సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆప్‌ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు, ప్రభుత్వ అధికారులకు ఈడి నోటీసులు

22 నిమిషాల క్రితం

ED summons .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చండీగఢ్‌ : మోగా ఎమ్మెల్యే అమన్‌దీప్‌ కౌర్‌ అరోరాపై మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఆమె కుటుంబసభ్యులు, ధర్మకోట్‌ ఆప్‌ ఎమ్మెల్యే, పంజాబ్‌ ప్రభుత్వ ప్రస్తుత, మాజీ అధికారులకు ఈడి సోమవారం సమన్లు జారీ చేసింది. అమన్‌దీప్‌ కౌర్‌ అరోరా, ఆమె భర్త రాకేష్‌ అరోరాలు ఈనెల 24, 25 తేదీల్లో చండీగఢ్‌ జోనల్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో నవంబర్‌ 27న విచారణకు హాజరు కావాలని ధర్మకోట్‌ ఎమ్మెల్యే దేవిందర్‌జీత్‌ సింగ్‌ లడ్డీ ధోస్‌కు ఈడి సమన్లు ​​జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మోగా ఎమ్మెల్యే అమన్‌దీప్‌ కౌర్‌ అరోరాపై నమోదైన కేసులో ఈ విచారణ చేపడుతోంది. అలాగే అరోరా తండ్రి జస్పాల్ సింగ్, సోదరుడు వల్జిందర్ సింగ్, మేనమామ హర్మిందర్ సింగ్‌లను వరుసగా నవంబర్ 27, నవంబర్ 30, డిసెంబర్ 2 తేదీల్లో సాక్ష్యం చెప్పేందుకు హాజరు కావాలని కోరారు.

మోగా ఎమ్మెల్యే అమన్‌దీప్‌ కౌర్‌ అరోరా, ఆమె భర్త కలిసి రహదారి నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో స్థానికులకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం నిధులను అక్రమంగా మళ్లించేందుకు సహకరించారని ఈడి ఆరోపించింది. ఈ నెల ప్రారంభంలో ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్రమాన్‌ గ్రామంలోని ప్రభుత్వ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలపై ధర్మకోట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడి మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జాతీయ రహదారి 754A నిర్మాణం కోసం సేకరించిన భూమికి సంబంధించి కోటి రూపాయలకు పైగా పరిహార నిధులను అక్రమంగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రకు సంబంధించిన వివరాలను వెలికితీసేందుకు మోగా జిల్లా రెవెన్యూ అధికారి గురుదేవ్‌ సింగ్‌ ధామ్‌, స్థానిక పట్వారీ నిర్వైర్‌ సింగ్‌, జిల్లా మాజీ తహసీల్దార్‌ లఖ్విందర్‌ సింగ్‌ గిల్‌లకు కూడా ఈడి సమన్లు ​​జారీ చేసింది. కౌర్‌ అరోరాకు సంబంధం ఉన్న ఆస్పత్రి, వ్యసన విముక్తి కేంద్రంలో భాగస్వామిగా, డైరెక్టర్‌గా ఉన్న లఖ్విందర్‌ అనే వ్యక్తిని సోమవారం ఈడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


పంజాబ్‌లో ఆప్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న అమన్‌దీప్‌ కౌర్‌ అరోరాను వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి పార్టీ మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తనపై బిజెపి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. తన నివాసంలో 42 గంటల పాటు ఈడి సోదాలు నిర్వహించిన సమయంలో బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని అధికారులు పదేపదే ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొన్నారు. తన నివాసం, ఆస్పత్రిలో సోదాలు చేసినప్పటికీ ఈడి అధికారులు ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేకపోయారని, ఖాళీ చేతులతో తిరిగి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్