శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్త్రీ సాధికారత.. ప్రగతికి బాట..

-792 నిమిషాల క్రితం

womens-empowerment-a-path-to-progress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 07:30 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు దగ్గర పడుతున్నాయి. గత 79 ఏళ్ళులో మెల్లగా, మెల్లగానయినా అయినా దేశ ఆర్ధిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలలో, నిర్మాణంలో చాలా మార్పులే జరిగాయి. జరిగిన ఒక్కొక్క మార్పు, ఆడవాళ్ళ స్థితి గతులలో మార్పులు తీసుకు వచ్చింది. కొన్ని విషయాల్లో పరిస్థితి చాలా మెరుగుపడింది కూడా. విద్య, ఆరోగ్యం - ఈ రెండింటిలోనూ దేశం పెద్ద ముందడుగు వేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ రెండూ సమాజంలో, కుటుంబాలలో మెరుగుపడుతున్న ఆడవాళ్ళ స్థితిగతులను సూచిస్తున్నాయా? లేక ఇవి మారుతున్న సమాజపు అవసరాలు, పెరుగుతున్న సాంకేతికత తీసుకువచ్చిన పరిమితమైన మార్పులా? దీనిపైనే ఈ వారం అట్టమీది కథ.

స్త్రీల ఆరోగ్యమే చూస్తే - 1940 లలో ఆడవారు తలసరిగా, ఒక్కొక్కరు ఏడుగురు బిడ్డలని కనేవారు. చిన్న వయసులో పెళ్ళయిన వీరు, అన్నికాన్పుల తర్వాత బలహీనత, రక్త హీనత, ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూనే తమ జీవతంలో అధిక భాగం పిల్లల ఆలన, పాలనలో గడపవలసి వచ్చేది. అంతే కాదు, ఆనాడు పురుటి నొప్పులు పడుతున్న క్రమంలో, ఆమె బతుకుతుందో లేదో నమ్మకం ఉండేది కాదు. ఆమె బతుకు మంత్రసానులు మీద, నాటు వైద్యం మీద ఆధారపడి ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఏళ్లలో దరిదాపు కాన్పులన్నీ ఇళ్లలోనే జరిగేవి. వైద్యం లేక ఏటా, ప్రతి లక్ష కాన్పులకి 1300 మందికి పైన ఆడవాళ్ళు చనియేవారు.


ఈనాడు మనదేశంలో ఒక్కో మహిళా, ఇద్దరి కన్నా తక్కువ బిడ్డలకే కాన్పునిస్తోంది. ఆడవాళ్ళ మీద, వరుస కాన్పుల ఆరోగ్య భారం తగ్గింది. 90 శాతం కాన్పులు (రాష్ట్రంలో అయితే 98 శాతం) ఆసుపత్రులలో జరుగుతున్నాయి. పురిట్లోనే పోయే చూలాళ్ళ సంఖ్య ఇప్పుడు లక్ష కాన్పులలో 80 కి తగ్గింది. ఆడవాళ్ళలో రక్తహీనత సమస్య ఇంకా కొనసాగుతూనే ఉన్నా, వారి ఆరోగ్య పరిస్థితి అప్పటిమీద ఇప్పుడు చాలా మెరుగుపడింది.

అదే విధంగా ఆడవాళ్ళలలో అక్షరాస్యత కూడా పెరిగింది. ఆనాడు చదవటం, రాయడం వచ్చిన ఆడవాళ్ళు ఎనిమిది శాతానికి లోపే ఉండేవారు. అదే, ఈ రోజు ఆడవాళ్ళలో వందకి 75 మంది అక్షరాస్యులై ఉన్నారు. 15 నుండి 24 ఏళ్ల ఆడవారిలో అయితే అక్షరాస్యత 97 శాతంగా ఉంది. అంటే దరిదాపు ఆడపిల్లలందరికీ కనీస ప్రాథమిక విద్య దొరుకుతోంది.

