సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు సిజెపి పార్ల‌మెంట్ మార్చ్‌

18 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కొనసాగుతున్న సిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

- దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

- టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ తో భారీగా మోహరించిన పోలీసులు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌, సిబిఎస్ఇ అవ‌క‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ సోమ‌వారం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సిజెపి) ఆధ్వ‌ర్యంలో పార్ల‌మెంట్ మార్చ్‌కు విద్యార్థులు, యువ‌త స‌మాయ‌త్తం అవుతున్నారు. జంత‌ర్ మంత‌ర్‌కు ఆదివారం భారీగా విద్యార్థులు, యువ‌త చేరుకున్నారు. దాదాపు 20 వేల మంది జంత‌ర్ మంత‌ర్‌కు చేరుకున్న‌ట్లు సిజెపి నేత‌లు తెలిపారు. ‘‘బిజెపి చెందిన 30 నుంచి 40 మంది దుండగులు నిరసన ప్రదేశంలోకి చొరబడ్డారు. అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో వారు నేడు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. మనం అటువంటి వాటిని బయటపెట్టి, తిరస్కరించాలి’’ అని సూచించారు. ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ సోన‌మ్ వాంగ్‌చుక్‌ను నిరాహార దీక్ష నుంచి బ‌ల‌వంతంగా పోలీసులు తీసుకెళ్లిన వార్త విన్న అనేక మంది జంత‌ర్‌మంత‌ర్‌కు చేరుకున్నారు. అందులో కొంత‌మంది ప్రముఖులు కూడా ఉన్నారు. విద్యార్థులను విస్మరించి, మంత్రిని కాపాడటంలో ముందున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలిస్తే నిరసనను అణచివేయవచ్చని కేంద్రం భావించగా, బిజెపికి మద్దతిచ్చే తరగతులు సహా అనేక మంది ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు.

పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన స్థలానికి చేరుకుని మద్దతు తెలిపారు. రైతు నాయకుడు రాకేష్ తికాయత్ నేతృత్వంలోని భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన సుమారు 500 మంది రైతులు కూడా నిరసన స్థలానికి చేరుకున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించడంతో, విద్యార్థి-రైతు ఐక్యత పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

సిజెపి ఆందోళ‌న‌కు సంఘీభావం తెలుపుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రధాన్ రాజీనామా కోరుతూ రాజస్థాన్‌లోని సికార్‌లో వేలాది మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు మార్చ్ నిర్వహించారు. క‌ర్ణాట‌క‌లోని బెంగళూరు, త‌మిళ‌నాడులోని చెన్నై, తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, మ‌హారాష్ట్రలోని ముంబాయి, నాగ‌పూర్ వంటి ప‌ట్ట‌ణాల్లో భారీ ర్యాలీలు జ‌రిగాయి. విద్యార్థుల ఆందోళ‌న‌కు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం లభించడం గమనార్హం. జంతర్‌ ‌మంతర్‌‌లో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆదర్శ్ ఎం. సాజి, ఐషీఘోష్‌, సిజెపి నేత అభిజిత్‌ ‌దీప్కే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు ఆదివారానికి రెండోరోజుకు చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్