మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్ మంతర్ నిరసనల నిలిపివేతపై పిటిషన్: నేడు విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు

1 గంట క్రితం

జంతర్ మంతర్ నిరసనల నిలిపివేతపై పిటిషన్: నేడు విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు

జంతర్ మంతర్ నిరసనల నిలిపివేతపై పిటిషన్: నేడు విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 08:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

నిరసనలకు ప్రసిద్ధి చెందిన ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను మూసివేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుపుతున్నందున, ఈ పిటిషన్‌ను మంగళవారానికి (అక్టోబర్ 13) లిస్ట్ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.


సోమవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది కోర్టును కోరగా.. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (యాక్టింగ్ చీఫ్ జస్టిస్) నితిన్ సాంబ్రే నేతృత్వంలోని బెంచ్ దీనిని నిరాకరించింది. “సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాకుండా, దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. సర్వోన్నత న్యాయస్థానం దీనిని పరిశీలిస్తున్న తరుణంలో, మనం ఏమేరకు జోక్యం చేసుకోగలమో చూడాల్సి ఉంది. అందుకే దీనిని మంగళవారం విచారిస్తాం” అని బెంచ్ పేర్కొంది.


ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. “నేడు జంతర్ మంతర్‌ను కూడా మూసివేశారు. చట్టబద్ధంగా నిరసన తెలిపేందుకు ఎగ్జిక్యూటివ్ ఏ ఇతర ప్రదేశాన్ని కూడా కేటాయించలేదు. శాంతియుత నిరసనలను అణచివేస్తున్నారు. ఇది అత్యంత చీకటి రోజు. 1975లో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపిస్తోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ గ్రౌండ్‌లను కేటాయించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్