న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి నిర్దేశించిన 24 గంటల గడువు అతడిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి ఈ గడువును లెక్కించకూడదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అరెస్టు, నిర్బంధం మధ్య సాంకేతిక తేడాలు ఉన్నప్పటికీ, రెండూ వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేస్తాయని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు సంబంధించినవని అభిప్రాయపడింది. ఉపా, మనీలాండరింగ్ వంటి ప్రత్యేక చట్టాల కింద బెయిల్ పొందడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులే అత్యున్నతమైనవని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత, ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ గడువు నిబంధన పాటించబడిందో లేదో నిర్ధారించేందుకు, అదుపులోకి తీసుకున్న ఖచ్చితమైన తేదీ, సమయాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేయాలని తెలిపింది.
అరెస్టుకు ముందు విచారణ లేదా దర్యాప్తు కోసం పట్టిన సమయాన్ని 24 గంటల గడువు నుంచి మినహాయించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) అనుమతించదని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన ప్రదేశం నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకు చేరుకోవడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే ఈ గడువు నుంచి మినహాయించవచ్చని స్పష్టం చేశారు. విచారణ పేరుతో ఒక వ్యక్తిని ఎక్కువ సమయం అదుపులో ఉంచి, ఆ తర్వాత అధికారికంగా అరెస్టు చేసినట్లు చూపించడం ద్వారా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడానికి వీల్లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
అయితే 24 గంటలు దాటితే ప్రతి సందర్భంలోనూ ఆవ్యక్తి ఆటోమేటిక్గా విడుదలవుతాడని కాదు. అక్రమ నిర్బంధాన్ని కోర్టులో సవాలు చేయవచ్చు. విడుదలకు సంబంధించిన నిర్ణయం కేసు పరిస్థితులు, చట్టపరమైన పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.








కామెంట్లు (0)