మనుషుల మధ్య ఉండాల్సింది కులం, మతం, వర్ణం, వర్గం కాదు. మానవత్వం.. మనిషితనం. ఈ విషయాన్ని రచయిత ‘‘దాబా హోటల్’’ నవలతో మనిషిలోని మంచితనాన్ని నిండుగా చూపించారు. దాంతోపాటూ కష్టపడే తత్వం ప్రతిఒక్కరిలోనూ ఉండాలి. అప్పుడే మనిషి ఈ సమాజంలో గౌరవంగా బతకగలుగుతాడని సందేశాత్మకంగా ముగించారు. ఓ పేదపిల్లవాడైన బిచ్చం-హరిభజన్ సింగ్ గా మారిన క్రమం చూస్తుంటే.. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినట్లుగా బిచ్చం తన జీవితాన్ని మలుచుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఈ నవల సమాజంలోని పాత వర్గ వివక్ష కులభేదం, ధార్మిక పరిమితులను ప్రశ్నిస్తుంది.
బిచ్చం అనే లంబాడీ బాలుడి జీవితమంతా పేదరికం, నిరాధార వేదనలతో ప్రారంభమైంది. చెల్లెలు పుడుతుండగా తల్లి మరణించడం అతని జీవితంలోని తొలి దు:ఖ ఘట్టం. ఆ తర్వాత వారి కుటుంబంలోకి వచ్చిన మారుతల్లి పెట్టిన హింసను భరిస్తాడు. ఆమె మాటలు మానసికంగా కుంగదీస్తాయి. ఇవన్నీ చూసి తండ్రి కూడా ఏమీ చేయలేకపోతాడు.
చిన్న వయసులోనే పశువుల కాపరిగా మారిన అతనికి బాల్యం, విద్య, సంతోషం అన్నీ కలలుగానే మిగిలిపోయాయి. మారు తల్లి కొట్టే దెబ్బలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి రైలెక్కి, చిన్నాయినలు పనిచేసే కంపెనీ దగ్గరకు వెళతాడు. వయస్సు చిన్నదైనా కష్టపడేతత్వం అలవరుచుకున్నాడు. అందుకే బిచ్చం ఎక్కడ ఉన్నా ఖాళీగా ఉండేవాడు కాదు. పనిలో చేరి, కష్టపడేవాడు. ఆ పని అయిపోతే.. మరోపని వెతుక్కొని మరీ చేసేవాడు. ఓ సారి బిచ్చాన్ని వెతుక్కుంటూ తండ్రి అక్కడకు వస్తాడు. తిరిగి బిచ్చాన్ని ఊరికి తీసుకెళతాడు. అక్కడ మళ్లీ మారుతల్లి హింస. ఓ సారి దొరల పశువులు దొంగిలించారనే అబద్ధపు నెపంతో బిచ్చం మీద పోలీసులు కేసు వేస్తారు. పేదరికం మీద అధికారం, మానవత మీద అన్యాయం ఈ రెండూ బిచ్చం గుండెల్లో కత్తుల్లా పొడుస్తాయి. వీటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఇంటి నుంచి, ఆ ఊరి నుండి దూరంగా పారిపోతాడు. అదే అతనికి ఒక కొత్త జీవితానికి నాంది అవుతుంది.
అప్పుడు పరిచయమవుతాడు లారీ డ్రైవర్ దిల్‌బాగ్ సింగ్. బిచ్చం చెప్పిన కథంతా విని, సింగ్‌కు మనసు కగిరిపోతుంది. బిచ్చాన్ని చేరదీసి, కడుపునిండా అన్నం పెడతాడు. తనతో పాటు గురుద్వారాకు తీసుకెళతాడు. అక్కడ వాతావరణం, మనుషులు అంతా బిచ్చానికి బాగా నచ్చుతుంది. అక్కడ సిక్కు మనుషులు, ప్రేమ, ఆప్యాయతల మధ్య బిచ్చం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. తనని తాను మెల్లగా మార్చుకుంటూ ఎదుగుతాడు. భాషా నేర్చుకుంటాడు. మనుషుల్లో ఉండాల్సిన ప్రేమ, కరుణ, కృతజ్ఞతా భావం అలవర్చుకుంటాడు. కొద్దిరోజుల తర్వాత అక్కడ గురుపెద్ద ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని, నాందేడ్‌కు చేరుతాడు. అక్కడ లంగర్‌సాహెబ్ సేవలకులతో కలిసి సేవ చేసుకుంటూ..అందరితోనూ కలిసిపోయి పనిచేసేవాడు. అక్కడ పద్ధతులు నచ్చి, ఓ రోజు బిచ్చం శిఖ్ఖు ధర్మంలోకి మారిపోతాడు. హరిభజన్ సింగ్ గా పెద్దలు పేరు పెడతారు. అందుకు బిచ్చం కుటుంబం కూడా ఒప్పుకుంటుంది. హరిభజన్‌సింగ్‌కి ఏ పనిజెప్పినా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేస్తాడన్న పేరు సంపాదించుకుంటాడు.
