న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రిటన్ (యూకే) వెళ్తున్న తనను ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేబీ) సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. 'కాక్రోచ్ ఉద్యమం'పై ప్రసంగించేందుకు తనకు ఆక్స్‌ఫర్డ్ నుంచి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు.
సోమవారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా వరుస పోస్టులు చేసిన సౌరవ్ దాస్.. లండన్ వెళ్లే విమానం ఎక్కేందుకు తెల్లవారుజామున ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లగా, తన పాస్‌పోర్ట్ ఫ్లాగ్ చేయబడిందని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్‌ఎస్‌ఈ (LSE), ఎడిన్‌బర్గ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం తనను అడ్డుకుందని ఆయన విమర్శించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించే చర్చాగోష్టిలో పాల్గొనేందుకు తాను లండన్ వెళ్తున్నట్లు దాస్ వివరించారు. చదువుకున్న యువత మేధావుల మధ్యకు వెళ్లి చర్చించడాన్ని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను వేల కోట్ల రూపాయలు మోసం చేసిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లైతే బాగుండేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో తన ప్రయాణం ఆగిపోదని, భవిష్యత్తులో లండన్, పారిస్ సహా ఇతర ప్రాంతాలకు తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై సీజేబీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే స్పందిస్తూ, సౌరవ్ దాస్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడాన్ని చూసి అధికారంలో ఉన్న కొందరు అసూయపడుతున్నారని ఆరోపించారు. విద్యావంతుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ విమర్శించింది.







కామెంట్‌లు (0)