శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సోషల్‌ మీడియాలో ‘బొద్దింకల’ ప్రకంపనలు

2 గంటల క్రితం

melody
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 11:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- వ్యంగ్యమే ఆయుధం

దేశ రాజధాని జంతర్‌మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచీ విజయం సాధించేవరకూ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. ఆందోళనతో పాటు వ్యంగ్యాన్ని ఆయుధంగా చేసుకుని వారు సంధిస్తున్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. నిండా ఇరవై ఏళ్లు కూడా లేని యువత 140 కోట్ల మంది ఆలోచనలను కదిలిస్తోంది. ప్రభుత్వాన్ని, అధికారులను, పోలీసులను, రాజకీయ నాయకులను, భజన మీడియాను, హిందూత్వ మూఢత్వాన్ని ఒకేసారి నిలదీస్తోంది. ప్రతి పోస్టులో నవ్వు ఉంటుంది; ఆ నవ్వు వెనుక ఘాటైన ప్రశ్న ఉంటుంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ప్రతి క్షణాన్ని బంధిస్తూ, జరుగుతున్న పోరాటాన్ని దేశం ముందు ఉంచుతున్నారు.

వారి వ్యంగ్యం ఒక్కోసారి కడుపుబ్బా నవ్విస్తుంది; మరొక్కసారి గట్టిగా ఆలోచింపజేస్తుంది. మోదీ బాత్‌రూమ్‌కు వెళ్లినా దాన్నే హల్వా అంటారని హిందూత్వవాదులను ఎద్దేవా చేసే పోస్టులు, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కుక్కతో పోల్చిన వీడియోలు, "పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ఫండ్ ఇదే" అంటూ చిప్స్ ప్యాకెట్లు చూపించడం, "అందరూ పోరాడుతుంటే మీరు ఎందుకు ముసుగు వేసుకున్నారు?" అంటే "బిజెపికి ఓటు వేశాను" అని చెప్పే వ్యంగ్యం — ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో మోదీ ఇచ్చిన ప్రసంగాలు మళ్లీ వినిపిస్తూ, వాటినే నేటి పరిస్థితులతో పోల్చి ప్రశ్నిస్తున్నారు.

రైతుల పోరాటంలో వందలాది మంది మరణించినా రాజీనామాలు లేవు. నోట్ల రద్దులో ప్రాణాలు కోల్పోయినా బాధ్యత తీసుకున్నవారు లేరు. పుల్వామా, పెహల్గాం దాడులు, రూపాయి విలువ పతనం, వరుస రైలు ప్రమాదాలు—ఏ ఘటన జరిగినా అధికారంలో ఉన్నవారి జవాబుదారీతనం కనిపించలేదని పోస్టులు గుర్తుచేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు, పెట్రోలు ధరలు పెరగడం, విద్యావ్యవస్థ దెబ్బతినడం, మత ఘర్షణలు పెరగడం, అశాస్త్రీయ ఆలోచనలకు ప్రోత్సాహం లభించడం—ఇవన్నీ కలిపి దేశం ఏ దిశగా వెళ్తోందో చూపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

నీట్ పేపర్ లీకేజీపై వారి పోస్టులు మరింత పదునుగా ఉన్నాయి. "పేపర్ లీక్‌తో డాక్టర్ అయినవారు వైద్యం ఎలా చేస్తారు?" అనే ప్రశ్నతో మొదలై, పొంతన లేని చికిత్సల పేర్లు చెబుతూ అవినీతిని ఎద్దేవా చేస్తున్నారు. లాఠీచార్జి చేసిన పోలీసులను, "ఇంటికి వెళ్లి మీ పిల్లలకు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రశ్నించిన విద్యార్థులను కొట్టామని గర్వంగా చెప్పండి" అంటూ చప్పట్లతో సాగనంపడం, లాఠీచార్జి సమయంలో అదృశ్యమైన యూనిఫామ్‌లు, నేమ్‌ప్లేట్‌లు తర్వాత మళ్లీ ప్రత్యక్షమవడాన్ని ప్రశ్నించడం, జాతీయ జెండాను కాళ్లతో తొక్కుతున్న పోలీసుల వీడియోలను చూపించడం—ఇవన్నీ వారి నిరసనకు మరో రూపం.

