సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసిని కాపాడేందుకే ప్రజలపై యుద్ధం!

1 గంట క్రితం

సిఇసిని కాపాడేందుకే ప్రజలపై యుద్ధం!
- జ్ఞానేష్‌‌ కోసం ప్రధాని మోడీకి ఎందుకు అంత పట్టుదల?
- జంతర్ మంతర్ మార్చడం సరికాదు 
- సిజెపి కన్వీనర్ అభిజీత్‌ దీప్కే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జ్ఞానేష్‌‌ కోసం ప్రధాని మోడీకి ఎందుకు అంత పట్టుదల?

- జంతర్ మంతర్ మార్చడం సరికాదు

- సిజెపి కన్వీనర్ అభిజీత్‌ దీప్కే

న్యూఢిల్లీ : ‌భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సొంత ప్రజలపైనే యుద్ధం చేస్తుందని సిజెపి కన్వీనర్‌ అభిజీత్‌ ‌దీప్కే విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. సిఇసి జ్ఞానేష్‌‌కుమార్‌‌ను రక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకంత పట్టుదలగా ఉన్నారని ప్రశ్నించారు. ఆయన్ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా ‘‘ప్రజలపై యుద్ధం’’ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సిఇసి జ్ఞానేష్‌‌కుమార్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో నిరసనకారులు, పాత్రికేయులు, ఎంపిలపై ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని అభిజీత్ దిప్కే తెలిపారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య హోదాను కూడా రద్దు చేసేస్తారా? : సౌరవ్ దాస్‌

సిజెపి కో కన్వీనర్ సౌరవ్ దాస్ సోమవారం సోషల్‌ ‌మీడియాలో ఒక పోస్టులో జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుండి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయం ‘‘ఆమోదయోగ్యం కాదు’’, సిజెపి ‘‘ఈ ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు. నరేంద్ర మోడీ జంతర్ మంతర్ అంటే ఎందుకు భయపడుతున్నారు?’’ అని ఎక్స్‌ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో దాస్ ప్రశ్నించారు. ‘‘జంతర్ మంతర్ అనేది భారత దేశ ప్రజలకు చెందినది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు దీనిపై కేంద్ర హోం శాఖ దేశ ప్రజలను సంప్రదించిందా? సంబంధిత వర్గాలను (స్టేక్‌హోల్డర్లను) గానీ, ఏవైనా సంస్థలను గానీ సంప్రదించారా?’’ అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ఈ బిజెపి ప్రభుత్వం భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశం కాదనే స్థాయికి (ప్రజాస్వామ్య హోదాను రద్దు చేసేలా) మారుస్తుందని విమర్శించారు. ‘‘రాసి పెట్టుకోండి. దేశ ప్రజలకు చెందిన జంతర్ మంతర్ హోదాను ఎలాగైతే తొలగిస్తున్నారో, అలాగే ఈ ప్రధానమంత్రి త్వరలో భారతదేశంలో ప్రజాస్వామ్య హోదాను కూడా రద్దు చేస్తారు. ఈ చర్య అటువంటి దిశగా వేసిందే ఈ అడుగు’’ అని దాస్ పేర్కొన్నారు.

‘‘మేము ఈ ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించం. ఇది నిరసన తెలిపే, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల ప్రాథమిక హక్కుపై దాడి. ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతోంది’’ అని ఆయన అన్నారు. అలాగే, సిజెపి కో కన్వీనర్‌ అశుతోష్ రాంకా ఢిల్లీ డిసిపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌‌ఎస్‌ ‌గుండాల హింసాత్మక చర్యలకు ఆ అధికారి సహకరిస్తున్నారని అశుతోష్ రంకా పేర్కొన్నారు. ఆ అధికారి అధికారికంగా బిజెపిలోకి చేరకపోయినా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సహకరిస్తున్నారని రాంకా విమర్శించారు. ఆ అధికారి గత, ప్రస్తుత రికార్డులను పరిశీలించిన తర్వాతే ఈ ఆరోపణ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌కు అనుమ‌తి ఇవ్వండి

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) కార్యకర్తలు సోమవారం పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నిరసన తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరారు. దీనిపై స్పందించేందుకు 24 గంటల గడువు విధించారు. పోలీసులు సాధారణంగా నిరసనకు కనీసం పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని చెబుతుంటారని, ఈసారి మాత్రం తేదీ, సమయాన్ని పోలీసులే ఖరారు చేయాలని కోరుతున్నట్లు సిజెపి జాతీయ కో క‌న్వీన‌ర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా తెలిపారు. ఈ మేరకు పోలీసులకు 24 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు వెల్లడించారు. అధికారులు స్పందించకపోతే 24 గంటల్లో మరో నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ప్రజలు ఇప్పటికే ఆ హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. నిరసనకు పదిరోజుల ముందే సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు పదేపదే చెబుతున్నారని తెలిపారు. అందుకే ఈసారి నిరసన తేదీ, సమయాన్ని నిర్ణయించే బాధ్యతను పోలీసులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్