కారణాలు చెప్పకుండానే నిలిపేసిన మెటా
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యారంగ సమస్యలపై గళమెత్తుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఇన్‌స్టాగ్రామ్‌పై మెటా ఆంక్షలు విధించింది. విద్యార్థి సంఘాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తోంది. కారణం చెప్పకుం డానే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. ఈ ఖాతాను కేవలం భారతదేశంలో మాత్రమే కనిపించకుండా చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఖాతాలను నిలిపేయడం ఇది తొలిసారి కాదు.. జులైలో ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఖాతాను కూడా శాశ్వతంగా ఇలానే మెటా నిలిపేసింది. ఈ అంశంపై ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా మెటా వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థుల సమస్యలను, విద్యారంగంలోని విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రజల ముందుకు తీసుకెళ్తున్న తమ సంఘం ఖాతాపై తాత్కాలిక ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్‌రావు, కె ప్రసన్న కుమార్ తెలిపారు. విద్యార్థుల సమస్యలపై గొంతెత్తడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు అని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలు, ప్రజల గొంతుకగా నిలిచే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడం ఆందోళనకరమని తెలిపారు. ఖాతాపై ఆంక్షలు విధించడానికి గల నిర్దిష్ట కారణాలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని తెలిపారు. తమ సంఘం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)