శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చరిత్ర సృష్టించిన జోలీ-గాయత్రి జోడి

2 గంటల క్రితం

india team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 06:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన జోడి

- భారత్‌కు పతకం ఖాయం

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో త్రిస జోలీ-గాయత్రి గోపీచంద్ జోడి చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరిన ఈ జోడి.. భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు జియాన్ జోడిని ఓడించి ఈ ఘనత సాధించింది. కన్నూర్‌కు చెందిన త్రిస జోలీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి మలయాళీ క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో త్రిస-గాయత్రి జోడికి ఆరంభం అనుకూలంగా సాగలేదు. తొలి గేమ్‌లో చైనా జోడి 21-16తో విజయం సాధించింది. అయితే రెండో గేమ్‌లో భారత జోడి అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ 21-15తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ అదే జోరును కొనసాగించిన భారత జోడి 21-13తో గెలిచి మ్యాచ్‌ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లడంతో పాటు పతకాన్ని ఖాయం చేసుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు 15 ఏళ్ల తర్వాత పతకం లభించింది. 2011 లండన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించిన తర్వాత ఈ విభాగంలో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే.

ఈ టోర్నీలో భారత్‌కు ఖాయమైన ఏకైక పతకం కూడా త్రిస-గాయత్రి జోడిదే. పీవీ సింధు, లక్ష్య సేన్, ఉన్నతి హూడా, ఆయుష్ శెట్టి వంటి భారత అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించారు. 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాన్ని ఖాయం చేసిన త్రిస జోలీ-గాయత్రి గోపీచంద్ జోడిపై భారత క్రీడాభిమానుల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్