లోతా రామారావు గెలుపుతో అభివృద్ధి
ప్రజలకు వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి
జోరు వానలోనూ రాజవొమ్మంగిలో ఎన్నికల ప్రచార ర్యాలీ
ప్రజాశక్తి- రాజవొమ్మంగి (పోలవరం జిల్లా) : ప్రజా సమస్యలపై పోరాడేవారికే ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాజవొమ్మంగి జెడ్‌పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలంటూ మంగళవారం మండలంలోని పలుచోట్ల జోరువానలోనూ హుషారుగా ప్రచారం సాగింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా మహిళలు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రచార ర్యాలీ మండలంలోని చిక్కులెంత పంచాయతీ కరుదేవుపాలెం నుండి జడ్డంగి, రాజవొమ్మంగి మీదుగా లాగరాయి వరకూ సాగింది. ఆయా గ్రామాల్లో మహిళలు హారతులిచ్చి, విజయం తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సభల్లో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాల్లో సరైన రహదారులు లేక సకాలంలో వైద్యం అందక అనేకమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. నేటికీ లోతట్టు గిరిజన గ్రామాల్లో రహదారులు లేక డోలీ మోతలే శరణ్యమవుతున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు వారి అధికారాన్ని సక్రమంగా వినియోగించడం లేదని, అవినీతి ఆరోపణలు అనేకం ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారాన్ని సక్రమంగా వినియోగించే వారికే ఓటు వేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో మరీ ముఖ్యంగా రాజవొమ్మంగి మండలంలో రామారావును జెడ్‌పిటిసిగా గెలిపిస్తే జిల్లా పరిషత్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రజా గొంతుక వినిపిస్తారని తెలిపారు. ఏజెన్సీలో యువత, మహిళలు చైతన్యవంతులు కావాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. జెడ్‌పిటిసి అభ్యర్థి లోతా రామారావు మాట్లాడుతూ తన గెలుపు కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఏకమవుతున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువత ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. సిపిఎం, ఆదివాసీ జెఎసి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు శివాజీ, సుజాత, బి.రామకృష్ణ, కె.శ్రీను, కౌసల్య మాట్లాడుతూ తమకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జె.రామన్న, వి.వెంకటేశ్వర్లు, కె.ప్రసన్న కుమార్, రవి, జెఎసి నాయకులు వంతు బాలకృష్ణ, జి.లోవప్రసాద్, కె.సూరిబాబు, తెడ్ల అబ్బాయి పి.సత్యనారాయణ, కె.రాజు, కె.గంగరాజు, కె.ప్రవీణ్, రమణ పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)