శ్రమకీ, ధర్మానికీ విలువనిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. పిండి పిసికే పనులు చేస్తూ, చెమటతో గౌరవాన్ని సంపాదిస్తాడు. తండాకి వచ్చి.. తెలిసిన రంజిత్‌కౌర్ పిల్లనే పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా హరిభజనసింగ్‌కి తగినట్లు నడుచుకుంటుంది. ఇద్దరూ కష్టపడి పనిచేసుకుంటారు. ముగ్గురు మగపిల్లలు పుడతారు. ఈ మధ్యలోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. తట్టుకొని నిలబడతారు.
పిల్లల భవిష్యత్తు, చదువుల కోసం పాల్వంచ వస్తారు. నలుగురు బాబాయిల సహాయంతో అక్కడ బొంతాసింగ్ సలహా మేరకు ‘‘దాబా హోటల్’’ పెడతారు. అలా హరిభజన్‌సింగ్ దశ మారిపోతుంది. కుటుంబం మొత్తం కష్టపడతారు. వ్యాపారం బాగా సాగుతుంది. అలా ఏడాదికేడాది దాబా హోటళ్లు పెంచుకుంటూ పోయారు హరిభజన్ సింగ్ కుటుంబం. స్థలాలు కొంటూ దాబా హోటళ్లు స్థాపిస్తూ పోతూ.. ఒకటి కాదు, రెండు కాదు నలభై పైచిలుకు దాబా హోటళ్లు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణాలో, అందునా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందులోనూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాల మధ్య ప్రభుత్వ ఇంనీరింగ్, వైద్యకళాశాలలకు కూతవేటు దూరంలో రోడ్డుకి ఇరువైపులా ఈ నలభై దాబా హోటళ్లున్నాయి. అవి అన్నీ హరిభజన సింగ్ బాబాయి కొడుకులు, వాళ్ల పిల్లలు, వారి బంధువులు నడుపుతున్నారు. వారందరికీ పని, వంటలు, కస్టమర్లతో ఎలా మసులుకోవాలో నేర్పించింది హరిభజన్ సింగ్. అన్ని హోటళ్లు ఏర్పడడానికి ప్రధానకారకుడు హరిభజన్ సింగ్. దాబాహోటళ్లకు పెట్టింది పేరు పంజాబ్. అక్కడా ఇన్ని హోటళ్లు లేవని రచయిత పరిశీలనలో తెలిసింది. అనేక కారణాల వల్ల ఆ హోటళ్లు అన్నీ నిదానంగా కళ తప్పుతున్నాయి. ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయాయి. నవల ముగింపు కన్నీరు పెట్టిస్తుంది. నిజంగా బిచ్చం ప్రయాణం మనిషి ఆత్మ పరివర్తనా శక్తిని గుర్తుచేస్తుంది. ఈ నవల పాఠకుల హృదయాలను కదిలించి, మానవత్వాన్ని మేల్కొలుపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రచయిత ఈ నవల ద్వారా మనసును కదిలించే మానవీయ దృక్పథాన్ని చూపారు. నవల శైలి సరళమైనదే అయినా భావసంపద అపారంగా వుంది.
పుస్తకం: దాబా హోటల్(నవల)
రచయిత : శిరంశెట్టి కాంతారావు
పేజీలు: 145
ధర:150/-
ఫోన్ :9849890322
పద్మావతి
9490559477







కామెంట్‌లు (0)