గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాతావరణ మార్పుల సూచీలో భారత్‌కు మళ్లీ నిరాశ; ఐదు స్థానాలు పడిపోయి 28వ స్థానానికి చేరిక

3 గంటల క్రితం

వాతావరణ మార్పుల సూచీలో భారత్‌కు మళ్లీ నిరాశ; ఐదు స్థానాలు పడిపోయి 28వ స్థానానికి చేరిక
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 03:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను నియంత్రించే చర్యలను అంచనా వేసే అంతర్జాతీయ సూచీలో భారత్ మరోసారి వెనుకబడింది. 'క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్' (CCPI) 2027లో భారత్ ఐదు స్థానాలు దిగజారి 28వ స్థానానికి చేరుకుంది. గతేడాది భారత్ 23వ స్థానంలో ఉండేది. దేశ ర్యాంకింగ్ తగ్గడం ఇది వరుసగా మూడో ఏడాది. 2024లో టాప్-10లో ఉన్న భారత్, రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 18 స్థానాలు వెనక్కి వెళ్లింది. తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 31) సందర్భంగా ఈ తాజా నివేదికను విడుదల చేశారు.


దేశంలో కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్), ఇంధన వినియోగం పెరగడమే ర్యాంకింగ్ పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లో కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగం తక్కువే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇవి గణనీయంగా పెరిగాయి. వాతావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ పనితీరు సగటు స్థాయిలో ఉందని నివేదిక విశ్లేషించింది.


జర్మనీకి చెందిన 'జర్మన్‌వాచ్', 'న్యూక్లైమేట్ ఇన్‌స్టిట్యూట్' సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. భారత్ సహా 64 దేశాలు, యూరోపియన్ యూనియన్ పనితీరును ఇందులో పరిశీలించారు. కర్బన ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధనం, ఇంధన వినియోగం, వాతావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానపరమైన చర్యల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయించారు.


సౌర, పవన విద్యుత్ రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, బొగ్గుపై ఆధారపడటం మాత్రం కొనసాగుతూనే ఉంది. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా, ఉత్పత్తి అయిన విద్యుత్తును పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని నివేదిక పేర్కొంది. విద్యుత్ నిల్వ (స్టోరేజ్), సరైన ప్రాంతాలకు సరఫరా చేసే మౌలిక సదుపాయాల కొరతే ఇందుకు కారణమని తెలిపింది.


2025 జూన్ నాటికే భారత్ తన మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా శిలాజేతర ఇంధన (బొగ్గు, పెట్రోలియం వంటివి కాకుండా) వనరుల ద్వారా సాధించింది. 2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే అందుకుంది. అయినప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన స్థాయిలో బొగ్గు వినియోగాన్ని తగ్గించలేకపోయిందని నివేదిక ఎత్తిచూపింది.


ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలను ఈసారి కూడా ఖాళీగానే ఉంచారు. వాతావరణ పరిరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన దేశం ఏదీ లేకపోవడమే ఇందుకు కారణం. నాలుగో స్థానంలో నిలిచిన డెన్మార్క్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. లిథువేనియా ఐదో స్థానంలో, లక్సెంబర్గ్ ఆరో స్థానంలో నిలిచాయి. బ్రిటన్ ఏడో స్థానంలో, మొరాకో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.


భారత్ కంటే మెరుగ్గా పాకిస్థాన్ 26వ స్థానంలో నిలిచింది. చైనా 56వ స్థానంలో, రష్యా 66వ స్థానంలో, అమెరికా 67వ స్థానంలో ఉన్నాయి. ఇరాన్ చివరి స్థానంలో నిలిచింది.


బొగ్గు వినియోగాన్ని తగ్గించి, సౌర విద్యుత్ వంటి పర్యావరణ హిత ఇంధన వనరులను మరింతగా వినియోగించుకోవాలని నివేదిక సూచించింది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రకటించిన పథకాలను వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్