మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్షీణించిన వాయు నాణ్యత

09 నవంబర్, 2026

air pollution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- విశాఖ, రాజమండ్రిలో భారీగా తగ్గుదల

- దీపావళి వేడుకల్లో తీవ్ర శబ్దకాలుష్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దీపావళి రోజున బాణసంచా కాల్చడంతో రాష్ట్రంలో వాయు నాణ్యత ఆందోళనకర స్థాయిలో క్షీణించింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాల్లో పేలవమైన (పూర్‌) ‌స్థాయికి దిగజారాయి. అత్యంత చిన్న ధూళి కణాలు (పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ - 10, 2.5) స్థాయిలు జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణాలను మించాయి. రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లో 101 నుంచి 200 మధ్య వాయు నాణ్యత సూచీ (ఎక్యూఐ) నమోదై, మోస్తరు (మోడరేట్‌) స్థాయిలో ఉంది. విశాఖపట్నంలో దీపావళి రోజున సగటు శబ్ద తీవ్రత 62 నుంచి 75 డెసిబుల్స్‌ (dB(A)) మధ్య నమోదైంది. గరిష్ఠంగా 111 డెసిబుల్స్‌కు చేరింది. రాత్రి సమయంలో నివాస ప్రాంతాల్లో అనుమతించిన ప్రమాణం 45 డెసిబుల్స్‌ మాత్రమే. విజయవాడ నగరంలో సగటు శబ్ద తీవ్రత 63 నుంచి 77 డెసిబుల్స్‌ మధ్య నమోదైంది. గరిష్ఠంగా 112 డెసిబుల్స్‌కు చేరింది. ఇక్కడ కూడా రాత్రి సమయంలో నివాస ప్రాంతాల్లో నిర్దేశించిన ప్రమాణం 45 డెసిబుల్స్‌ మాత్రమే. అమరావతి, ఏలూరు, కాకినాడ నగరాల్లో పిఎం10 కణాలు ఎక్కువగా ఉండగా, విజయవాడలో పిఎం 2.5, పిఎం 10 రెండూ ప్రధాన కాలుష్య కారకాలుగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో శబ్ద తీవ్రత నమోదైంది. 2025, 2026 సంవత్సరాల్లో నమోదైన గాలి, శబ్ద కాలుష్య గణాంకాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని ఎపిపిసిబి పేర్కొంది. మధ్యస్థంగా ఉన్న నగరాల్లో తిరుపతిలో అత్యధికంగా 191 ఎక్యూఐ నమోదు కాగా, నెల్లూరు (175), శ్రీకాకుళం (170) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఏలూరులో అత్యల్పంగా 118 నమోదైంది. ఆదివారం వరకు సంతృప్తికరమైన గాలి నాణ్యత కలిగిన అమరావతి, విజయవాడ, గుంటూరు, అనంతపురం నగరాల్లో కూడా ఒక్కసారిగా వాయు నాణ్యత క్షీణించింది.

ఢిల్లీ, యూపిలో మరింత ఘోరం...

దేశ రాజధాని ఢిల్లీ, యుపిలోని లోనిలో వాయు కాలుష్యం మరింత ఘోరంగా ఉంది. ఢిల్లీలో ఎయిర్‌ ‌క్వాలిటీ ఇండెక్స్‌ (ఎక్యూఐ) 400 ‌నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌‌లోని లోనీ పట్టణంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చిన కొన్ని గంటల్లోనే అక్కడి గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. గత 12 నెలల్లో ఈ పట్టణంలో సగటు పీఎం 2.5 స్థాయులు ప్రతి క్యూబిక్ మీటరుకు 112.5 మైక్రోగ్రాములుగా రికార్డయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వార్షిక పరిమితి 5 మైక్రోగ్రాములతో పోలిస్తే ఇది22 రెట్లకుపైగా అధికం.

ఎక్యూఐ పెరిగితే శ్వాసకోస ఇబ్బందులు

గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) 101-200 మధ్య ఉంటే ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారికి శ్వాసకోశ అసౌకర్యం కలుగుతుందని, 201-300 స్థాయికి చేరితే ఎక్కువ సమయం బయట గడిపే సాధారణ ప్రజలకు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు.

నిరంతరం పర్యవేక్షించాం : ఎపిపిసిబి

దీపావళి నేపథ్యంలో 72 మాన్యువల్‌ కేంద్రాలు, 20 నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల (సిఎఎక్యూఎంఎస్‌) ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించినట్లు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) తెలిపింది. రాష్ట్రంలోని నగరాల్లో వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు అదనంగా 150 ఐఓటీ (IoT) సెన్సార్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో శబ్ద తీవ్రతను కొలిచేందుకు 25 రియల్‌టైమ్‌ నాయిస్‌ మానిటరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

విశాఖలో వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు

విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు ఎపిపిసిబి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను నిరంతరం పర్యవేక్షించేందుకు సంబంధిత శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం పోర్టు అథారిటీ, హెచ్‌పిసిఎల్‌, కోరమాండల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, రైన్‌ సిఐఐ, ఎస్సార్‌ స్టీల్స్‌ తదితర పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాయి. విశాఖ నగరంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న ఎనిమిది పరిశ్రమలపై ఎపిపిసిబి రూ.16.32 కోట్ల జరిమానా విధించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్