు. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలనుకుంటారు. భవిష్యత్తులో యాక్షన్ పాత్రల్లోనూ, గ్లామర్‌కు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటించాలని కోరుకుంటున్నారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనే భావనకు తగిన పాత్రల ద్వారా తన ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన నటీనటులు ఉన్నారని చెప్పే జో శర్మ, నటనలో నిరంతర అభ్యాసానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. నటనతోపాటు రచన, నిర్మాణ రంగాల్లోనూ అనుభవాన్ని పెంచుకోవడం తనకు కొత్త అవకాశాలను అందిస్తోందని చెబుతున్నారు.
కొత్త కథలు.. సవాళ్లు
‘ఎం4ఎం’ చిత్రంలో జో శర్మ, పాత్రలోని బలాన్ని, భావోద్వేగ తీవ్రతను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నటనతో పాటు కథా రచనలోనూ భాగస్వామ్యం కావడం ఆమెకు పాత్రపై మరింత అవగాహన కల్పించింది. ఒకే మూసలో ఇమిడిపోకుండా, కొత్త కథలు.. సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకోవాలన్న ఆసక్తి ఆమెలో కనిపిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో జో శర్మ ముందుకు సాగుతున్నారు.







కామెంట్‌లు (0)