లక్నో : ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లలో తప్పులపై సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (డివిజనల్ కమిషనర్ హోదాలో ఉన్నవారు), అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ పొరపాట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. శుక్రవారం జరిగిన శాసనమండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో "రామ్ నే యాదవ్ కో మారా" బదులుగా "రామ్ నే శర్మ కో మారా" వంటి పేర్లు, ఓటరు తండ్రి పేరు స్థానంలో "బికామ్" అని ఉండటం వంటి లోపాలు వెలుగుచూశాయి. అలహాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో పోలింగ్‌కు ముందు ఈ తప్పులు వెలుగుచూశాయి. శాసన మండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చేందుకు ఉత్తర ప్రదేశ్‌లో తొలిసారిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించారు. "ఏదైనా పనిని మొదటిసారి చేస్తున్నప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఓటర్ల జాబితాలోని మొత్తం 14,81,310 నమోదులలో, 158 చోట్ల ఓటర్ల పేర్లు లేదా వారి బంధువుల పేర్లు నమోదులో పొరపాట్ల వల్ల వింతగా కనిపిస్తున్నాయి" అని ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంగ్లంలో టైప్ చేసిన పేర్లను హిందీలోకి అనువదించాల్సిన సాఫ్ట్‌వేర్, ఏదో లోపం కారణంగా వాటిని తప్పుగా అనువదించింది. ఇలాంటి తప్పులను సవరించి, సరిదిద్దాల్సిన బాధ్యత డివిజనల్ కమిషనర్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, సంబంధిత జిల్లా అధికారి అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఇఆర్‌ఒ)దని, తప్పులపై వారి వివరణ కోరామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని 30కి పైగా జిల్లాల పరిధిలోని ఐదు పట్టభద్రుల, ఆరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో 14 లక్షలకు పైగా ఓటర్లు శుక్రవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Print Editionఓటర్ల జాబితాలో తప్పులపై వివరణకు ఇసి ఆదేశం
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)