- మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్న సీజేపీ వ్యవస్థాపక నాయకుడు అభిజీత్ దీప్కా సహా పలువురు కార్యకర్తలను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన అనంతరం పోలీసులు విడుదల చేశారు. ఈ ఉదయం వారి అరెస్టును నమోదు చేశారు. అభిజీత్ దీప్కా, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, సీజేపీ న్యాయ విభాగం అధిపతి, న్యాయవాది రత్న సింగ్లను ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ నుంచి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని విడుదల చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అంతకుముందే విడుదల చేసినట్లు సమాచారం. నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన సీజేపీ నాయకులను విమానం దిగిన అనంతరం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నాయకులను రహస్య ప్రాంతాలకు తరలించారని, వారి ఆచూకీపై సమాచారం ఇవ్వడం లేదని సీజేపీ ఆరోపించింది.
కార్యకర్తల విడుదల కోసం దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ నేపథ్యంలో వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు సమాచారం. నిర్బంధంలో ఉన్న వ్యక్తులను కోర్టు ఎదుట హాజరుపరచాలని కోరేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా వెల్లడించారు.








కామెంట్లు (0)