గడ్చిరోలి : భూమి..అడవి..ఆదివాసీ అస్థిత్వ నినాదంతో నాటి బ్రిటిష్వారిపైనా..జమీన్దారి వ్యవస్థపైనా పోరుసల్ఫిన అడవితల్లి ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి 151వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దాదాపు 2 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) మహాసభ నేపథ్యంలో బిర్సాముండా జయంతి సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లోనూ పతాక ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునివ్వడంతో అన్నదాతల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో అనేక గ్రామాల్లో బిర్సాముండా జయంతి వేడుకలు.. వ్యవసాయ రంగ పరిరక్షణ, ఆదివాసీల హక్కుల రక్షణ నినాదాలతో మార్మోగాయి. అయితే అటవీ భూములను బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఆదివాసీల ఆలనాపాలనను గాలికొదిలేసిన కేంద్రంలోని బిజెపి నేతృత్వ ఎన్డిఎ, వివిధ రాష్ట్రాల్లోని దాని భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు బిర్సాముండా జయంతిని సైతం వ్యూహాంగా మార్చుకొని మతాల మధ్య చిచ్చురాజేసే కుట్ర చేస్తున్నాయి. అదే ప్రయత్నంలో భాగంగానే బిర్సాముండాపై లేని ప్రేమను ఒలకబోస్తూ మతం ప్రస్తావనలేని ఆదివాసీ సంస్కృతికి సాంప్రదాయాలకు హిందూత్వను రుద్దేసి..గిరిజనుల్లో విభజన తీసుకొచ్చేందుకు ఈ వేడుకులను కూడా పావుగా వాడుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆదివాసీ మోర్చాలు బిర్సా ముండే జయంతి వేడుకలు ఇదే కుట్రతో నిర్వహించినట్లు తెలుస్తోంది.
మావోయిస్టుల హింసతో నష్టపోయిన ఆదివాసీలు : మోడీ
మహారాష్ట్రలో గడ్చిరోలిలో జరిగిన బిర్సా ముండా జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. రూ.3 వేల కోట్ల విలువైన 246 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మావోయిస్టుల హింసాకాండ వల్ల ఆదివాసీలు నష్టపోయారని తెలిపారు. గత ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిని గాలికొదిలేశాయని ఆరోపించారు. గిరిజనులు ఎల్లప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారని ప్రశంసించారు. దేశంలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటని మోడీ చెప్పుకొచ్చారు. 2014లో దేశంలోని దాదాపు 125 జిల్లాలు మావోయిజం, నక్సలిజంతో ఇబ్బందిపడ్డాయని, ఏటా వందలాది హింసాత్మక ఘటనలతో వేలాది మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మృతుల్లో ఆదివాసీ సోదర సోదరీమణులే అత్యధిక సంఖ్యలో ఉండేవారని తెలిపారు. ఇప్పుడు నక్సలిజం-మావోయిజం పూర్తిగా అంతమైనట్లు మోడీ ప్రకటించారు. గడ్చిరోలితో సహా నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ ఇప్పుడు కేవలం దీపావళి దీపాలే కాకుండా, ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశాకిరణం కూడా ప్రసరించిందని మోడీ తెలిపారు.








కామెంట్లు (0)