ఇప్పుడు పై చదువుల్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలను దాటి ముందుకు వెళుతున్నారు. 2024 నాటికి 18 -23 ఏళ్ల మధ్య పడుచుపిల్లల్లో 31 శాతం మంది అమ్మాయిలు పైచదువులు చదువుతుండగా, అబ్బాయిలు 30 శాతానికి క్రిందనే ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు సైన్స్, లెక్కలు, ఇంజినీరింగ్, వైద్యం చదువులకి తక్కువ పంపించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా వేగంగా మారుతోంది. గత పదేళ్ళలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లెక్కలు) సబ్జెక్టులో ఉన్న అమ్మాయిల సంఖ్య 38 శాతం నుంచి 44 కి పెరిగింది. మరో పదేళ్ళ లో అమ్మాయిలు ఈ రంగాలలోనూ వారు అబ్బాయిలను దాటి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

కాబట్టి అమ్మాయిల విద్య, ఆరోగ్యం - ఈ రెండింటిలోనూ దేశం పెద్ద ముందడుగు వేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ రెండూ సమాజంలో, కుటుంబాలలో మెరుగుపడుతున్న ఆడవాళ్ళ స్థితిగతులను సూచిస్తున్నాయా? లేక ఇవి మారుతున్న సమాజపు అవసరాలు, పెరుగుతున్న సాంకేతికత తీసుకువచ్చిన పరిమితమైన మార్పులా?


చదువులు – అవకాశాలు

ఆడవారి చదువులు మెరుగవ్వడానికి రెండు కారణాలు మనం చూడవచ్చు. ఒకటి - దేశం ఆర్ధికంగా ఎదిగే కొద్దీ, ఆధునిక పరిశ్రమ, అక్షరాస్యత, చదువులు అవసరం అయ్యాయి. పని పక్కన పెడితే, చదవలేని వారు ఊరు దాటి బయట మనలేని పరిస్థితి పెరిగింది. పై చదువుల ప్రాముఖ్యత పెరిగింది. బిడ్డల చదువుల కోసం, ఇంట్లో చదువుల వాతావరణం అవసరం అయ్యింది. తల్లుల చదువుల అవసరమూ పెరిగింది. ఆడవారు ఇంటికే పరిమితం అయినా, ఎంతో కొంత చదువు అవసరం వచ్చింది.

అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించే కొద్దీ, వ్యవసాయం రంగం నుంచి పట్టణాలలోకి మెల్లగా బయటికి వెళుతున్న కుటుంబాలకి, ఆడవాళ్ళ ఉద్యోగాలు, వారి సంపాదన విలువా కొంత అర్థమయ్యాయి. అలాగే, ఆడవాళ్ళకి కొన్ని అవకాశాలూ పెరిగాయి. చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేస్తున్న ఆడవారిని చూస్తున్నాం.

కానీ ఆడవారికి ఈ ఉద్యోగ అవకాశాలు ఎంత పెరిగాయి? పెరిగిన అవకాశాలని వాడుకోగలిగే స్థితి కుటుంబాలలో ఆడవారికి ఉన్నదా? తమ చదువులతో ఆడవారు తమ సొంతకాళ్ళ మీద నిలబడగలుగుతున్నారా? ఆడవాళ్ళు పురుషులతో సమానమైన స్థాయి, అధికారాలు, హక్కులు పొందే దిశగా పయనిస్తున్నారా? ఇవి మనం ఆడగాల్సిన కొన్ని ప్రశ్నలు. వీటికి సమాధానం ఇవ్వడం సులభం కాదు. కానీ మరి కొన్ని అంకెలు చూస్తే పరిస్థితి కొంత బోధపడుతుంది.

hands

బయట పని - ఇంటి పని

చదువులు పెరుగుతున్నా, ఆడవాళ్ళకు ఉపాధి చాలా తక్కువగా ఉందని పలు సర్వేలు, ప్రభుత్వ లెక్కలు మనకు చెబుతున్నాయి. 2019- 21 నడుమ జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- పెళ్ళయిన పురుషుల్లో 98 శాతం మందికి ఏదో ఒక ఉపాధిలో పనిచేస్తూ ఉండగా, ఆడవారికి 32 శాతం మంది మాత్రమే పని చేస్తున్నారని మనకు చెబుతుంది.

ఈ 32 శాతం మందిలో కూడా ఓ ఐదు శాతానికి ఎటువంటి డబ్బూ చేతికి రాదు. మిగిలిన ఐదు శాతం మంది ఉపాధి, వారు చేసే పని కుటుంబం మొత్తం చేసే వ్యవసాయానికో, వ్యాపారానికి తోడ్పడుతుంది కానీ, సొంత కాళ్ళ మీద నిలబడడానికి కాదు. అంటే ఒక 28 శాతం పెళ్ళయిన ఆడవాళ్ళు మాత్రమే తాము పని చేసి, సొంత డబ్బు సంపాదిస్తున్నారు – అది కూలి పని అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి.

