- బిట్‌చాట్‌పై గుట్టుచప్పుడుగా నిషేధం
- తీవ్రంగా ఖండించిన సిపిఎం పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : బహుళ జాతి కార్పోరేట్ సంస్థలైన ఫేస్‌బుక్, వాట్సాయాప్, గూగుల్ వంటి అధిపతులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండే సామాజిక మాధ్యమాల స్వేచ్ఛను హరిస్తోంది. ఓపెన్ సోర్స్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ క్రమంలోనే ఓపెన్ సోర్స్ మేసేజింగ్ అప్లికేషన్ బిట్‌చాట్ సంస్థపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిషేదం విధించింది. అయితే ఈ నిషేదం విధిస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటించకుండా గుట్టుచప్పుడుగా కేవలం ఆ సంస్థకు మాత్రమే తెలియజేసి భారత్‌లో మూసివేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అని మోడీ సర్కార్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగ విరుద్ధం : సిపిఎం
బిట్‌చాట్‌పై నిషేధం రాజ్యాంగ విరుద్దమని, నిరంకుశ చర్య అని సిపిఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సంఘటితమై సంభాషించుకునే ప్రజల హక్కుపై చేస్తున్న దాడిగా పేర్కొంది. ఇది
ప్రమాదకరమైన, తీవ్రమైన దాడి అని పేర్కొంది. ఈ నిషేధం గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ఉత్తర్వు గానీ జారీ చేయకపోవడం మరింత ఆందోళనకరమని తెలిపింది. బిట్‌చాట్‌ను అభివృద్ధి చేసిన బృందానికి చెందిన జాక్ డోర్సీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కానీ..ఈ నిషేదం సంగతి బహిర్గతం కాలేదని సిపిఎం తెలిపింది. పారదర్శకత లేదా ప్రజా జవాబుదారీతనం లేకుండా రహస్యంగా చేసిన ఈ నిషేధ నిర్ణయం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య నియమాలకు పూర్తిగా విరుద్ధమని పొలిట్ బ్యూరో ఖండించింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జారీ చేసిన ఉత్తర్వుల్లో తక్షణమే యాక్సెస్‌ను నిలిపివేయాలని ఆదేశించడమే కాకుండా, ఆ ప్లాట్‌ఫామ్‌పై శిక్షాత్మక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని పొలిట్‌బ్యూరో వెల్లడించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ అభ్యంతరం చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై కాదని...దాని అభ్యంతరమంతా ఇంటర్నెట్ ఆంక్షలు విధించిన సమయంలోనూ బిట్‌ఛాట్ పనిచేయడంపైనే అని విమర్శించింది. అందుకనే ఆ సంస్థ గొంతు నులిమేశారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినప్పుడల్లా, పౌరులకు బిట్‌ఛాట్ వంటి ఓపెన్ సోర్స్ వేదికలు సందేశాలు పంపుకోవడానికి వీలుకల్పిస్తున్నాయని, మోడీ సర్కార్‌కు కంటగింపుగా మారింది ఇదేనని పేర్కొంది. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన ఒక వైపు కొనసాగుతుండగా అంతులేని ఆంక్షలు విధించిన మోడీ సర్కార్ ఇంటర్నెట్ కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిట్‌ఛాట్ లాంటి సంస్థలను విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు లేకుండా చేయాలని దానిపై నిషేదం విధించినట్లుగా కనిపిస్తోందని సిపిఎం తెలిపింది. పారదర్శకత లేదా సరైన ప్రక్రియ లేకుండా, ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను నిరోధించడానికి అస్పష్టమైన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేయడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా, చట్టబద్ధ పాలనను మరింతగా బలహీనపరుస్తుందని తెలిపింది. బిట్‌చాట్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఏకపక్షంగా నిలిపివేసిన చోటల్లా నిరంతరాయ ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించాలని, ఇలాంటి నిషేధం, ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉత్తర్వులన్నింటినీ బహిరంగపర్చాలని, శాంతియుత నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు, యువతపై జరుగుతున్న వ్యవస్థీకృత అణచివేతకు ముగింపు పలకాలని పొలిట్ బ్యూరో ఈ ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ నిరంకుశ చర్యలను ప్రతిఘటిస్తున్న విద్యార్థులు, యువత, అన్ని ప్రజాస్వామ్య శక్తులకు సిపిఎం అండగా నిలుస్తుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను హరించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.








కామెంట్‌లు (0)