పోలీసులతోనూ వారు వ్యంగ్యాన్నే ఆయుధంగా వాడుతున్నారు. "ప్రొటెస్ట్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ" అంటూ హెల్మెట్లు పెట్టుకుని రావడం, బ్యారికేడ్లతో ఆటలాడడం, "నన్ను ఆయుష్మాన్ ఖురానాను కలవనివ్వలేదు" అంటూ పోలీసుల పక్కనే నిలబడి వీడియోలు తీయడం—ఇలా ఉద్రిక్తతను హాస్యంగా మార్చి అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు.

మూఢత్వం, మూఢవిశ్వాసాలు, కుల, మత జాఢ్యంపై కూడా వారి వ్యంగ్యం అంతే పదునుగా ఉంది. "నాసా వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రహాలపై పరిశోధనలు చేస్తుంటే, మన దగ్గర 101 రూపాయలు తీసుకుని గ్రహాల దిశ మార్చేస్తామని చెప్పేవారు ఉన్నారు" అని ఎద్దేవా చేస్తున్నారు. "పెట్రోలు ముస్లిం దేశాల నుంచి వస్తాయి కాబట్టి వాహనాల్లో ఆవు మూత్రం పోయాలి", "తక్కువ కులాల ఆటో డ్రైవర్లను నమ్మకూడదు", "రాముడే వచ్చి ప్రశ్నించినా ముస్లింగా ముద్ర వేస్తారు"—ఇలాంటి వ్యంగ్యాల ద్వారా అంధ విశ్వాసాలను, మతపరమైన విద్వేష రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. "మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే, హిందూ - ముస్లిం చర్చ ఎందుకు తెస్తున్నారు?" అని వారు అడుగుతున్న ప్రశ్న నేరుగా సమాజానికే సంధించిన ప్రశ్న.

చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు. రాసుకుంటూ పోతే ఒక పుస్తకం చాలదు. ఈ పోస్టులు చేస్తున్నవారు టెక్నీషియన్లు, మేధావులు, తత్వవేత్తలు కాదు. కల్మషం లేని ఆలోచనలతో దేశాన్ని అద్దం ముందు నిలబెడుతున్న యువత. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు దాటి ఒక లక్ష్యం కోసం నిలబడుతున్నారు. వారికి తిండి పంపుతున్నవారు, మద్దతు తెలుపుతున్నవారు కూడా ఒక్క వర్గానికి చెందినవారు కాదు. ఇన్నేళ్ల పాలనలో దేశం ఎదుర్కొన్న సమస్యలను పారడీ పాటలతో, చిన్న వీడియోలతో, ఇంటర్వ్యూలతో కొన్ని నిమిషాల్లో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.

రోడ్డుపై బండి సరిగా నడపకపోతే యువత చెడిపోయిందని తేలిగ్గా విమర్శిస్తుంటాం. కానీ అదే యువత ఇప్పుడు సోషల్ మీడియాను ప్రజాస్వామ్య వేదికగా మార్చి సంకుచితత్వాన్ని, మూఢత్వాన్ని ప్రశ్నిస్తోంది. అధికారాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాలను అణచివేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, మీడియాను నియంత్రించడం, విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టడం, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం—ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలేనని గుర్తుచేస్తోంది. యువతను అశాస్త్రీయ ఆలోచనలతో పక్కదారి పట్టించవచ్చని ఎవరైనా భావిస్తే అది పొరపాటే. రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్న ఈ దేశం, ఏ అధికారాన్నైనా ప్రశ్నించే శక్తిని కోల్పోలేదు. అవినీతి, అహంకారం, అణచివేత శాశ్వతం కావని, వ్యంగ్యం కూడా ఒక ఉద్యమ భాషే అని ఈ 'బొద్దింకలు' దేశానికి గుర్తుచేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్