mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒడిశాలో జంటపై మూకదాడి

2 గంటల క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:20 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

యువతి బట్టలు చింపేసి లైంగిక వేధింపులు

రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడి

డబుల్‌ ఇంజన్‌ సర్కారులో పెచ్చుమీరుతున్న నేరాలు

భువనేశ్వర్‌ : డబుల్‌ ఇంజన్‌ ‌సర్కారు కొలువు దీరిన ఒడిశాలో నేరాలు పెచ్చుమీరుతున్నాయి. రౌడీ మూకలు యథేచ్ఛగా దాడులు చేస్తున్నాయి. సామాజిక సేవ చేసేందుకు ఎన్‌‌జిఒతో కలిసి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న యువతీ యువకుల బైకును వెంబడించి, పడిపోయిన వారిపై తీవ్రంగా దాడిచేసి, యువతి బట్టలు చింపేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడికి పాల్పడటంతోపాటు వెంబడించి కమ్యూనిటీ హెల్త్‌ ‌సెంటర్‌ ఆవరణ ధ్వంసం చేశారు. రాయగడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌‌పి) రాజ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ‘ఢిల్లీకి చెందిన యువతి, గుజరాత్‌‌లోని సూరత్‌‌కు చెందిన యువకుడు గత ఏడాది సెప్టెంబర్ నుండి గిరిజన ప్రాంతాల్లో ఒక ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌లో భాగంగా ఒడిశాలోని ఒక ప్రముఖ ఎన్జీఓ (ఎన్‌‌జిఒ)లో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న కంధమాల్ జిల్లాలోని దారింగ్‌బాడి నుండి ఆ ఇద్దరు కార్యకర్తలు వస్తుండగా ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. రాయగడ జిల్లా కల్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్‌లో, కొందరు దుండగులు వారిని పిల్లలను ఎత్తుకెళ్లేవారిగా చిత్రీకరిస్తూ పుకార్లు సృష్టించారు. తమను డజన్ల కొద్దీ యువకులు మోటారు సైకిళ్లతో తరుముతుండటంతో యువతీ యువకులు ఆందోళన చెందారు. ఒక పొలం వద్ద వారి వాహనం రాత్రి 8.30 గంటల సమయంలో అదుపు తప్పి పడిపోయింది. వెంటనే వారిపై మూకదాడి చేశారు. ఆ యువకుడిని చితకబాదారు. యువతిని కొట్టడంతోపాటు ఆమె దుస్తులు చించేశారు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్‌‌పి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి లైంగిక దాడి, మూకదాడి, అల్లర్లకు సంబంధించిన సెక్షన్లతో మూడు కేసులు నమోదు చేశామని చెప్పారు. శనివారం అరెస్టు చేసిన నలుగురితో కలిపి మొత్తం 20 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల్లో ఎక్కువమంది 30 ఏళ్ల వయసు గలవారేనని, దాడి సమయంలో తీసిన ప్రతి వీడియో క్లిప్‌‌ను పరిశీలిస్తున్నామన్నారు.


మహిళల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలి : నవీన్‌ ‌పట్నాయక్‌

రాష్ట్రంలో మహిళల భద్రతను, శాంతిభద్రతలను కాపాడటానికి మాఝీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిమాండ్‌ ‌చేశారు. ‘ఇటీవల భువనేశ్వర్ శివార్లలో ఒక యువ పోలీస్ కానిస్టేబుల్‌ను ఒక మూక కొట్టి చంపింది.


జట్టు పట్టుకుని ​కొట్టారు.. దుస్తులు చింపేశారు... అసభ్యంగా తాకారు : కన్నీటిపర్యంతమైన యువతి

"వారు నన్ను కొట్టారు, జుట్టు పట్టుకుని లాగారు, నా దుస్తులు చింపేశారు. అసభ్యంగా తాకారు. నేను చాలా భయపడుతున్నాను, నా ఊరికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఇక్కడికి వచ్చిన మేము ఇలా అవుతుందని అనుకోలేదు’’ అంటూ ఆ యువతి కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ తమకు ఆ ప్రాంతం గురించి అవగాహన లేకపోవడంతో దారి తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నామని ఆమె స్థానిక మీడియాతో చెప్పారు. "మేము ప్రయాణిస్తుండగా, స్థానికుడినని చెప్పుకున్న ఒక వ్యక్తి రోడ్డు బాగోలేదని, ముందుకు వెళ్లవద్దని మాకు చెప్పాడు. మేము వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తుండగా, అతను మా స్కూటర్ తాళం చెవిని లాక్కోవడానికి ప్రయత్నించి, మా గుర్తింపు కార్డులను చూపించాలని అడిగాడు. నేను నా గుర్తింపు కార్డు చూపించినప్పటికీ, అతను మమ్మల్ని నమ్మలేదు. అకస్మాత్తుగా జనం గుమిగూడటంతో మేము భయపడ్డాము," అని ఆమె పేర్కొన్నారు. తన సహోద్యోగి స్కూటర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా, మోటార్‌సైకిళ్లపై ఉన్న స్థానికులు తమను వెంబడించారని ఆమె చెప్పారు. ఒక పొలం దగ్గర వారి స్కూటర్ అదుపు తప్పి పడిపోవడంతో, గుంపు వారిని పట్టుకుని, ఇద్దరిపై దాడి చేసి, తన దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు పాల్పడిందని ఆమె తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కొందరు స్థానికుల సహాయంతో వారిద్దరినీ రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ గుంపు హింసాత్మకంగా ప్రవర్తిస్తూ వారిపై దాడిని కొనసాగించింది. ఆ ప్రాంతంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల బలరామ్ బాగ్ (26) వారిని రక్షించడంలో పోలీసులకు సహాయపడ్డారు. ఆయన మొదట వారిని పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. "దాడి చేస్తున్న గుంపు నుంచి వారిని బయటకు లాగి, పోలీసు వాహనం వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. ఆ గుంపు ఆమె దుస్తులు చింపేయడంతో, నా టీ-షర్ట్‌ను తీసి ఆమెకు ఇచ్చాను," అని ప్రత్యక్ష సాక్షి బలరామ్ చెప్పారు. ఆ గుంపు ఎంత హింసాత్మకంగా ఉందంటే, వారు పోలీసు వాహనాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వరకు వెంబడించి, అక్కడి ఆవరణను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నించారని ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్