ఉపాధికి దూరంగా 70 శాతానికి పైగా ఆడవాళ్ళు ఉండటానికి కారణం ఏమిటో? విద్య, వైద్యం మెరుగైనా, ఆడవాళ్ళ కుటుంబ బాధ్యతల బరువు మారలేదని అంకెలు చెబుతున్నాయి. 2024లో జరిపిన జాతీయ టైమ్ యూజ్ సర్వే ప్రకారం 20 - 29 ఏళ్ల ఆడవారు తలసరిన, రోజుకు 6 గంటల 35 నిముషాలు ఇంటిపనిలో, కుటుంబంలోని పిన్నపెద్దల సేవలో గడుపుతారు. ఇవే పనుల్లో పురుషులు ముప్పావు గంట కూడా వెచ్చించరు. మరో వైపు ఆడవాళ్ళు తలసరిన రోజుకు గంట పాటు, ఉపాధి పనులు చేస్తారు. ఉపాధి+ ఇంటి పనులు కలిపి స్త్రీ-పురుషులు వెచ్చించే సమయం ఇంచుమించు ఒకటే. కానీ బయటికె వెళ్ళిన పురుషుడు సంపాదించి, ఆ సంపాదనను ఖర్చు పెట్టే అధికారం సాగిస్తే, ఇంట్లో ఉన్న స్త్రీ అన్ని గంటలూ పని చేసి, తన అవసరాల కోసం భర్త ఉదారత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. భర్త తన ఉద్యోగం, ఉపాధిలో భాగంగా బయటి సమాజంలో తిరిగి, వ్యవస్థలో పని చేసి, ఆ మేరకు లోకజ్ఞానం పొందితే, భార్య ఇంటికి పరిమితమై లోక జ్ఞానానికి ఆమడ దూరంలో ఉంటుంది.

ఇది ఒకప్పటి పద్ధతి అని, ఇప్పుడు పిల్లల్ని సమానంగా పెంచుతున్నారని, కాబోయే తరంలో ఈ పరిస్థితి ఉండదు అనుకోవడానికి లేదు. పైన ఉటంకించిన జాతీయ టైమ్ యూజ్ సర్వే పిల్లల గురించి ఏం చెబుతోందో చూద్దాము. 10 - 19 మధ్య పిల్లలు, స్త్రీ-పురుషులు ఇద్దరూ, రోజుకు సగటున 4.30 గంటలు చదువులో గడుపుతున్నారు. కానీ అమ్మాయిలు అదనంగా రోజుకు గంటా 10 నిముషాలు ఇంటిపని చేస్తే, అబ్బాయిలు మాత్రం ఈ పనిలో 10 నిముషాలే వెచ్చిస్తున్నారు. దానికి తగ్గట్టు అబ్బాయిలు, అమ్మాయిల కన్నా ఆట పాటలకి, తమకు నచ్చినపని చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.

ఇలా అబ్బాయిలని, అమ్మాయిలని ఇద్దరినీ బడికి పంపినా, ఇంటిపని బాధ్యతలు అమ్మాయిల మీదే పడుతున్నాయి. అబ్బాయిలకి ఇంటిపని లేకుండా, స్వతంత్ర్యంగా బయట తిరిగే అవకాశం వస్తోంది. ఎన్ని చదువులు చదివినా, ఇంటిపని ఆడపిల్లల బాధ్యతగానే చూస్తోంది మన సమాజం.

సమాజంలో అత్యధికంగా ఆడవాళ్ళు ఇళ్ల బయటకి వచ్చి, పనిచేయలేనప్పుడు, అక్షరాస్యత పెరిగినా ఆడవాళ్ళ పరిస్థితి మారుతుందా? చదువులు పెరిగినా, ఆ చదువులు ఉద్యోగాలకి దారితీయనపుడు – ఆ చదువులు స్త్రీల దీర్ఘకాలిక పరిణితిపై, వారి సాధికారతలను ఎంతవరకు బలపరుస్తాయి ?

womens

రెండు వర్గాల మహిళలు

వింత ఏమిటంటే, చదువులు పట్టణాలలో ఎక్కువ ఉన్నా, ఇల్లు వదిలి బయటకి వెళ్ళి పని చేసే ఆడవాళ్ళ శాతం పల్లెటూళ్ళలోనే ఎక్కువ. వ్యవసాయం పని స్త్రీలకు ఊళ్ళో దగ్గరగా అందుబాటులో ఉంటుంది. పిల్లలను పెద్దవాళ్ళ దగ్గర విడిచిపెట్టడానికి, తమతో తీసుకువెళ్లడానికి వెసులుబాటు ఉంటుంది. ఇంటిపని తప్పకున్నా, పని దగ్గరలో అందుబాటులో ఉంటుంది.

