సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూతాపంపై వేడెక్కిన చర్చలు.. ఏకాభిప్రాయం లేక చేతులెత్తేసిన కాప్-31

23 నిమిషాల క్రితం

భూతాపంపై వేడెక్కిన చర్చలు.. ఏకాభిప్రాయం లేక చేతులెత్తేసిన కాప్-31
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అంటాల్యా:

భూతాపం నియంత్రణపై ఉమ్మడి ప్రకటన సాధ్యం కాకుండానే ఐక్యరాజ్యసమితి కాప్-31 (COP31) వాతావరణ సదస్సు ముగిసింది. శిలాజ ఇంధనాల (ఫాసిల్ ఫ్యూయల్స్) ప్రస్తావన లేకుండా విడుదల చేసిన తుది ముసాయిదా పత్రంపై సభ్య దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో దానిపై సంతకాలు జరగలేదు.


టర్కీలోని అంటాల్యాలో జరిగిన 31వ సదస్సులో శిలాజ ఇంధనాల అధిక వినియోగాన్ని నియంత్రించడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 24 గంటలకు పైగా అనిశ్చితి కొనసాగింది. భూతాపాన్ని తగ్గించే అంతర్జాతీయ ఒప్పందంలో ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల గురించి ప్రస్తావించాలా వద్దా అనే అంశంపై తీవ్ర వివాదం నెలకొంది.


ఏకాభిప్రాయ అవకాశాలు సన్నగిల్లడంతో హడావిడిగా ముసాయిదా పత్రాన్ని విడుదల చేసినప్పటికీ, అందులో శిలాజ ఇంధనాల నియంత్రణ ప్రస్తావనను తొలగించడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే, ఇంధన నియంత్రణ వల్ల మూడో ప్రపంచ దేశాలకు (అభివృద్ధి చెందుతున్న దేశాలకు) కలిగే నష్టాలకు అందించే ఆర్థిక నిధులను పెంచడం వంటి అంశాలపై కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభ్య దేశాలు వెనక్కి తగ్గలేదు. ఆదివారం తెల్లవారుజామున 10 పేజీల ముసాయిదా పత్రాన్ని ప్రకటించారు.


ముసాయిదా పత్రంపై అభ్యంతరాలు లేదా మార్పులను సూచించడానికి ప్రతినిధులకు అధ్యక్షుడు కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఇచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల తర్వాతే ఈ పత్రాన్ని ప్రతినిధులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో దేశాలు, పర్యావరణవేత్తలు వెంటనే స్పందించలేకపోయారు. ఇది కూడా తీవ్ర నిరసనలకు దారితీసింది.


రెండు వారాల పాటు జరిగిన ఈ సదస్సు నవంబర్ 20, శుక్రవారం ముగియాల్సి ఉంది. కానీ విభేదాల కారణంగా ఆదివారం వరకు పొడిగించారు. అనేక దేశాల ప్రతినిధులు అసంతృప్తితో వెనుదిరిగారు. దీంతో ముసాయిదా పత్రం ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించదని స్పష్టమైంది.


ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే 31వ అంతర్జాతీయ వాతావరణ సదస్సే కాప్-31 (COP31 - 31st Conference of the Parties). భూతాపం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏటా సమావేశమయ్యే అతిపెద్ద అంతర్జాతీయ వేదిక ఇది. 1992లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒప్పందం (UNFCCC)లో సంతకం చేసిన దాదాపు 200 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయి కంటే భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా నియంత్రించాలనే 2015 పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోలేకపోయిన నేపథ్యంలో ఈ సదస్సు జరిగింది.


ముసాయిదా పత్రం మొదటి వాక్యంలో 2023 నాటి దుబాయ్ సదస్సులో కుదిరిన యూఏఈ ఏకాభిప్రాయాన్ని (UAE Consensus) గుర్తు చేశారు. అయితే, పది పేజీల ముసాయిదాలో ఎక్కడా 'శిలాజ ఇంధనాలు', 'చమురు', 'బొగ్గు', 'దశలవారీగా తొలగింపు' వంటి కీలక పదాలు కనిపించలేదు. దుబాయ్ సదస్సులో శిలాజ ఇంధనాల వినియోగం నుంచి తప్పుకోవడానికి ప్రపంచ దేశాలు తుది అంగీకారానికి వచ్చాయి. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సుల దాదాపు మూడు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా అధికారిక పత్రంలో శిలాజ ఇంధనాల గురించి ప్రస్తావించి, వాటిని విడనాడాలని పిలుపునివ్వడం దుబాయ్ ఒప్పందం ప్రత్యేకత. ఇప్పుడు టర్కీ సదస్సులో ఆ నిర్ణయం నుంచి పెద్ద ఎత్తున వెనకడుగు పడినట్లయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్