ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) చివరి ఘట్టానికి చేరుకుంది. గత 22 ఏళ్లుగా 161 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించిన ఈ షో, ఇప్పుడు తన 9వ, ఆఖరి సీజన్‌తో వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 14 నుండి 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) ఓటీటీ వేదికగా ఈ ముగింపు సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
సినీ తారల నిజస్వరాలు.. వివాదాలకు కేంద్ర బిందువు:
2004 నవంబర్ 19న 'స్టార్ వరల్డ్' ఛానెల్‌లో ప్రారంభమైన ఈ షో, బాలీవుడ్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి అభిరుచులతో పాటు పరిశ్రమలోని అంతర్గత విషయాలను వెలికితీయడంలో ప్రత్యేక ముద్ర వేసింది. అంతకుముందు సిమి గరేవాల్ నిర్వహించిన 'రాండేవు విత్ సిమి గరేవాల్' లాంటి ప్రశాంతమైన, విశ్లేషణాత్మక టాక్ షోలకు భిన్నంగా కరణ్ జోహార్ ఈ షోను పూర్తి గ్లామర్, వినోదం, వివాదాస్పద వ్యాఖ్యలతో నింపేశారు.
మొదటి కొన్ని సీజన్లలో సెలబ్రిటీలు ఎంతో స్వేచ్ఛగా, ఎటువంటి దాపరికాలు లేకుండా మాట్లాడేవారు. అయితే, సోషల్ మీడియా విస్తృతి మరియు విమర్శల భయం పెరిగిన తర్వాత నటీనటులు జాగ్రత్త పడటం ప్రారంభించారు. పి.ఆర్ బృందాల సలహాల మేరకు సమాధానాలు చెప్పడం వల్ల చివరి సీజన్లలో పాత మజా కొంత కొరవడిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అయినప్పటికీ, హిందీ పాప్ సంస్కృతిలో (Pop Culture) ‘కాఫీ విత్ కరణ్’ సృష్టించిన ప్రభావం అపారమైనది. 22 ఏళ్ల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాక్ షో, చివరి సీజన్‌తో తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకబోతోంది.







కామెంట్‌లు (0)