కానీ యాంత్రీకరణతో ఆడవాళ్ళకి కూడా వ్యవసాయంలో పని తగ్గుతోంది. కుటుంబాలు పెద్ద ఎత్తున పట్టణాలకి వలసపోతున్నాయి. కానీ పట్టణాలలో ఆడవాళ్ళకి ఇంటి దగ్గరలో పనులు దొరకవు. ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని విడిచి, గంటన్నర ప్రయాణించి.. పరిశ్రమలలో పనులకి వెళ్ళి, రాలేరు. పనులలో కానీ, ఇంటి దగ్గర కానీ క్రెచ్ సదుపాయాలు ఉండవు. ఆడవాళ్ళకి ఇచ్చే అరకొర జీతాలు, కూలీలు – రానూ పోనున ఖర్చులకి చాలవు. ఆరు గంటల ఇంటిపనికి తోడు, అదనంగా 10- 12 గంటలు పరిశ్రమలలో పనిచేయడం మాటలు కాదు. కటిక పేదరికంలో మగ్గుతూ, తిండికి, నిద్రకి సమయం లేక సతమతమవుతూ ఇంటిపని చేస్తూ రకరకాల పరిశ్రమలలో పని చేసే ఆడవాళ్ళు ఉన్నారు. తమకి దగ్గరలో ఉన్న రెండు మూడు ఇళ్ళల్లో, పదీ పరకకీ పనిమనిషిగా చాకిరీ చేసే ఆడవాళ్లూ ఉన్నారు.

ఇంటిపనికి, పిల్లలని చూసుకోవడానికి, పనిమనుషులని పెట్టుకుని; సొంత బండ్లలో పనికి పోగలిగే జీతాలు ఆర్జించే ఆడవాళ్ళు ఉన్నారు. కానీ ఉపాధిలేని మహిళలు కోట్లలో ఉంటే, ఇలా వీలైన ఉద్యోగాలు చేయగలిగేవాళ్ళు లక్షలలో ఉంటారు.

పట్టణాల్లో ఒక రెండు వర్గాల ఆడవారిలో, బయటికి వెళ్ళి పనిచేసే వారి శాతం తక్కిన వారితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మొదటి వర్గం మంచి పైచదువులు చదివిన, ఎగువ మధ్యతరగతి ఆడవాళ్ళు. రెండవ వర్గం చాలీచాలని చదవుల కటిక పేదవాళ్ళు. కొద్ది సంఖ్యలో ఉన్న మొదటి వర్గం ఆడవాళ్ళు – ఓ మూడు నాలుగు ఇళ్ళలో నెలకి వెయ్యి, రెండువేల రూపాయలకి పనిమనుషులుగా, ఆయమ్మలుగా పనిచేస్తూ బతుకీడ్చే రెండో వర్గం ఆడవారు లేకపోతే – తమ పెద్ద జీతాల ఉద్యోగాలు సాగించలేరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొదటి వర్గం ఆడవారి ఆర్ధిక స్వాతంత్ర్యం, సాధికారత కొంతవరకు, రెండో వర్గపు అణగారినతనంపై ఆధారిపడి ఉంది.

ఈ రెండు వర్గాలకి మధ్యనున్న తక్కిన 75 శాతం మంది - తిండానికి తిండి వరకు ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలోని ఆడవాళ్ళు. పనులకు పోకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. వారు బయట ఉపాధి చూసుకోనిది, ఇళ్ళలో అవసరం లేక కాదు. సరైన పని దొరకక, ఇంటిపనుల నుండి విముక్తి పొంద లేక.

మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమని తాము మధ్యతరగతిగా చూసుకునే అలవాటు ఉంది. అంబానీ కూడా తనది మిడిల్ క్లాస్ గుండె అని చెప్పుకుంటాడు. కానీ అంకెల లెక్క చూస్తే – మన దేశంలో కుటుంబాల సగటు నెలసరి ఆదాయం 39,000 రూపాయలు కాగా, కట్టకడన ఉన్న 50% శాతం కుటుంబాల నెలసరి ఆదాయం 12,000 రూపాయల కన్నా తక్కువ. వారి పైన 40% శాతం కుటుంబాల నెలసరి ఆదాయం 26,500 రూపాయలు. అందరికన్నా ఎగువన ఉన్న 10% శాతం కుటుంబాల నెలసరి ఆదాయం రెండు లక్షల 25 వేలు.

అంటే 90 శాతం కుటుంబాలు దేశ సగటు ఆదాయానికి దిగువ ఉన్నాయి. మిగిలిన 10 శాతం కుటుంబాలలోని ఆడవారు మాత్రమే.. పనిమనుషులను పెట్టుకుని, ఉద్యోగాలకు పోగలరు. సమాజంలో తమ ముద్ర వేయగలరు. కానీ సమాజంలో 90 శాతం ఆడవాళ్ళకి తగిన ఉపాధి, స్వతంత్రత లేనప్పుడు – మంచి ఆదాయం, ఉద్యోగం కొందరు మహిళలకి పూర్తి సాధికారత, హక్కులు లభిస్తాయా ?

women 0222


ఆర్ధిక స్వాతంత్ర్యం ఎందుకు ?

తమకు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని సమాజంలో బతికే మహిళలకు.. భావ స్వాతంత్ర్యం కూడా, కొరవడుతుంది. ఇంటా బయటా తమ హక్కుల కోసం అడిగే సత్తువ లోపిస్తుంది. ఉదాహరణకి, ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం - ఆంధ్రప్రదేశ్ లో ఒక 44 శాతం మంది పెళ్ళయిన మహిళలకి, భర్త అనుమతి లేకుండా, అవసరమైతే ఆసుపత్రికి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదు. 50 శాతం మందికి అనుమతి లేకుండా తమంతట తాము షాపుకు వెళ్ళి, ఏదైనా కొనే స్వేచ్ఛ లేదు. 50 శాతం మందికి వేరే ఊరికి ప్రయాణం చేసే స్వేచ్ఛ లేదు. 26 శాతం మందికి తల్లిదండ్రుల దగ్గిరకి వెళ్ళే స్వేచ్ఛ లేదు. 30 శాతం మంది పెళ్ళయిన ఆడవాళ్ళకి, తమ వైద్యం, ఆరోగ్యం గురించి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో ఇంతపాటివి సాధించుకోలేని స్త్రీలు , సమాజంలో పురుషులతో సమానంగా ఎలా నిలబడ గలుగుతారు?

హక్కుల విషయం పక్కన పెడితే – తమకు ఆర్ధిక స్వాతంత్ర్యం దొరకని సమాజంలో, ఆడవాళ్లకు తమ పట్ల తమకే చిన్నచూపు ఉంటుంది. తమకి జరగే అన్యాయాలు, న్యాయంగా సర్ది చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. పైన ఉటంకించిన సర్వే ప్రకారం, భర్తకి చెప్పకుండా బయటికి వెళితే, భార్య తన్నులు తినడం న్యాయమని ఆంధ్రప్రదేశ్ లో 33 శాతం మంది పెళ్ళయిన మహిళలు సమాధానం చెప్పారు. భార్యాపిల్లల్ని, ఇంటిని సరిగా చూసుకోవట్లేదని భార్యని కొడితే తప్పులేదని ఒక 70 శాతం మంది; భర్తతో వాదనకి దిగితే, భార్యని కొట్టొచ్చని 34 శాతం మంది; భర్తతో పడుకోవడానికి నిరాకరిస్తే కొట్టవచ్చని ఓ 14% మంది, భర్తకి అనుమానం వస్తే కొట్టవచ్చని 32 శాతం మంది, అత్తమామలకి గౌరవం చూపకపోతే కొట్టవచ్చని 63 శాతం మంది ఆడవాళ్ళు అంటున్నారు. మొత్తం మీద 84 శాతం ఆడవారు, ఏదో ఒక పై కారణం వల్ల భర్తలు భార్యలని కొట్టడానికి వత్తాసునిచ్చారు. ఈ పరిస్థితుల్లో 30 శాతానికి పైగా ఆడవారు, తాము శారీరిక లేదా లైంగిక హింసకు గురయ్యామని సర్వేలో చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

తమ చుట్టూ ఉన్న మెజారిటీ మహిళల పరిస్థితి, ఆలోచన ఇలా ఉన్నప్పుడు – అది ఎంత మంచి ఆదాయం ఉన్న మహిళ అయినా ఒంటరిగా సాధికారత సాధించలేదు. మెజారిటీ స్త్రీల పరిస్థితి దిగజారి ఉన్నప్పుడు, సమాజంలో వారి పట్ల ఉన్న చూపు, ఆడవాళ్ళకే తమ పట్ల ఉన్న న్యూనత – మంచి వృత్తులలో ఉన్న స్త్రీలని కూడా వెనక్కి లాగుతుంది. వారు ముందుకు పోవడానికి అడ్డంకులు పెడుతుంది. వారిని రకరకాల ఒత్తిడులకి, వేధింపులకి గురిచేస్తుంది.

image


ఏమి చేయాలి ?

మహిళల హక్కుల కోసం, వారికి అనువైన చట్టాల కోసం పోరాడటం చాలా ముఖ్యం. అది వామపక్ష మహిళా ఉద్యమం ఎన్నాళ్ల నుంచో ముందుండి


పోరాటం చేస్తోంది. అయితే, కేవలం మహిళల హక్కుల కోసం పోరాడటం వల్ల వారి హక్కులు మెరుగుపడవు. రాజ్యాంగం ఎన్ని హక్కులు ఇచ్చినా, ఎంత మంచి చట్టాలు చేసినా – మెజారిటీ మహిళలకు ఆర్ధిక స్వాతంత్ర్యం కొరవడినపుడు వారు ఆ హక్కులను పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఆ చట్టాల అమలుకు గట్టిగా పోరాడలేరు.

ఆర్థికంగా వ్యవస్థీకృతమైన మార్పులు అవసరం – దానికోసం ఉద్యమించడం అవసరం. కొన్ని పట్టణాలకు, కొన్ని ప్రాంతాలకు కేంద్రీకృతమై – వలసల మీద ఆధారపడే ఆర్థికాభివృద్ధి ఈనాడు మనదేశంలో జరుగుతున్నది. పల్లెలలో పని కరువవుతోంది. పెట్టుబడి అంతా పట్టణాలలో పోగుపడుతోంది. తీవ్ర ఆదాయ అసమానతలతో కూడి ఉన్న ఈ కేంద్రీకృతమైన అభివృద్ధి – ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వదు.

మహిళల సాధికారతకు వికేంద్రీకృతమైన అభివృద్ధి అవసరం. మహిళల ఉపాధి, వారి కుటుంబాలతో ముడి పడి ఉంటుంది. తమకు దగ్గరలో, కుటుంబాలకు అందుబాటు ఉండే దూరాలలో – ఆడవాళ్ళకు పని దొరికిననాడే, వారు పెద్ద సంఖ్యలో ఆర్ధికవ్యవస్థలో పాలు పంచుకోగలుగుతారు. పల్లె ప్రాంతాలకు పరిశ్రమలు రప్పించడం, పల్లెలకు వచ్చే వ్యవసాయ అనుబంధ, ఇతర పరిశ్రమల నెలకొల్పేలా చేయడం – వీటిలో ఆడవారికి పనులలో కోటాలు కల్పించడం అవసరం. పల్లె ప్రాంతాల్లో – మహిళలకు తగ్గ ఉపాధి పనులపై, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అవసరం.

చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎలాగైతే డిమాండు చేస్తున్నామో - అలాగే దేశ వ్యాప్తంగా ప్రయివేటు, ప్రభత్వ రంగాలు రెండింటిలోనూ, స్త్రీలకు రిజర్వేషన్లు అడగటం, వాటి కోసం పోరాటం చేయడం అవసరం.

వామపక్ష మహిళా ఉద్యమాలు - స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యం, సాధికారత దృష్టితో నిర్ధిష్టమైన డిమాండ్లు లేవనెత్తడమే కాక, మొత్తం ఆర్ధికవ్యవస్థలో మార్పులకు ఉద్యమించడం కూడా మహిళా హక్కుల కోసం చేయవలసిన పని.

​

బోడపాటి సృజన

ammaayi@gmail.com

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్